శ్రీకాకుళం జడ్పీఛైర్‌పర్సన్ పవర్‌ ఉన్నా డమ్మీయేనా..!

శ్రీకాకుళం జడ్పీఛైర్‌పర్సన్ పవర్‌ ఉన్నా డమ్మీయేనా..!
దేవుడు కరుణించినా పూజారి కరుణించటం లేదన్నట్టు తయారయ్యిందట ఆ నాయకురాలి పరిస్ధితి. అధినేత గుర్తించి కీలక పదవి కట్టబెట్టినా, స్ధానిక నాయకత్వం మాత్రం కీలుబొమ్మగా మార్చేశారా? పదవి చేపట్టి నెలలు గడుస్తున్నా జిల్లా పెద్దలను కాదని పవర్ చూపించలేకపోతున్నా? ఇంతకీ ఎవరా నాయకురాలు? ఆ జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలేంటి?


ఆ నాయకురాలు పార్టీ కోసం పడిన కష్టాన్ని హైకమాండ్ గుర్తించింది. ఎవరూ ఊహించని రీతిలో కీలక పదవి కట్టబెట్టింది. అంతవరకూ బాగానే ఉన్నా తాజా రాజకీయ పరిణామాలు సదరు నేత సంతోషాన్ని నీరుగార్చేస్తున్నాయన్న టాక్ బలంగా వినిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా పిరియా విజయను వైసీపీ పెద్దలు ఎంపిక చేశారు. జెడ్పీ చైర్మన్ ఎన్నిక సమయంలో పలువురి ఆశావాహుల పేర్లు వినిపించినా వైసీపీ పెద్దలు మాత్రం పిరియా విజయనే ఎంపిక చేశారు. దీంతో ఆమె కుటుంబం పడిన కష్టానికి తగిన గుర్తింపు లభించిందని అందరూ భావించారు. జెడ్పీ చైర్ పర్సన్ విజయ భర్త సాయిరాజ్ గతంలో ఇచ్చాపురం ఎమ్మెల్యేగా పనిచేశారు. టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచిన సాయిరాజ్ వైసీపీలో చేరారు. 2019లో ఇచ్చాపురం వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే పార్టీకోసం కష్టపడ్డ సాయిరాజ్ కుటుంబాన్ని గుర్తించిన అధిష్ఠానం ఆయన భార్య విజయను జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా ఎంపిక చేశారు. అయితే జెడ్పీ చైర్ పర్సన్ విజయ ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సర్వసభ్య సమావేశం నుంచి సొంత గ్రామం వరకూ ఎక్కడా విజయ మాట చెల్లుబాటు కావడంలేదని టాక్ వినిపిస్తోంది.

జెడ్పీ చైర్ పర్సన్ గా విజయ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామనుకుంటే జిల్లాకు చెందిన పార్టీ పెద్దలు మోకాలడ్డుతున్నట్లు సమాచారం. ఉద్దాన ప్రాంతం అభివృద్ది చేద్దామనుకున్న విజయకు పార్టీ నేతలే ఆటంకాలు సృష్టించడంతో దేవుడు కరుణించినా పూజారి కరుణించటం లేదన్న చందంగా తయారయ్యిందట పరిస్ధితి. జిల్లాలో ఉన్న ముఖ్య నేతలు చెప్పిన దానికి తలూపటం తప్ప సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. సర్వ సభ్య సమావేశాల్లో జిల్లాకు చెందిన మంత్రులు, స్పీకర్ అంతా తామే అయి వ్యవహరిస్తుండటంతో జెడ్పీ చైర్మన్ సీటులో కూర్చుని విజయ రబ్బరు స్టాంపుగా మారిపోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. పదవి వచ్చిన కొద్ది రోజులు విజయ యాక్టివ్ గా పనిచేశారు. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు, అప్పలరాజులు అంతా తామై నిర్వహించారు. చైర్మన్ విజయ పరిస్థితిని చూసిన సొంత పార్టీ జెడ్పీటీసీలు పాపం విజయమ్మ... రబ్బరు స్టాంపుగా మారిపోయారంటూ సెటైర్లు వేసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

పవర్ లేని పదవితో జెడ్పీ చైర్ పర్సన్ విజయమ్మ తీవ్రంగా ఆవేదన చెందుతున్నట్టు తెలుస్తోంది. మంత్రులు నియోజకవర్గాల్లో పర్యటనలు, ప్రారంభోత్సవాలకూ జెడ్పీ చైర్మన్ హోదాలో వెళ్లలేకపోతున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో తన సన్నిహితుల వద్ద జరుగుతున్న అవమానాన్ని చెప్పుకుని లోలోపల కుమిలిపోతున్నట్లు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story