Editorial: ఉమ్మడి వరంగల్ BRSలో టికెట్ ఫైట్

Editorial: ఉమ్మడి వరంగల్ BRSలో టికెట్ ఫైట్
సొంత పార్టీ నేతలు ధిక్కార స్వరాలు వినిపిస్తున్నట్లు టాక్ నడుస్తోంది


ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కలవరపాటుకు కారణమేంటి? బీఆర్ఎస్‌లో టికెట్ల కోసం పోటీ పెరిగిందా? సిట్టింగ్‌లకే టికెట్లన్న కేసీఆర్ వ్యాఖ్యలతో ముసలం తప్పదా? ధిక్కార స్వరాలు వినిపిస్తున్న ఆశావహుల ప్రయత్నాలు ఫలిస్తాయా?


రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ టికెట్లు ఆశిస్తున్న నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ అధిష్ఠానం కసరత్తు ముమ్మరం చేయడంతో నేతల ప్రయత్నాలు కూడా అదే స్థాయికి చేరాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, స్టేషన్ ఘన్‌పూర్ లతో పాటుగా భూపాలపల్లి, మహబూబాబాద్ , డోర్నకల్ , వరంగల్ తూర్పు నియోజకవర్గాలలో సొంత పార్టీ నేతలు ధిక్కార స్వరాలు వినిపిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ సారి తమకు అవకాశం ఇవ్వాలని పలువురు ఆశావహులు అధిష్ఠానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్‌పై కలవరపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలలో ఒక్క ములుగు మినహా 11 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీనిలో 6 నియోజకవర్గాలలో సిట్టింగ్‌లకు ఆశావహులు తీవ్ర పోటీనిస్తున్నట్లు సమాచారం. వీరు కుటుంబ సభ్యులనుంచి, సొంత పార్టీ నేతలనుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. జనగామ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని ఆయన కూతురే ఒక ల్యాండ్ విషయంలో తన సంతకం ఫోర్జరీ చేశారని తండ్రి పైనే కేసు పెట్టడం దుమారాన్ని రేపుతోంది. అయితే ఇదంతా తన ప్రత్యర్ధులు ఆడుతున్న నాటకమని ఆ నాటకంలో తన కూతురు పాత్రధారి కావడం దురదృష్టకరమని పబ్లిక్‌గా ఎమ్మెల్యే అసహనాన్ని వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమవుతున్నారు. అయితే ఇదంతా జనగామ టికెట్ ఆశిస్తున్న పలువురు బీఆర్ఎస్ నేతల పనా లేక ప్రత్యర్ధుల పనా అనేది జనగామ నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది.

ఇక స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్య తన ప్రత్యర్ధి అయిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య వర్గపోరు భగ్గుమంటోంది. ఇరువురు నేతలు బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. మరోవైపు పలువురు మహిళా ప్రజా ప్రతినిధులు, కార్యకర్తల నుండి రాజయ్య తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతంలో పలువురు మహిళా నేతలు, కార్యకర్తల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు, మహిళలతో ఫోన్ సంభాషణలు వైరల్ కావడంతో రాజయ్య అపఖ్యాతిని మూటగట్టుకున్నట్లు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. కాగా ప్రస్తుతం జానకీపురం సర్పంచ్ నవ్య గతంలో ఎమ్మెల్యే రాజయ్య అసభ్యంగా ప్రవర్తించారని తీవ్ర ఆరోపణలు చేయడమే కాకుండా ఈసారి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం అధికార పార్టీలో కలకలం రేపుతోంది. నవ్య కడియం అనుచరురాలని అందుకే తనపై అసత్య ఆరోపణలు చేస్తూ రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తోందని రాజయ్య ఆరోపిస్తున్నారు. మరోవైపు భూపాలపల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్రకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ మధుసూదనాచారి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో భూపాలపల్లి బరిలో తనే దిగుతానని మధుసూదనాచారి ప్రచారం చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ పంచాయితీ కాస్తా అధిష్ఠానం వద్దకు చేరినట్లు తెలుస్తోంది.

ఇక మహాబూబాబాద్ , డోర్నకల్ వరంగల్ తూర్పు నియోజకవర్గాలలో గత కొద్ది నెలలుగా బీఆర్ఎస్ నేతల మధ్య గ్రూప్ వార్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో వర్గపోరుతో చీలిపోయిన క్యాడర్‌ నిరుత్సాహానికి గురవుతున్నట్లు సమాచారం. డోర్నకల్, మహాబూబాబాద్ నియోజకవర్గాలలో ఏదో ఒక నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్న మంత్రి సత్యవతి రాధోడ్ పై డోర్నకల్ సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ కుటుంబ సభ్యులు వారి అనుచరులు మంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాలోత్ కవిత మహబూబాబాద్ పై కన్నేసినట్లు సమాచారం. ఈ క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో సభా వేదికలపైనే పలు మార్లు వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. ఈసారి అసెంబ్లీకి పోటీచేయాలనే ఉద్దేశ్యంతో మహాబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కవిత పర్యటనలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే కలవరపడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈసారి టికెట్ దక్కించుకునేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తునే ఒక వేళ సత్యవతి రాథోడ్‌కు టికెట్ ఇస్తే ఎలా అనే మీమాంసలో కవిత ఉన్నట్లు సమాచారం.

ఈ రెండు ఎస్టీ నియోజకవర్గాలలో మాత్రం డోర్నకల్ లో తండ్రి, కూతురు, మంత్రి సత్యవతి రాథోడ్ పోటీ పడుతుండగా...మహాబూబాబాద్ నియోజకవర్గంలో మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యే శంకర్ నాయక్ లతో పాటుగా ఎంపీ మాలోతు కవిత పొటీ పడుతున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఒక్క సీటుకోసం నలుగురి మధ్య వర్గపొరు నడుస్తోంది. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 6 నియోజకవర్గాలలో సిట్టింగ్‌లకు తీవ్ర పోటీ నెలకొన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story