తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరు ...?

తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరు ...?

బీజేపీలో అంతర్గత పోరు తారాస్థాయికి చేరిందా? నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి మెల్లగా బయట పడుతోందా?... ఇప్పటి వరకు రాష్ట్ర నాయకత్వానికి పరిమితమయిన అసంతృప్తి జిల్లాలకూ పాకిందా?.. కమిటీల మార్పుతో నిజామాబాద్‌లో రాజుకున్న చిచ్చు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తే పరిస్థితి ఏంటి? రాష్ట్ర నాయకత్వ కమిటీలో మార్పులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సాహసం చేస్తారా?.. పార్టీ ని సెట్ రైట్ చేసేందుకు కిషన్ రెడ్డి ముందున్న ఆప్షన్ ఏంటి ?

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు పెంచారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడి మార్పు బీజేపీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి పార్టీని నడిపించడం కత్తిమీద సామేనని ఆపార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. బండి సంజయ్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీనే కొనసాగిస్తున్నారు. రోజువారీ రివ్యూలు, ఆందోళన కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. ఈ క్రమంలో కమిటీల్లో మార్పులు చేర్పుల పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ని మార్చుతున్నట్టు ప్రకటన రాగానే పార్టీలో కొంతమంది సీనియర్ నేతలు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. పార్టీలో చేరికలు పక్కన పెట్టి బయటకు ఎవరూ పోకుండాచూడండంటూ సెటైర్లు వేసినట్లు ప్రచారం జరిగింది. దీంతో పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుంది.. బయటకు పోయే వారెవరు అన్న దానిపైనే జోరుగా చర్చ జరిగింది. ఇక అవకాశం దొరికినప్పుడల్లా నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చారు. బండి సంజయ్ ని మార్చితే పార్టీ కి ఇబ్బందులు తప్పవని .. ఈ సమయంలో అధ్యక్షుడి మార్పు ఎందుకు చేస్తున్నారంటూ సన్నిహితుల వద్ద అసహనం వ్యక్తం చేశారు.

పార్టీలో ఎపుడు ఏం జరుగుతుందోనని అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ నియోజకవర్గం పరిధిలో మండల అధ్యక్షులను మారుస్తూ ఆ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనర్సయ్య లెటర్ హెడ్ పై లిస్ట్ విడుదలైంది. ఆ లిస్ట్ ను ఎంపీ ధర్మపురి అరవింద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో జిల్లా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కనీసం తమను సంప్రదించకుండానే ఇష్టానుసారంగా కమిటీలను మారిస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. ఇప్పటి వరకు జిల్లాకే పరిమితం అయిన ఈ అసమ్మతి రాగం రాష్ట్ర కార్యాలయానికి చేరినట్లు టాక్ వినిపిస్తోంది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉండగానే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు బీజేపీ జిల్లా మండల స్థాయి నేతలు. తమకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.


ఒక్క ఎంపీ నియోజకవర్గంలో మండలాధ్యక్షుల మార్పుతోనే ఈ స్థాయిలో ఆందోళన వ్యక్తం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కమిటీ ల మార్పులు చేర్పులు చేస్తే పరిస్థితి ఏంటని చర్చ సాగుతోంది. దశాబ్దాల తరబడి పార్టీ కోసం పనిచేసిన తమను అర్ధాంతరంగా పదవుల నుంచి తొలగిస్తే వారు సైలెంట్ గా ఉంటారా అంటూ కిషన్ రెడ్డి ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. పాత కమిటీలనే కొనసాగిస్తామని చెప్పినప్పటికీ పలువురు నేతల పనితీరు సరిగా లేకపోవడంతో ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే గతంలో పనితీరు ఆధారంగా మార్పులు చేయాలని భావించిన బండి సంజయ్ పలు కారణాల రీత్యా మార్చలేకపోయినట్లు తెలుస్తోంది.


ఈ క్రమంలో కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి ఎన్నికల ముందు రిస్క్ తీసుకుంటారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేల ఆయన కమిటీలలో మార్పులు చేర్పులు చేయాలంటే నేతలందరి అభిప్రాయం తీసుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే బీజేపీలో ఏదైనా జరగొచ్చని ప్రచారం జరుగుతోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు పెద్దగా టైం లేనందున ఇప్పుడు కిషన్‌ కొత్త జట్టును ఏర్పాటు చేసుకుంటారా? లేక ఉన్నవాళ్ళతోనే లాగించేస్తారా అన్న చర్చ కూడా నేతల మధ్య జరుగుతున్నట్టు తెలిసింది. ఈ విషయంలో కిషన్‌రెడ్డి కూడా ఇప్పటిదాకా నోరు విప్పలేదు. మార్పులు ఉంటాయనిగాని, ఉండవని గాని చెప్పకపోవడంతో నేతల్లో టెన్షన్‌ ఇంకా పెరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఏ నిర్ణయమైనా … సమష్టిగానే ఉంటుందన్న సంకేతాలు మాత్రం ఇస్తున్నారు. పూర్తిగా కాకున్నా.. కొంతమేరకైనా…. మార్పులు ఉండవచ్చని, అదికూడా పార్టీ కేంద్ర నాయకత్వం సూచనల మేరకేనన్న ప్రచారం జరుగుతోంది. మొత్తానికి… ఈ పరిణామాలతో ప్రస్తుత కమిటీలో ఉన్న కొందరిలో మాత్రం గుబులు మొదలైంది. దీంతో పార్టీ పదవులు ఊడకుండా ఎవరి పరిధిలో వారు లాబీయింగ్‌ చేస్తున్నట్టు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story