ఆ పిల్లాడు గుడిలోకి వెళ్లినందుకు రూ.25000 జరిమానా..!

ఆ పిల్లాడు గుడిలోకి వెళ్లినందుకు రూ.25000 జరిమానా..!
దిగువ సామాజిక వర్గం వారిని దూరం పెట్టాలి. వారిని ముట్టుకుంటే అపచారం అందుకే వారిని గుడిలోకి రానివ్వం. ఇలాంటి మాటలు మన తాతలు, ముత్తాతలు కాలంలో వినేవాళ్లం.

దిగువ సామాజిక వర్గం వారిని దూరం పెట్టాలి. వారిని ముట్టుకుంటే అపచారం అందుకే వారిని గుడిలోకి రానివ్వం. ఇలాంటి మాటలు మన తాతలు, ముత్తాతలు కాలంలో వినేవాళ్లం. అప్పటినుండి రోజులు చాలా మారిపోయాయి. రోజురోజుకు అభివృద్ధి పెరుగుతోంది. మనుషుల ఆలోచన విధానంలో కూడా మార్పులు వస్తున్నాయి అని గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ నిజంగానే మనుషులు మారారా? సామాజిక వర్గం, మతం లాంటి భావాలతో సాటి మనిషిని ఇంకా దూరం పెట్టడం మానేసారా? అక్కడక్కడ జరుగుతన్న సంఘటనలు చూస్తుంటే కాదనే అనిపిస్తుంది. దానికి ఉదాహరణే కర్ణాటకలో జరిగిన ఈ ఘటన.

రెండేళ్ల దళిత అబ్బాయి.. తనకు గుడిలోకి వెళ్లాలా వెళ్లకూడదా అన్న తేడాలు కూడా తెలియవు. తెలిసి తెలియని వయసులో తాను చేసిన ఒక పని తన కుటుంబంపై రూ. 25,000 జరిమానా భారం పడేలా చేసింది. దేవుడి దగ్గర సామాజిక వర్గాలు ఏంటి అని కొందరు అనుకుంటుంటే కర్ణాటక రాష్ట్రంలోని కొప్పాల్ జిల్లా ప్రజలు మాత్రం అలాంటి బేధభావాలతో కొందరిని ఇంకా గుడిలోకి రానివ్వట్లేదు.

కొప్పాల్ జిల్లాలో ఉన్న మియాపురాలో చంద్రు కుటుంబం నివాసం ఉంటోంది. ఈనెల (సెప్టెంబర్, 2021) 4న తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఆ కుటుంబం తమ ఇంటి ముందున్న ఆంజనేయస్వామి గుడికి వెళ్లింది. బయటనుండే దేవుడిని మొక్కుకుంటున్న తల్లిదండ్రులను వదిలేసి ఆ అబ్బాయి గుడిలోపలికి పరిగెత్తాడు. ఇది గమనించిన ఊరి జనం దానిని మైలుగా భావించి గుడి అంతా శుభ్రం చేయడానికి ఆ కుటుంబం దగ్గర నుండి రూ. 25,000 ను జరిమానాగా తీసుకున్నారు.

ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ సామాజిక వర్గం వారు ఆందోళనలను చేపట్టారు. ఎంత అభివృద్ధి సాధించినా కొన్ని విషయాల్లో సమాజం ఇంకా వెనకబడే ఉన్నదని చెప్పడానికి ఈ ఒక్క ఘటన చాలదా..!

Tags

Read MoreRead Less
Next Story