Editorial: కమలదళం కన్ఫ్యూజన్‌లో ఉందా?

Editorial: కమలదళం కన్ఫ్యూజన్‌లో ఉందా?


కర్ణాటక ఎన్నికల ఫలితాలతో ఖంగుతిన్న రాష్ట్ర బీజేపీ నేతలు కన్ఫ్యూజన్లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కొక్కరు తమ నోటికి పని చెబుతుండటంతోఎవరు ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనన్న చర్చ పార్టీలో జరుగుతోంది. గతంలో సీనియర్ నేతలు అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపిస్తే... కొత్తగా పార్టీలో చేరిన నేతలు బహిరంగంగా వెల్లడిస్తున్న తమ అభిప్రాయాలు పార్టీలో గందరగోళానికి దారితీస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ నేతల మధ్య విభేదాలతో తలో దారి పట్టడంపై జాతీయ నాయకత్వం ఏం చేయబోతోంది.. నేతలు కలిసి కట్టుగా పని చేయాలని హెచ్చరించినా ఫలితం లేకపోవడంతో అగ్రనాయకత్వం ఎలాంటి ఫార్ములాతో ముందుకు రాబోతోందన్న చర్చ జరుగుతోంది.

మరో ఆరు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని.. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తాత్సారం చేస్తోందంటూ పోరుబాట పట్టాయి. కాంగ్రెస్ , బీజేపీ రెండు పార్టీలు పోటీపడి మరీ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నాయి. ఇక కర్ణాటక ఎన్నికల్లో గెలుపుతో ఉత్సాహం మీదున్న కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. తెలంగాణలోనూ కర్ణాటక రిజల్ట్ రిపీట్ అవుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు బీజేపీ సైతం నిరుద్యోగ మార్చ్, బూత్ స్వశక్తీకరణ పేరుతో ప్రజల్లో ఉండేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

కర్ణాటక ఆ ఎన్నికల ఫలితాల ప్రభావం రాష్ట్రంపై పడకుండా బీజేపీ నేతలు జాగ్రత్తలు పడుతున్నారు. అయితే తెలంగాణలో చేపట్టబోయే కార్యాచరణ పై నేతలు నోరుమెదపడంలేదు. ఇదే సమయంలో నేతలు చేస్తున్న కామెంట్స్ పార్టీ పెద్దలను గందరగోళానికి గురిచేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. పార్టీలో గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించుకునే వారే తప్ప బహిరంగ వ్యాఖ్యలు చేసిన దాఖలాలు లేవని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

కర్ణాటక ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వస్తే ఇక పార్టీ కి తిరుగుండదని భావించిన బీజేపీకి ఫలితాలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఎన్నికల ఫలితాల అనంతరం చేరికలతో పార్టీ బలం పుంజుకుంటుందని.. అంతా చెబుతూ వస్తున్నారు. కానీ సీన్ రివర్స్ కావడంతో అటు జాతీయ నాయకత్వం కాని ఇటు రాష్ట్ర నాయకత్వం కాని తెలంగాణలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై ఎలాంటి ప్రకటనలు చేయకపోవడంపై క్యాడర్‌లో చర్చ జరుగుతోంది. మరోవైపు రాష్ట్రంలో మాత్రం కొంత మంది నేతల వ్యాఖ్యలు అధిష్ఠానానికి తలనొప్పులు తెచ్చిపెడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. పార్టీలో ముఖ్య నేతలు రెండు వర్గాలుగా విడిపోయారని క్యాడర్‌లో టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో పార్టీలో పట్టు కోసం ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పీడ్ పెంచినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కొంత మంది నేతలు తెరవెనుక ఉండి ఈటలను ప్రోత్సహిస్తున్నారని .. జాతీయ నాయకత్వానికి సంజయ్ కి వ్యతిరేకంగా రిపోర్టులు తీసుకు వెళ్లినట్లు చెబుతున్నారు.

ఇక మరోవైపు బీజేపీ లో నేతల వ్యవహార శైలి సైతం ఇబ్బంది కరంగా మారినట్లు టాక్ వినిపిస్తోంది. బీజేపీ నేతలు పార్టీ మారుతున్నారని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలు కూడా ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. మరోవైపు రాష్ట్ర నేతలందరూ ఒకరి తరువాత ఒకరు ఢిల్లీ బాట పడుతుండటంపై బీజేపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ముందుగా ఈటల ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి, అనంతరం బండి సంజయ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇలా ఒకరి తరువాత ఒకరు ఢిల్లీ వెళ్తుండటంతో పార్టీలో ఏదో జరుగుతోందన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ఈటలతోనే వెళ్ళాలని పార్టీలోనిఓ వర్గం బలంగా వాదిస్తుంటే .. ఎన్నికల ముందు బండి సంజయ్ ని తప్పించి వేరొకరికి బాధ్యతలు అప్పగిస్తే కేడర్ కు తప్పుడు సంకేతాలు వెళ్తాయని పార్టీలో చర్చ జరుగుతోంది. దీనికి తోడు బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నట్లు సమాచారం. లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవిత జైలుకెళ్లడం ఖాయమని అందరూ అనుకున్నారని, కానీ కవిత అరెస్టు కాకపోవడంతో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఏదో అవగాహన ఒప్పందం ఉందని ప్రజల్లో చర్చ జరుగుతోందని కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితను అరెస్టు చేయలేకపోవడం వల్లే తెలంగాణలో బీజేపీ ఉధృతికి బ్రేకులు పడ్డాయని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో దోస్తీ చేస్తూ గల్లీలో కుస్తీలు చేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారని, అందుకే బీజేపీపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీలో ఎవరూ జాయిన్ అయ్యేందుకు ముందుకు రావడం లేదన్నారు. పొంగులేటి, జూపల్లి, పలువురు కాంగ్రెస్ నేతలతో తాము చర్చలు జరిపినా కేసీఆర్ విషయంలో సీరియస్ గా ఉన్నారా? లేరా? అని వారు ప్రశ్నించినప్పుడు తాము సరైన సమాధానం ఇవ్వలేకపోయినట్లు కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. కొండా చేసిన వ్యాఖ్యలు బీజేపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు సరికొత్త వ్యూహాలతో జాతీయ నాయకత్వం రంగంలోకి దిగాలని.. కఠిన నిర్ణయాలు తీసుకుని రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేయాలని క్యాడర్‌లో టాక్ నడుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story