పల్స్ ఆక్సీమీటర్ పనేంటి.. కరోనా సీజన్లో ఎందుకంత డిమాండ్

పల్స్ ఆక్సీమీటర్ పనేంటి.. కరోనా సీజన్లో ఎందుకంత డిమాండ్
పల్స్ ఆక్సీమీటర్లు హిమోగ్లోబిన్‌లో ఉండే ఆక్సిజన్ శాతాన్ని లెక్కిస్తాయి.

జ్వరం చూసుకోవడానికి ధర్మామీటర్ ఉన్నట్లే ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇళ్లలో ఆక్సీమీటర్ కూడా ఉంటోంది. కరోనా సీజన్లో ఆక్సీమీటర్‌కు అధిక డిమాండ్ వచ్చింది. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను గుర్తించి అప్రమత్తంగా ఉండేందుకు ఆక్సీమీటర్ తోడ్పడుతుంది. అవయవాలు సక్రమంగా పనిచేసేందుకు ఆక్సిజన్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. లేనట్లయితే శరీరంలోని కణాలు అదుపుతప్పి నాశనమవుతాయి. అదే జరిగితే అవయవాలు పనిచేయడం ఆగిపోయి మరణం సంభవిస్తుంది. మనం పీల్చే గాలిని ఊపిరితిత్తులు ఫిల్టర్ చేస్తాయి.

ఆ తర్వాత ఎర్ర రక్త కణాల్లో ఉండే హిమోగ్లోబిన్ ప్రొటీన్స్ ద్వారా శరీరమంతటికీ ఆక్సిజన్ సరఫరా అవుతుంది. పల్స్ ఆక్సీమీటర్లు హిమోగ్లోబిన్‌లో ఉండే ఆక్సిజన్ శాతాన్ని లెక్కిస్తాయి. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉన్నట్లయితే అప్రమత్తమై వైద్యం పొందేందుకు ఈ మీటర్లు సహాయపడతాయి. ఈ పరికరాన్ని పల్స్ ఆక్స్ అని కూడా అంటారు. ఇది చిన్న క్లిప్ తరహాలో ఉంటుంది. దీన్ని చేతి వేలు గోరు పైభాగానికి పెట్టుకోగానే సెకన్ల వ్యవధిలో ఇది రీడింగ్ చూపిస్తుంది.

ఆరోగ్యవంతుల్లో ఆక్సిజన్ శాతం 95 నుంచి 99 శాతం ఉంటుంది. ఇది వేలి రక్తకేశ నాళికల్లోకి పరారుణ కిరణాలను పంపుతుంది. అందులో ప్రతిబింబించే కాంతి ద్వారా ఆక్సిజన్ శాతాన్ని కొలుస్తుంది. ఇది SpO2 అనే సంతృప్త రక్తం శాతాన్ని చూపిస్తుంది. ఆక్సీమీటర్ హృదయ స్పందన రేటును కూడా చూపిస్తుంది. ఈ పరికరం 98 శాతం ఖచ్చితమైన రీడింగ్ చూపిస్తుందని, 2 శాతం మాత్రమే లోపం అని నిపుణులు చెబుతున్నారు. ఇది అందరూ కచ్చితంగా కొనాలా అంటే.. అది మీమీ ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.

మీ ఏరియాలో వైరస్ ప్రభావం ఏవిధంగా ఉందో చూసుకుని ఆక్సీమీటర్ కొనుక్కుంటే మంచిది. ఆరోగ్య వంతులకు, రోజూ వ్యాయామం చేసేవారికి ఆక్సీమీటర్‌తో అంతగా పని ఉండదు. ప్రస్తుత వైరస్ మహమ్మారి మన దరి చేరకుండా ఉండేందుకు ఆక్సీమీటర్‌తో చెక్ చేసుకుంటున్నారు. పైగా ఎవరికి వారు ఈజీగా చెక్ చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. ఎలాంటి నొప్పి ఉండదు.. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడేవారు వైద్యల సలహా మేరకు ఆక్సిమీటర్ దగ్గర ఉంచుకోవడం అత్యవసరం. రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గితే వెంటనే వైద్యుడిని సంప్రదించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే పుట్టిన పిల్లలకు కూడా ఈ ఆక్సీమీటర్‌ను ఉపయోగిస్తున్నారు.

ఆక్సీ మీటర్ పెట్టుకునేటప్పుడు గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయాలు..

రీడింగ్ తీసుకునే సమయంలో ఊపిరి ఎక్కువగా తీసుకుంటే సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయని అంటున్నారు.

చేతులు బాగా చల్లగా ఉన్నప్పుడు రీడింగ్ తీసుకోకూడదు.

నీలం, నలుపు వంటి ముదురు నెయిల్ పాలిష్‌లు వేసుకున్న వేలుకు పల్స్ ఆక్సీమీటర్ పెట్టకూడదు.

కేవలం ఒక చేతి వేలుకు మాత్రమే పెట్టి చూడకుండా, రెండో చేతికి కూడా పెట్టి చూసుకుంటే మంచిది.

వేలుపై బుడిపెలు ఉన్నా, గోరింటాకు పెట్టుకుని ఉన్నా రీడింగ్ సరిగా చూపించదు.

Tags

Read MoreRead Less
Next Story