నెల్లూరు నగర వైసీపీలో అలజడి

నెల్లూరు నగర వైసీపీలో అలజడి
నెల్లూరు నగర వైసీపీలో అలజడి మొదలైందా? వచ్చే ఎన్నికల్లో ఎంపీగా ఆదాల తప్పుకోనున్నారా? రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ఎంపీ బాధ్యతలను తలకెత్తుకోనున్నారా? తానుండాలంటే తన తన వారికే టికెట్‌లు కేటాయించాలని వేమిరెడ్డి పట్టుబట్టారా? నెల్లూరు సిటీ టికెట్‌ తన భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారా?


నెల్లూరు నగర వైసీపీలో వర్గపోరు చల్లారడం లేదు. నగర నేతలను ఏకతాటిపై నడిపించేందుకు స్వయంగా ముఖ్యమంత్రి జగన్ జోక్యం చేసుకున్నా పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదని టాక్ వినిపిస్తోంది. నెల్లూరు నగర వైసీపీలో మూడు ముక్కలాటతో అధిష్ఠానానికి తల బొప్పికడుతోందని టాక్ వినిపిస్తోంది. ఎమ్మేల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కార్నర్‌గా సాగుతున్న వైసీపీ వర్గ పోరు కొలిక్కి రావడంలేదని ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నుండి వేరు కుంపటి పెట్టుకున్న బాబాయ్ వర్గానికి చెందిన కార్పోరేటర్లు, నాయకుల పై తరచు దాడులు జరుగుతుండటం.. అవి అబ్బాయ్ చేయించాడని భావిస్తున్న బాబాయ్ ఒకరిపై ఒకరు వార్నింగ్‌లు ఇచ్చుకోవడంతో పంచాయితీ అధిష్టానం వద్దకు చేరింది.


అయితే నెల్లూరు నగరంలో అబ్బాయ్‌ అనిల్ కుమార్ యాదవ్‌కి పోటీగా బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ తన కార్యాలయం ప్రారంభించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అయితే బాబాయ్ పార్టీ కార్యాలయం ప్రారంభించడానికి ప్రధాన కారణం వేరే ఉన్నట్టు జోరుగా చర్చ జరుగుతోంది. ప్రశాంతి రెడ్డి అభ్యర్ది నెల్లూరు నగర వైసీపి బాధ్యతలు డిప్యుటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ చేతుల్లోకి వెళ్లనున్నాయని టాక్ వినిపిస్తోంది. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పార్లమెంటుకు కాకుండా.. అసెంబ్లీ బరిలో దిగేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నెల్లూరు అసెంబ్లీకి సరైన అభ్యర్ది కోసం అన్వేషణ సాగుతున్న తరుణంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తెరమీదకు తీసుకొస్తున్నట్లు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో వేమిరెడ్డి నేను బరిలో నిలవాలంటే నేనే చెప్పినవాళ్లకే టికెట్లు ఇవ్వాలని మెలిక పెట్టినట్టు సమాచారం.

నెల్లూరు జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలతో పాటు పాటు నెల్లూరు నగరంపై కూడా వేమిరెడ్డి నజర్ పెట్టినట్లు తెలుస్తోంది. నెల్లూరు నగరం పై పట్టుంటే జిల్లాలో ఆధిపత్యం చెలాయించవచ్చని వేమిరెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో నెల్లూరు నగరానికి తన సతీమణి టీటీడీ బోర్డ్ మెంబరు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి టికెట్ కేటాయించాలని అధిష్ఠానం వద్ద ప్రతిపాదన పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే నెల్లూరు నగరంలో ప్రశాంతి రెడ్డిని ముందుండి నడిపించేందుకు పట్టున్న, సమర్ధుడైన నాయకుడి కోసం చేసిన వేట ఫలించిందని టాక్ వినిపిస్తోంది. మెదటి నుండి మాజీ మంత్రికి అన్ని తానై నడిపించి.. రెండు ధపాలు ఎమ్మెల్యే గా గెలిచేందుకు ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ క్యాడర్‌ను కాపాడుకుంటు వచ్చిన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్‌ ను క్యాచ్ చేస్తే సరిపోతుందన్న నిర్ణయానికి వేమిరెడ్డి వచ్చినట్టు తెలుస్తోంది.

అబ్బాయి అనిల్ కుమార్ యాదవ్‌తో విభేదాల కారణంగా నెల్లూరు నగరంలో పార్టీకి దూరంగా ఉంటున్న రూప్ కుమార్ యాదవ్‌ ప్రశాంతి రెడ్డికి అన్నివిధాలా సంఘీభావం తెలిపి ఆమె విజయానికి కృషి చేసేందుకు రూప్ కుమార్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.దీంతో ఇక నుండి నెల్లూరు నగర వైసీపీ రాజకీయం జేమ్స్ గార్డెన్ వైసీపీ కార్యాలయం నుండే జరగనుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story