డాక్టర్ ఇంట్లో భారీ దోపిడీ.. ఆయన భార్య కాళ్ళు, చేతులు కట్టేసి..

డాక్టర్ ఇంట్లో భారీ దోపిడీ.. ఆయన భార్య కాళ్ళు, చేతులు కట్టేసి..

బెజవాడ మాచవరం ఆయుర్వేదిక్ డాక్టర్ ఇంట్లో జరిగిన భారీ దోపిడీని పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి.. డాక్టర్ కొడుకు పీకపై కత్తి పెట్టారు.. భార్యను బెదిరించారు. బీరువాలో ఉన్న 50 లక్షలు, కొంత బంగారాన్ని తీసుకున్నారు. దోపిడీ అనంతరం తల్లీకొడుకు కాళ్ళు, చేతులు కట్టేసి పరారయ్యారు.

ఈనెల 14న మాచవరం ఆయుర్వేదిక్ డాక్టర్ మురళీధర్ ఇంట్లో ఈ దోపిడీ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. దోపిడీ తీరును బాధిత డాక్టర్ భార్య, కొడుకును అడిగి తెలుసుకున్నారు. దుండగుల చేతులకు సర్జికల్ గ్లౌవ్స్, మాస్కులు ధరించిన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో మొత్తం నలుగురు పాల్గొన్నట్లు బాధితులు పోలీసులకు వివరించారు. ఐతే.. దోపిడీకి పాల్పడింది డాక్టర్ వ్యక్తిగత వివరాలు తెలిసిన వారేనని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. రాబరీ జరిగిన ఇంటి పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ పరిశీలించారు. ఆ ప్రాంతాన్ని కమిషనర్ బత్తిన శ్రీనివాస్ పరిశీలించి 7 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కేసు దర్యాప్తులో దిశానిర్దేశం చేశారు.

ఈ దోపిడీలో సూత్రధారి ఆసుపత్రి పీఆర్వో మెండం విజయ్, గతంలో ఆసుపత్రిలో క్యాంటీన్ నిర్వహించిన నాగేంద్రగా గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. దోపిడీకి గురైన 50 లక్షల రూపాయల్లో... 37 లక్షలతో పాటు కొంత బంగారాన్ని రికవర్‌ చేశారు. దోపిడీ జరగడానికి ముందు పీఆర్వో మెండం విజయ్ ఫోన్‌ చేసి.. మీ ఇంటి ముందు నలుగురు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని.. ఇంటి తలుపులు వేసుకోమని చెప్పాడని డాక్టర్ భార్య వివరించారు. డాక్టర్‌ కుమారుడు అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని ప్రశ్నించగా.. దౌర్జన్యంగా లోపలికి వచ్చినట్లు తెలిపారు.

పీకపై కత్తిపెట్టి.. తమను బెదిరించి దోపిడీకి పాల్పడ్డారని డాక్టర్ భార్య పోలీసులకు తెలిపారు. ఈ ఒక్క ఆధారంతో పోలీసులు రాబరీపై ఓ క్లారిటీకి వచ్చారు. సర్జికల్ గ్లౌవ్స్ వాడడం, పీఆర్వో విజయ్ డాక్టర్ భార్యకు ఫోన్ చేయడంతో విజయ్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు.

విజయవాడ పెనమలూరుకు చెందిన మెండం విజయ్ ఐదేళ్లుగా డాక్టర్ మురళిదర్ వద్ద పనిచేస్తున్నాడు. డాక్టర్ సొంత వ్యవహారాలు కూడా విజయ్ చూస్తుంటాడు. ఇదే నేపథ్యంలో మాచవరంలో డాక్టర్ ఓ భవనం నిర్మిస్తున్నారు. ఇంట్లో పెద్దమొత్తంలో డబ్బు ఉండడాన్ని పసిగట్టిన విజయ్.. గతంలో క్యాంటీన్ నిర్వహించిన నాగేంద్రలు దోపిడీకి స్కెచ్ వేశారు. విజయ్ స్నేహితుడు తాడేపల్లి వాసి జాన్ వెస్లీ, కిరణ్, అఖిల్, కిస్మత్‌తో కలిసి దోపిడీకి పాల్పడ్డట్లు సీపీ బత్తిన శ్రీనివాస్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story