Editorial: నర్సీపట్నంలో ఎమ్మెల్యే గణేష్‌కు ఎదురుగాలి

Editorial: నర్సీపట్నంలో ఎమ్మెల్యే గణేష్‌కు ఎదురుగాలి
నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్‌ కుమార్‌ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారా? సొంత పార్టీ నేతలే టికెట్ రాకుండా పావులు కదుపుతున్నారా? ఓ వైపు ప్రజా వ్యతిరేకత, మరోవైపు అసమ్మతి నేతలతో ఎమ్మెల్యే గణేష్ ఇబ్బందులు పడుతున్నారా? రోజు రోజుకు ఎమ్మెల్యే గ్రాఫ్ పడిపోతోందా? రాబోయే ఎన్నికల్లో టీడీపీ నేత అయ్యన్న పాత్రుడి గెలుపు నల్లేరుపై నడకేనా?

పెట్ల ఉమా శంకర్ గణేష్ వన్ టైం ఎమ్మెల్యేనా... ఫ్యాన్ స్పీడ్ లో నర్సీపట్నంలో ఉత్తరాంధ్ర ఉద్దండుడిగా పేరొందిన చింతకాయల అయ్యన్నపాత్రుడిపై గెలిచిన గణేష్ కి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేసిన వారు గణేష్ ని బద్ధ శత్రువుగా చూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎన్నికల్లో గెలుపు సంగతి దేవుడెరుగు అసలు టికెట్టే రాకుండా అడ్డుకునేందుకు వైసీపీ నేతలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

నర్సీపట్నం రోడ్డు విస్తరణ వ్యవహారం ఎమ్మెల్యే గణేష్ మెడకు చుట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా పరిస్థితి మారినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ముందు రోడ్డు విస్తరణ అనేది ఎన్నికల హామీ.. వచ్చే ఎన్నికల నేపథ్యంలో వైసీపీకి, ముఖ్యంగా ఎమ్మెల్యే గణేష్ కు నర్సీపట్నం మెయిన్ రోడ్డు విస్తరణ అనేది జీవన్మరణ సమస్యగా మారిందని క్యాడర్‌లో చర్చ జరుగుతోంది. రోడ్డు విస్తరించపోతే పట్టణ ప్రజలకు సమాధానం చెప్పలేమని ఎమ్మెల్యే గణేష్‌ మథనపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గడగడప కార్యక్రమంలో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతను చవిచూసిన ఎమ్మెల్యే కు భవిష్యత్ లో ఇబ్బందికర పరిస్థితులు తప్పవని భావిస్తున్నారు.

నర్సీపట్నం మెయిన్ రోడ్డు 80 అడుగులు విస్తరించాలనేది ప్రతిపాదనను తుంగలో తొక్కిన ఎమ్మెల్యే వ్యాపారస్తులకు ఝలక్ ఇచ్చేందుకు 100 అడుగులకు విస్తరించే ప్రతిపాదనను తెరమీదకు తేవడం వివాదస్పదంగా మారింది. ఈ ప్రతిపాదనతో వ్యాపార వర్గాలు ఎమ్మెల్యే గణేష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నర్సీపట్నానికి రింగ్ రోడ్డు ప్రతిపాదన ఉన్న నేపథ్యంలో మెయిన్ రోడ్డుని 100 అడుగులకు విస్తరించేందుకు ప్రయత్నిస్తుండటంతో నర్సీపట్నం వైసీపీ నిట్టనిలువునా చీలిపోయినట్లు టాక్ వినిపిస్తోంది.

ఎమ్మెల్యే గణేష్ 100 అడుగుల ప్రతిపాదనతో వ్యాపారస్తులందరూ చింతకాయల సన్యాసిపాత్రుడు ఆశ్రయించారు. ఇదే సమయంలో సన్యాసిపాత్రుడు భార్య అనితను DCCB ఛైర్మన్ పదవి నుంచి తప్పించడంతో ఎమ్మెల్యే గణేష్ పై కారాలు మిరియాలు నూరుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఎమ్మెల్యే గణేష్ గెలుపు కోసం కృషి చేసిన జాతీయ ఓబీసీ అసోసియేషన్ చైర్మన్ పోతల ప్రసాద్ సైతం రోడ్డు విస్తరణ అంశంలో ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. 100 అడుగుల ప్రతిపాదన అనేది ఆర్ధిక ప్రయోజనాల కోసమేనని పోతల ప్రసాద్ పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో ఎమ్మెల్యే గణేష్ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతున్నట్లు క్యాడర్‌లో చర్చ జరుగుతోంది. ఓవైపు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత, మరోవైపు గత ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేసిన నేతలు ఎమ్మెల్యేకు దూరమవడంతో ఈ సారి ఆయనకు కష్టాలు తప్పవని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు అనూహ్యంగా బలం పుంజుకున్నట్లు నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story