Top

దేశ వ్యాప్తంగా ఎమ్మెల్యేలు,ఎంపీలపై ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయంటే?

దేశ వ్యాప్తంగా ఎమ్మెల్యేలు,ఎంపీలపై ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయంటే?
X

ప్రజాప్రతినిధుల కేసుల విచారణకు కాలపరిమితి విధించాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది. రాజకీయ నాయకులపై ఉన్న క్రిమినల్ కేసుల విచారణను వేగంగా పూర్తి చేయాలని, శిక్షపడిన నాయకులను జీవితాంతం ఎన్నికల నుంచి బహిష్కరించేలా ఉత్తర్వులు ఇవ్వాలని బీజేపీకి చెందిన న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ పిటిషన్ వేశారు. దీనిపై సుప్పీం కోర్టు విచారణ చేపట్టింది.

దేశ వ్యాప్తంగా ఉన్న పెండింగ్‌ కేసుల గురించి అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సుప్రీం కోర్టుకు తెలిపారు. అయన తెలిపిన వివరాల ప్రకారం... దేశ వ్యాప్తంగా రాజకీయ నాయకులపై 4 వేల 442 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలపైనే 2 వేల 556 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక ప్రజాప్రతినిధులపై మరో 266 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు బుధవారం నాటి అనుబంధ నివేదికలో వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల్లో అత్యధికంగా అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్, ఫోక్సో చట్టం కింద నమోదయ్యాయి. ఇక ఆదాయపు పన్ను కంపెనీలు, ఆయుధ చట్టాల కింద మరో 12 అభియోగాలు ఉన్నాయి. కేసు దర్యాప్తుపై స్టే విధిస్తే ఆ కేసును రెండు వారాల్లో మళ్లీ విచారణకు వచ్చేలా.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు సిఫార్సు చేయాలని అమికస్ క్యూరీ కోరారు.

తెలంగాణ 10 జిల్లాల్లోని సెషన్స్, మెజిస్ట్రేట్ కోర్టుల్లో కలిపి మొత్తం 118 కేసుల విచారణ పెండింగ్‌లో ఉంది. హైదరాబాద్ ప్రత్యేక కోర్టులోనూ కొన్ని పెండింగ్ కేసులు ఉన్నట్లు అమికస్ క్యూరీ వెల్లడించారు. తెలంగాణలోని సీబీఐ కోర్టులో 13 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సీబీఐ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో అత్యధికం ఎమ్మెల్యేలపైనే నమోదైనవి. ప్రాధాన్య క్రమంలో విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని 5 ప్రాధాన్య అంశాలను అమికస్ క్యూరీ సుప్రీం కోర్టుకు తెలిపారు. ఏడేళ్లు, అంతకుపైగా శిక్ష పడే కేసులనూ ప్రత్యేక కోర్టుల్లో విచారించాలని కోరారు. యావజ్జీవ శిక్షలు పడే కేసులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అమికస్ క్యూరీ సూచించారు. ఇక మనీలాండరింగ్ కేసులకు ద్వితీయ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

ఎస్సీ, ఎస్టీలపై వేధింపులు, బాలలపై లైంగిక నేరారోపణ కేసులను ప్రత్యేక కోర్టులు చేపట్టాలని ఆయన సూచించారు. పెండింగ్ కేసుల విచారణ ఏడాదిలోపు పూర్తయ్యేలా చూడాలని సుప్రీం కోర్టును కోరారు. సత్వర పరిష్కారానికి జిల్లాకో ప్రత్యేక కోర్టు పెట్టాలని సూచించారు. అయితే అన్ని రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు లేవు కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మరోవైపు అమికస్ క్యూరీ చేసిన సూచనల అమలుకు అభ్యంతరం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ హెహతా తెలిపారు. అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.

సిట్టింగ్, మాజీ ప్రజా ప్రతినిధులపై ఉన్న క్రిమినల్, అవినీతి, మనీలాండరింగ్ కేసుల సత్వర పరిష్కారానికి అమికస్ క్యూరీ చేసిన సిఫారసులను పరిగణనలోకి తీసుకుంటామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. వాటి అమలుకు కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని హైకోర్టులను కోరుతామని జస్టిస్ రమణ చెప్పారు. పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణ ఎలా పూర్తి చేస్తారో బ్లూప్రింట్ ఇవ్వాలని హైకోర్టులను కోరుతామన్నారు. కేసుల సంఖ్యను బట్టి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని హైకోర్టులకు సూచించనున్నట్లు జస్టిస్ రమణ వెల్లడించారు. యావజ్జీవ శిక్షపడే కేసులతోపాటు అవినీతి కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఒక కోర్టుకు ఒకే అంశానికి సంబంధించిన కేసులను అప్పగిస్తే, మిగతా కేసులు విచారణకే రావన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం కూడా ఒక సమస్యగా ఉందని, ఛార్జిషీట్లు దాఖలు చేయడం, సమన్లు జారీ చేయడం వంటి సమస్యలు ఉన్నాయని చెప్పారు. మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి సమస్యలను 15 రోజుల్లో పరిశీలించాలని హైకోర్టులకు సూచిస్తామని జస్టిస్ రమణ తెలిపారు. వీటిపై గురువారం కల్లా ఉత్తర్వులు ఇస్తామని ఆయన ఇప్పటికే ప్రకటించారు.

కొన్నిచోట్ల సీబీఐ, ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు FIR నమోదుతో సరిపెడుతున్నాయన్న జస్టిస్ రమణ అన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించకపోవడం, మౌలిక సదుపాయాల లేమి, ఛార్జిషీట్లు దాఖలు చేయకపోవడమే ప్రాసిక్యూషన్ జరగకపోవడానికి కారణమని జస్టిస్ రమణ అన్నారు. క్రిమినల్, ఈడీ, సీబీఐ తదితర కేసులు కలిపి మొత్తం ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయని జస్టిస్ రమణ.. అమికస్ క్యూరీని ప్రశ్నించారు. మొత్తం 4 వేల 600లకుపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అమికస్ క్యూరీ సుప్రీం కోర్టు ధర్మాసనానికి వివరించారు. ఇక సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలపై అవినీతి నిరోధక చట్టం కింద 175 కేసులు పెండింగ్‌లో ఉన్న ఆయన కోర్టుకు తెలిపారు.

Next Story

RELATED STORIES