కరోనా కాలం.. ఫోన్ క్లీన్ చేస్తున్నామా మనం..!!

కరోనా కాలం.. ఫోన్ క్లీన్ చేస్తున్నామా మనం..!!
24 గంటలూ చేతులోనే ఉండే ఫోన్ పరిస్థితి ఏంటి.. మంచి అలవాట్లు ఎన్నో పెంచుకున్నా ఫోన్ క్లీన్ చేయడం మాత్రం మర్చిపోతున్నాం..

కరోనా టెన్షన్.. అందర్నీ చేతులు కడిగించింది.. మాటి మాటికి శానిటైజ్ చేయించింది.. మంచి అలవాట్లు ఎన్నో నేర్పింది. మరి 24 గంటలూ మన చేతులోనే ఉండే ఫోన్ పరిస్థితి ఏంటి.. అన్నీ శుభ్రం చేస్తున్నా ఫోన్ క్లీన్ చేయడం మాత్రం మర్చిపోతున్నాం.. చేతులు శుభ్రం చేసుకుంటున్నాం కదా అని అశ్రద్ద చేస్తున్నాం కానీ ప్రముఖ విశ్వవిద్యాలయ పరిశోధనల ప్రకారం బాత్‌రూమ్‌ టాయ్‌లెట్ సీటు మీద ఉన్న బ్యాక్టీరియా కంటే 10 రెట్లు ఎక్కువగా ఫోన్ మీద ఉంటుందట. అది ఈ కోలి, ఇన్ల్ఫుఎంజా మరియు మెథిసిలిన్-రెసిస్టెంట్ స్టెఫిలోకాకస్ ఆరియస్ (MRSA) వంటి సూక్ష్మక్రిములను కలిగి ఉంటుంది. కాబట్టి వీటి బారిన పడకుండా ఉండాలంటే మీ ఫోన్‌ని క్రమం తప్పకుండా శుభ్రం చేయడం ముఖ్యం అంటున్నారు పరిశోధకులు.

ఒక అధ్యయనం ప్రకారం ఎక్కువమంది తమ ఫోన్‌ను రోజుకు 96 సార్లు చెక్ చేస్తారట. రోజూ వాడే వస్తువులే కదా అని వాటిని శుభ్రం చేయం. అలాంటి వస్తువులు చాలా ఉంటాయి ఇంట్లో. అవి పట్టుకుని ఆ చేతులతోనే ఫోన్ పట్టుకుంటే వాటికి ఉన్న క్రిములన్నీ ఫోన్ స్క్రీన్‌పైకి చేరతాయి. ఫోన్ మాట్లాడేటప్పుడు చెవులకు, నోటికి దగ్గరగా పెట్టుకోవడం వలన వివిధ రకాలైన వ్యాధి కారకాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. దాంతో అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

చాలా వస్తువులు శుభ్రం చేసేందుకు కొన్ని రకాల లిక్విడ్స్ ఉపయోగిస్తుంటాము. అవి వస్తువులపై పేరుకున్న దుమ్మూ, దూళితో పాటు క్రిములను శుభ్రం చేస్తాయి. కానీ ఫోన్‌కి మాత్రం వాటిని వాడలేం. అందుకే ఆల్కహాల్ వైప్స్‌తో వాటిని తుడవడం మంచిది. ఇలా వైప్స్‌తో శుభ్రం చేస్తే ఫోన్ ఉపరితలం మీద ఉన్న సూక్ష్మక్రిములు మరియు బ్యాక్టీరియాను సులభంగా నివారించవచ్చు. దగ్గు, జలుబు ఉన్న వ్యక్తులైతే రోజులో ఎక్కువసార్లు మీ ఫోన్‌ని వైప్స్‌తో శుభ్రం చేయడం మంచిది.

Tags

Read MoreRead Less
Next Story