Editorial: కదిరి వైసీపీలో కలవరం

Editorial: కదిరి వైసీపీలో కలవరం
కదిరి వైసీపీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పనితీరు పట్ల అధిష్టానం గుర్రుగా ఉన్నట్టు సమాచారం

ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ వైసీపీలో అలజడి మొదలయిందా? ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి చెక్ పెట్టేందుకు అధిష్టానం పావులు కదుపుతోందా? మైనార్టీ వ్యక్తిని రంగంలోకి దింపేందుకు స్కెచ్ వేసిందా? సిట్టింగ్ ఎమ్మెల్యే మౌనం వెనుక కారణమేంటి? కదిరిలో వైసీపీ ముసలం వెనుక ఉన్న ఓపెన్ సీక్రెట్ ఏంటి?

అధికార వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పనితీరును సమీక్షిస్తున్న సీఎం పలు సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కదిరి వైసీపీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పనితీరు పట్ల అధిష్టానం గుర్రుగా ఉన్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధా రెడ్డికి టికెట్ ఇచ్చే విషయంపై అధిష్టానం నో చెప్పినట్లు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. 2024లో మైనార్టీ నేతను కదిరి బరిలో దింపాలని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. హిందూపురం నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ను కదిరి కి వెళ్లాలని వైసీపీ అధిష్టానం ఆదేశించినట్లు హిందూపురం, కదిరి నియోజకవర్గ వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. అయితే కదిరి వైసీపీ అసమ్మతి నేత పూల శ్రీనివాసరెడ్డి ఎన్నికల బరిలో దిగేందుకు రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా రాబోయే ఎన్నికల్లో తనకు ఓ అవకాశం కల్పించాలంటూ వైసీపీ అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. హిందూపురంలో నెలకొన్న వైసీపీ గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టేందుకు ఇక్కడ బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ, ఎమ్మెల్సీ ఇక్బాల్ ను కదిరికి పంపించేందుకు వైసీపీ అధిష్టానం రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే కదిరి వెళ్లేందుకు ఎమ్మెల్సీ ఇక్బాల్ సుముఖంగా లేరని హిందూపురంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాను కదిరి వెళ్లేదిలేదని హిందూపురంలోనే ఉంటానని ఇక్బాల్ ధీమా వ్యక్తం చేస్తున్నట్లు క్యాడర్‌లో చర్చ జరుగుతోంది.

సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న మైనార్టీ ఓట్లను కొల్లగొట్టేందుకు వైసీపీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే సిద్ధారెడ్డిపై అసమ్మతి నేతలు చేసిన ఫిర్యాదులను వైసీపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. గత నాలుగేళ్లలో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వం మంజూరు చేసిన పనులకు సంబంధించి ఎమ్మెల్యే స్వయంగా కాంట్రాక్ట్ పనులను చేయించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు సుమారు 35 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో .......ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు విప్పితే బిల్లులు ఆగిపోయే ప్రమాదం ఉందని సిద్ధారెడ్డి వెనక్కి తగ్గుతున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ఆగ్రహంతో ఉన్నప్పటికీ ఎదురు చెప్పలేక మౌనంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టపర్తి విమానాశ్రయంలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డిపై సీరియస్ అయినట్లు సమాచారం. బయటకు వెళ్ళిపో అంటూ సీఎం జగన్ సీరియస్ అయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


ఇటీవల కదిరి నియోజకవర్గంలో ఓ వైసీపీ నేత నూతన గృహప్రవేశ వేడుకకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఆ సమయంలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పై అసమ్మతి నేతలు పలు అంశాలకు సంబంధించి సజ్జలకు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరిగింది. కదిరిలో ఇటీవల వైసీపీ చేయించిన సర్వేలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన గ్రాఫ్ చాలా దారుణంగా పడిపోయిందని అధిష్టానం వద్దకు రిపోర్ట్ వెళ్లినట్లు సమాచారం. ఇటీవల సీఎం జగన్ అధ్యక్షతన ఎమ్మెల్యేలు మంత్రులతో జరిగిన సమీక్షా సమావేశంలో కదిరికి మైనార్టీ నేత వస్తున్నారని కలుపుకొని వెళ్లాలని ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి సీఎం జగన్ సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, పూల శ్రీనివాసరెడ్డి విభేదాలు వీడి పార్టీ కోసం కలిసి పనిచేయాలని సీఎం జగన్ సూచించినట్లు సమాచారం.

మరోవైపు చేసిన పనులకు బిల్లుల రాక కోట్లాది రూపాయలు ఆగి పోవడంతో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు ఎమ్మెల్యేకు మింగుడుపడటంలేదని చర్చ జరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో టికెట్ విషయంలో సీఎం జగన్ ఝలక్ ఇచ్చారని కదిరి నియోజకవర్గ క్యాడర్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.kadiri ysrcp politics

Tags

Read MoreRead Less
Next Story