మీ శరీర ‘యోగా’ క్షేమాలు చూసుకుంటున్నారా?

మీ శరీర ‘యోగా’ క్షేమాలు చూసుకుంటున్నారా?
ప్రపంచానికి ఆరోగ్యం పంచుతున్న యోగా మన భారతదేశం సొంతం


రోజూ ‘యోగా’ చేస్తే మహా యాగం చేసినంత ఫలితాన్ని మన శరీరం పొందొచ్చు. అటువంటి అద్భుత సాధనలకు మూలం మన భారత దేశం. ప్రపంచానికి ఆరోగ్యం పంచుతున్న యోగా మన సొంతమవడం మనందరి మహాభాగ్యం. పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందేందుకు గంటల తరబడి ఆససనాలు చేసే సమయం లేకపోయినా.. ఈ ఉరుకులు పరుగుల జీవన శైలిలో ఒత్తిడిని తగ్గించి, మీ శరీరానికి కాసింత బలం చేకూర్చే ఓ ఐదు ఆసనాలైనా రోజూ వేయాల్సిందే.

శారీరక, మానసిక ఆరోగ్యం కోసం యోగా ఎంత ఉపయోగపడుతుందో అవగతం చేసుకునేందుకు ఏటా జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ ఏడాది 'వసుదైక కుటుంబానికి యోగా' అనే థీమ్ తో ప్రచారం చేస్తున్నారు. 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా యోగాకు ఎంతో ప్రాచుర్యం లభించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి వారి రోజువారీ జీవితంలో ఓ భాగంగా యోగా మారింది.

యోగాతో క్షేమం

ఆనందంగా, ఆరోగ్యంగా ఉండేందుకు యోగానే సరైన మార్గమని ప్రపంచం తెలుసుకుంది. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కూడా కోలుకునేందుకు, యోగా ఉపకరిస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా యోగా చేయడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండొచ్చని వారు వెల్లడిస్తున్నారు.

శారీరక, మానసిక, మానసిక ఉల్లాసానికి యోగా ఎంతో దోహదపడుతుంది. యోగాలో ఆసనాలు (భంగిమలు) కీళ్ల కదలిక, కండరాల ఫ్లెక్సిబిలిటీని పెంచుతాయి. శరీరానికి కావల్సినంత బలాన్ని సమకూర్చుతాయి. రోజూ యోగాభ్యాసం చేయడం ప్రశాంతమైన నిద్ర పొందొచ్చు, అంతేకాదు సానుకూల ఆలోచనలు పెంపొందుతాయి. ఒత్తిడిని తగ్గించి, స్వీయ అవగాహనను పెంచుతుంది.

బిజీ షెడ్యూల్‌లో యోగాకు మీరు సమయం కేటాయించలేకపోయినా పదంటే పది నిమిషాల్లో ఎంతో ఆరోగ్యాన్ని మీ సొంతం చేసే ఐదు సింపుల్‌ ఆసనాలు మాత్రం క్రమం తప్పకుండా వేసేయండిలా..

1.సుఖాసనం

ఇది చాలా సులభమైన ఆసనం. రెండు కాళ్లు మడుచుకుని కూర్చోవాలి. మోకాళ్లపై రెండు చేతులు పెట్టుకుని కళ్లు మూసుకుని ధ్యానముద్ర వేయాలి. ఇది మనసును ప్రశాంతంగా ఉంచడమే కాకుండా.. వెన్నుముకను దృఢంగా చేస్తుంది.




2. బాలాసనం

ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం కలిగించే ఆసనం ఇది. ఈ ఆసనంతో శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ భంగిమలో మీ మోకాళ్లను మడిచి, మీ ఛాతీని నేల మీద నిటారుగా వంచాలి. చేతులను ముందు ఉంచి, మీ నుదిటిని చాపపై ఉంచాలి.





3. భుజంగాసనం

ఇది నడుమును ధృడంగా చేస్తుంది. అంతేకాకుండా కండరాలకు బలాన్ని చేకూర్చి రక్త సరఫరాను పెంచుతుంది. బోర్లా పడుకుని చేతులపై శరీర భారం వేసి భుజం నుంచి మీ పైభాగాన్ని పైకి లేపాలి. భుజంగాసనం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.





4. శవాసనం

ఈ ఆసనాన్ని పూర్తిగా శరీరానికి విశ్రాంతి ఇచ్చేందుకు వేస్తారు. ఇది శారీరకంగానే కాకుండా మానసికంగా దృఢత్వాన్ని ఇచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది. మనం వేసే ప్రతి ఆసనం తర్వాత ఈ శవాసనాన్ని వేయాలి. దీన్ని అసలు మర్చిపోవద్దు. ఈ చిన్న ఆసనం ఒత్తిడిని తగ్గించడంలో చాలా సాయపడుతుంది. చాలా సులువైన, ఎంతో ప్రభావవంతమైన ఆసనం ఇది.





5. అనులోమ విలోమ ఆసనం

యోగాలో ఒక నిర్దిష్ట రకమైన ప్రాణాయామం. ఒక ముక్కు రంధ్రాన్ని మూసి ఉంచి గాలి పీల్చుకుని మరో ముక్కు రంధ్రం నుంచి శ్వాస వదులుతారు. ఇలాగే ఒక రంధ్రాన్ని మూసి మరో రంధ్రాన్ని తెరుస్తారు. ప్రక్రియ రివర్స్ లో పునరావృతమవుతుంది. ఇలా చేయడం వల్ల మీ నాడీ వ్యవస్థ బ్యాలెన్స్ అవుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించడమే కాకుండా ఆస్తమాను దూరం చేస్తుంది.





Tags

Read MoreRead Less
Next Story