తనయుల పొలిటికల్ ఎంట్రీ కోసం తండ్రి స్కెచ్

తనయుల పొలిటికల్ ఎంట్రీ కోసం తండ్రి స్కెచ్
రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక.. జానారెడ్డికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం .. రేవంత్ రెడ్డికి.. జానారెడ్డి పెద్దకొడుకు రఘువీర్ రెడ్డి స్నేహితుడు కావడం కలిసివచ్చే అంశంగా భావిస్తున్నారట

రాబోయే ఎన్నికల్లో ఆ ఉమ్మడి జిల్లాలో రాజకీయ కురువృద్ధుడు చక్రం తిప్పనున్నారా? వారసుల చేత రాజకీయ అరంగేట్రం చేయించేందుకు కసరత్తు చేస్తున్నారా? ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో నెరవేరని కోరిక రాబోయే ఎన్నికల్లో నెరవేరనుందా? తన ఇద్దరు కొడుకుల పొలిటికల్ ఎంట్రీకి ఇదే రైట్ టైమ్ అని భావిస్తున్నారా..?

నల్లగొండ జిల్లా నుంచి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, రాష్ట్ర విభజన తర్వాత నేటి తెలంగాణాలోనూ దాదాపు ఐదు దశాబ్దాలుగా సుదీర్ఘ రాజకీయాలు కొనసాగిస్తున్నారు సీనియర్ పొలిటీషియన్, మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి. గతంలో చలకుర్తి నియోజకవర్గం నుంచి.. డీలిమిటేషన్ తర్వాత నాగార్జునసాగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున దశాబ్దాలుగా చట్ట సభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన రాజకీయ ప్రస్థానంలో 11 సార్లు ఎన్నికల్లో పోటీ చేయగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కాలం నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ.. సీనియర్ రాజకీయ వేత్తగా వివాదరహితుడిగా పేరు సంపాదించారు కుందూరు జానారెడ్డి. కొంతకాలం కిందట యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి వెళ్లి ప్రత్యేక పూజల అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జానారెడ్డి గా మాత్రమే వచ్చాను.. ప్రజలు, కోరుకుంటే ముఖ్యమంత్రి జానారెడ్డిగా తప్పక వస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఈ క్రమంలో గతకొంతకాలంగా.. నాగార్జునసాగర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో.. కొడుకులు రఘువీర్ రెడ్డి, జైవీర్ రెడ్డిలతోకల్సి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు జానారెడ్డి. దశాబ్దకాలంగా.. తనకు దూరమైన నాయకులను, క్యాడర్ ను దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారట. ఇటీవల నల్లగొండ జిల్లా కేంద్రంలో.. టీ.కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరుద్యోగ నిరసన సభలో పార్టీ నేతలతో పాటు ఉత్సాహంగా పాల్గొన్నారు జానారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ.. పేద, బడుగు బలహీన వర్గాలకు హస్తం పార్టీని అపన్న హస్తం అందిస్తుందని చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో తన కుమారులైన కుందూరు రఘువీర్ రెడ్డి, జైవీర్ రెడ్డిల రాజకీయ ఆరంగ్రేటం సహా వారి రాజకీయ భవిష్యత్ ట్రాక్ లో పెట్టడానికి తెరవెనక భారీ కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి తనకు సీఎం అయ్యే అవకాశం వస్తే.. ఆ పదవి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని అధిష్టానానికి సంకేతాలను సైతం పంపారట.

ఇటీవల కాలంలో నాగార్జునసాగర్ సహా పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో అనారోగ్యం దృష్ట్యా.. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని చూస్తున్నారట. తన ఇద్దరు కొడుకులైన రఘువీర్ రెడ్డి, జై వీర్ రెడ్డిలను.. వెనకుండి నడిపించాలని ఆయన ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక.. జానారెడ్డికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం .. రేవంత్ రెడ్డికి.. జానారెడ్డి పెద్దకొడుకు రఘువీర్ రెడ్డి స్నేహితుడు కావడం కలిసివచ్చే అంశంగా భావిస్తున్నారట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో.. జానారెడ్డి తన ఇద్దరు కొడుకుల పొలిటికల్ కెరీర్‌కు లైన్ క్లియర్ చేస్తున్నారనే ప్రచారం నల్లగొండ జిల్లాలో జోరుగా సాగుతోంది. పెద్దకొడుకు రఘువీర్ రెడ్డిని మిర్యాలగూడ సెగ్మెంట్ నుంచి బరిలోకి దింపాలని.. చిన్న కొడుకు జైవీర్ రెడ్డి ని నాగార్జునసాగర్ సెగ్మెంట్ నుంచి పోటీ చేయించాలని జానారెడ్డి వ్యూహరచన చేస్తున్నారట. ఇప్పటికే రఘువీర్ మిర్యాలగూడ లోని ఎన్‌ఎస్‌పీ క్యాంపు ప్రాంతంలో ఇంటిని అద్దెకి తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయగా.. జైవీర్ మాత్రం సాగర్ నియోజకవర్గంలో నిత్యం క్షేత్రస్థాయిలో క్యాడర్ కు అందుబాటులో ఉంటున్నారట.

అన్నీ కుదిరితే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో.. తన వారసులిద్దరినీ రాజకీయాల్లో దింపాలని ప్రణాళికలు సిద్దం చేస్తున్నారట జానారెడ్డి. ఇక.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ల గ్రూపు విభేదాల నేపథ్యంలో.. జానారెడ్డికి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించే అవకాశం వస్తుందని ఆయన అనుచరులు లెక్కలేస్తున్నారట.

Tags

Read MoreRead Less
Next Story