తెలంగాణ బీజేపీలో జోష్

తెలంగాణ బీజేపీలో జోష్


తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు స్పీడ్ పెంచాయి. గెలుపే లక్ష్యంగా తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. హ్యాట్రిక్ విజయంపై బీఆర్ఎస్ కసరత్తు చేస్తుండగా ..తెలంగాణ ఇచ్చిన పార్టీగా అధికారంలోకి రావాలని కాంగ్రెస్, తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇతర పార్టీలలో ఉన్న అసంతృప్తులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇప్పటికే పలువురు నేతలు తమకు నచ్చిన పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ బీజేపీలో జోష్ తగ్గింది. అదేసమయంలో విభేదాలతో అంటకాగుతున్న కాంగ్రెస్‌ నేతలు ఐక్యతారాగం ఆలపిస్తూ ఆ పార్టీలో జోష్‌ను నింపారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరికలు పెరగడం జరిగాయి.

అయితే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుతో కొంత స్తబ్ధుగా ఉన్న బీజేపీలో మళ్లీ చేరికలు ఊపందుకోనున్నట్లు తెలుస్తోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు బీజేపీలో చేరుతుండటంతో ఆపార్టీ కేడర్‌లో మళ్లీ కదలిక వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. తాజాగా రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డితో పాటు పలువురు నేతలు హస్తినలో కాషాయ కండువా కప్పుకున్నారు. మల్కాజగిరి మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజయ్య బలమైన బీసీనేతగా గుర్తింపు పొందారు. ఆయన చేరికతో పార్టీ మరింత బలోపేతమవుతుందని టాక్ వినిపిస్తోంది. మెదక్ మాజీ డీసీసీబీ ఛైర్మన్లు జైపాల్ రెడ్డి, రంగారెడ్డి మాజీ డీసీసీ నేత తాండూరు లక్ష్మారెడ్డిలు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీఎంపీ, ఏడు సార్లు ఎమ్మెల్యే గా పనిచేసిన బాగారెడ్డి కుమారుడే జయపాల్ రెడ్డి. బాగారెడ్డి ఇందిరాగాంధీకి అత్యంత ప్రియ శిష్యుడిగా వ్యవహరించారు. వీరికి పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు ప్రకాష్ జవదేకర్. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో వీరంతా టచ్‌లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. తెలంగాణాలో బీజేపీ పటిష్టానికి తెరవెనక నుంచి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రాంగం నడుపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో బీజేపీని పటిష్టం చేసే పనిలో తెలంగాణ ముఖ్యనేతలతో కిరణ్ కుమార్ రెడ్డి మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా తెలంగాణలో బీజేపీలో చేరికలు పెరిగేలా కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం.

మరోవైపు సినీ నటి జయసుధను బీజేపీలోకి ఆహ్వానించినట్లు టాక్ వినిపిస్తోంది.కిరణ్‌ కుమార్ రెడ్డి కిషన్ రెడ్డి జయసుధతో చర్చలు జరిపినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలోకి చేరబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. జయసుధ 2009లో కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేందుకు కిరణ్‌ కుమార్ రెడ్డితో చర్చల అనంతరం బీజేపీలో చేరాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

మొత్తానికి పార్టీలో చేరికలతో బీజేపీలో క్యాడర్‌లో జోష్ వచ్చినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో బీజేపీలో మరిన్ని చేరికలుంటాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story