మహిళా ఉద్యోగార్థులకు ఓ మంచి అవకాశం..

మహిళా ఉద్యోగార్థులకు ఓ మంచి అవకాశం..
డిజిపివోట్(DigiPivot) -2023 ప్రోగ్రాంకి దరఖాస్తులకి చివర గడువు జులై 9, 2023



మహిళలకు కెరీర్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ కోసం వరుసగా 4వ సారి గూగుల్ ఇండియా, సెంటర్ ఫర్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్, అవ్‌తార్ గ్రూప్ కంపెనీలు చేతులు కలిపాయి. దీనికోసం డిజిపివోట్ 4.0(DigiPivot 4.0) అనే స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఆవిష్కరించారు. డిజిటల్ మార్కెటింగ్ రంగంలో మహిళలకు శిక్షణ అందించి, ఉద్యోగాలకు సన్నద్ధులను చేయడమే కాకుండా తమ కెరీర్లను తమకు నచ్చినట్లుగా మలుచుకునే విధంగా మహిళలకు శిక్షణ ఇవ్వడమే ఈ ప్రోగ్రాం లక్ష్యం. మహిళలకు సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించడంతో పాటూ, వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేలా చేసి సాధికారికంగా ముందుకు సాగేలా మలచడమే ప్రధాన ఉద్దేశం.

దీని కోసం FMCG దిగ్గజం హిందూస్థాన్ యూనిలివర్ లిమిటెడ్(HUL) ఔత్సాహికులకు కావలసిన సహాయ సహకారాలు, గైడెన్స్ ఇస్తోంది.

ప్రతి సంవత్సరం 2000 కన్నా ఎక్కువ దరఖాస్తులు వస్తుంటాయి. ఈ సంవత్సరం గతంలో కన్నా ఎక్కువ మంది నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నవారూ, కెరీర్(3 months- 18 years) మధ్యలో గ్యాప్‌ తీసుకున్న వారు, ఔత్సాహికుల నుంచి శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

దరఖాస్తుల స్వీకరణ అనంతరం అభ్యర్థులకు పరీక్షలు, ఇంటర్వూ నిర్వహించి శిక్షణకు ఎంపిక చేయనున్నారు.

గత మూడు సందర్భాల్లో 200 మందికి పైగా అభ్యర్థులు శిక్షణ తీసుకొని వీరిలో 67 శాతానికి పైగా అభ్యర్థులు తమ కెరీర్లను మలచుకున్నారని నిర్వాహకులు వెల్లడించారు

ప్రోగ్రాం ఇదే...

డిజిపివోట్ ప్రోగ్రాం వర్చువల్ (ఆన్‌లైన్) పద్ధతిలో నిర్వహించనున్నారు. ఈ శిక్షణ ద్వారా మహిళలు, ఉద్యోగార్థులు డిజిటల్ మార్కెటింగ్‌లో నైపుణ్యం సాధించగలరు. ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా డిజిటిల్ మార్కెటింగ్‌లోని ప్రధానాంశాలపై శిక్షణ, నైపుణ్యాలు, వ్యూహాత్మక అంశాల్ని ప్రముఖ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ISB) సీనియర్ అధ్యాపకులు బోధించనున్నారు. అలాగే మహిళలకు స్థిరమైన కెరీర్‌ను ఎంచుకోవడానికి, తమను తాము మలచుకోవడానికి కావాల్సిన నైపుణ్యాలను అందులో ఎంతో అనుభవం ఉన్న అవ్‌తార్ కంపెనీ వారు శిక్షణ ఇవ్వనున్నారు. దీంతో పాటుగా గూగుల్ సీనియర్ అధికారులు అభ్యర్థులకు కేస్ స్టడీస్ వంటి ప్రయోగాత్మకమైన అంశాల్లో దిశా నిర్దేశం చేయనున్నారు.

అవ్‌తార్ గ్రూప్ వ్యవస్థాపకులు, ప్రెసిడెంట్ డా.సౌందర్య రాజేష్ మాట్లాడుతూ... ప్రస్తుత ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు టెక్నాలజీ యుగంతో పోటీ పడుతూ ముందుకు సాగడం మహిళలకు చాలా ముఖ్యం మరియు అవసరమన్నారు. గెలవాలన్న కసి, నిబద్ధత, నైపుణ్యాలు ఉంటేనే మనం ఈ రెసెషన్‌(మాంద్యం)ని తట్టుకుని ఉద్యోగంలో ముందకు సాగగలమని చెప్పారు. మహిళలు తమ కెరీర్లలో ఎటువంటి స్థాయిలో ఉన్నవారైనా ఈ ప్రోగ్రాంకి దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఈ ప్రోగ్రాం ద్వారా ఇంతకుముందు శిక్షణ పొందిన వారు డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ పెంపొందించుకుని వారి ఉద్యోగాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్నారన్నారు. 50 వేలకు పైగా మహిళా ఉద్యోగులకు అవ్‌తార్ అందించే ఇంటెన్షనల్ కెరీర్ పాతింగ్‌ ద్వారా వారి వారి కెరీర్లను కొత్తగా ఆవిష్కరించుకోడానికి తోడ్పడుతోందని వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story