యువకుడిని బలితీసుకున్న క్రికెట్‌ బెట్టింగ్

యువకుడిని బలితీసుకున్న క్రికెట్‌ బెట్టింగ్
X

సులభంగా డబ్బు సంపాదించవచ్చనే అత్యాశతో యువత.. లక్షల్లో బెట్టింగ్‌లు కాస్తున్నారు. ఆస్తులు అమ్మడమే కాక.. అప్పులు తెచ్చిమరి జూదంలో పెడుతున్నారు. చివరికి నష్టపోవడంతో అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. తమ బంగారు భవిష్యత్‌కు ముగింపు పలుకుతున్నారు.

తాజాగా గుంటూరు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌లకు మరో యువకుడు బలయ్యాడు. పెదకూరపాడు మండలం తాళ్లూరుకు చెందిన సురేష్‌, బెల్లంకొండ బుడగ జంగాలకు చెందిన కొమరయ్య.. ఇద్దరు క్రికెట్‌ బెట్టింగ్‌ కాసి నష్టపోయారు. దీంతో డబ్బులు ఇవ్వాలని నిర్వాహకులు గత కొన్ని రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నారు. అన్ని అమ్ముకుని బెట్టింగ్‌కు పెట్టిన సొమ్ము పోగా.. ఇప్పుడు డబ్బులు ఇవ్వాలంటూ నిర్వాహకులు ఒత్తిడి తేవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఇద్దరు యువకులు.. బెల్లంకొండ రైల్వే ట్రాక్‌ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు.

ఆత్మహత్యకు ముందు తాము చనిపోతున్నామని సెల్ఫీ వీడియో తీసి బంధువులకు పంపారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న బంధువులు.. వారిని హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సురేష్‌ మృతి చెందగా.. మరో యువకుడు కొమురయ్య పరిస్థితి విషమం ఉంది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

RELATED STORIES