Editorial: ఉమ్మడి ప్రకాశంలో ఊడిపోతున్న ఫ్యాన్ రెక్కలు

Editorial: ఉమ్మడి ప్రకాశంలో ఊడిపోతున్న ఫ్యాన్ రెక్కలు
ప్రకాశం జిల్లా వైసీపీలో అంతర్గతపోరు తారాస్థాయికి చేరిందా? పీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో విభేదాలు బయటపడ్డాయా? కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని హాజరుకాకపోవడానికి కారణాలేంటి? రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణాలు మారనున్నాయా? జిల్లాలో ఉన్న 9 మంది వైసీపీ ఎమ్మెల్యేలలో ఇద్దరే హాజరుకావడం వెనుక దేనికి సంకేతం?

ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు జిల్లాలలో నేతలు వర్గపోరుతో ఉక్కపోతకు గురవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధినేత స్వయంగా జోక్యం చేసుకుని చేస్తున్న బుజ్జగింపులు ఏమాత్రం పనిచేయడం లేదని టాక్ వినిపిస్తోంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో పీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నేతల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. సీఎం జగన్ ఆమోదం బాలినేని సిఫార్సు తో జరిగిన పీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యనేతలతో పాటు సొంత పార్టీ ఎమ్మెల్యేలే డుమ్మా కొట్టడం జిల్లా వైసీపీలో చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు.., పీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన వైసీపీ నేత ప్రసాదరెడ్డిది.., కనిగిరి నియోజకవర్గం. కానీ, ఈ కార్యక్రమానికి కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ డుమ్మా కొట్టగా.., అక్కడ రాబోయే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న కదిరి బాబూరావు హాజరవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కనీసం తనకు మాట మాత్రమైనా చెప్పకుండా.. తన నియోజకవర్గానికి చెందిన ప్రసాదరెడ్డికి పదవివ్వడంతో.. బుర్రా మధుసూదన్ అలిగినట్లు సమాచారం. దీంతోపాటు.., నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో పాటు, ఇప్పటికే బాలినేనితో ఉన్న విభేదాల నేపథ్యంలో బుర్రాకు ఈసారి టికెట్ దక్కదేమోనని ఆయన అనుచరులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

నిన్న మొన్నటివరకు పీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ గా ఉన్న డాక్టరు వెంకయ్య, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. జగన్ ని టీడీపీ నేతలు విమర్శిస్తే ఒంటికాలితో లేచే.., సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు కూడా దరిదాపుల్లో ఎక్కడా కనిపించకపోవడం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది.

వైసీపీ జిల్లా అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ కార్యక్రమానికి వచ్చినా.., పీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ తో ప్రమాణ స్వీకారం మాత్రం బత్తుల బ్రహ్మానందరెడ్డి చేయించడం అధికార పార్టీలో కలకలం రేపుతోంది. మాజీ మంత్రి బాలినేని నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో ఆయన లేకుండా.., తాము హాజరయితే ఏ ఇబ్బందులు వస్తాయోనన్న భయంతో కొందరు, వర్గ పోరుతో మరికొందరు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరుకాలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో వైసీపీకి 9మంది ఎమ్మెల్యేలుండగా కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావడం అధికార వైసీపీలో నెలకొన్న అంతర్గత పోరుకు అద్దంపడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జిల్లా వైసీపీలో పరిస్థితులు ఇలాగే కొనసాగితే.., రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని స్థానాల్లోనూ వైసీపీకి ఎదురుదెబ్బ తప్పదని ఆ పార్టీ క్యాడర్‌లో చర్చ జరుగుతోంది. మరోవైపు జిల్లాలోని పరిణామాలను పార్టీ పెద్దలు నిశితంగా గమనిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story