జాతీయం

దేశవ్యాప్తంగా అమాంతం పెరిగిన కరోనా కేసులు.. షాకిస్తున్న మరణాలు...!

దేశవ్యాప్తంగా కరోనా మరోసారి కల్లోలం సృష్టిస్తోంది. ఒక్క రోజులోనే 46వేల 265 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3కోట్ల 25లక్షల 57వేల 767కు చేరింది.

దేశవ్యాప్తంగా అమాంతం పెరిగిన కరోనా కేసులు.. షాకిస్తున్న మరణాలు...!
X

Covid Cases In India : దేశవ్యాప్తంగా కరోనా మరోసారి కల్లోలం సృష్టిస్తోంది. ఒక్క రోజులోనే 46వేల 265 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3కోట్ల 25లక్షల 57వేల 767కు చేరింది. 24గంటల్లో 34వేల 242మంది కోలుకున్నారు. ఒక్క రోజులోనే 605 మంది చనిపోగా... ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4లక్షల 36వేల396కు చేరింది. కరోనా కేసులు ఇంత పెద్దఎత్తున నమోదు కావడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి కావడంతో అధికార యంత్రాంగం ఆందోళన వ్యక్తంచేస్తోంది. దేశవ్యాప్తంగా నమోదైన 46వేలకేసుల్లో 31వేల కేసులు ఒక్క కేరళలోనే నమోదు కావడం... అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

కేరళలో 24 గంటల్లో 30వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 31వేల 445కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. మూడు నెలల విరామం తర్వాత కరోనా టెస్టు పాజిటివిటీ రేటు 19 శాతానికి పెరిగింది. ఒక్కరోజే 30వేలకు పైగా కరోనా కేసులు నమోదుతో పాటు 215 మంది మరణించారు. మే నెలలో 30వేల 491 కరోనా కేసులు నమోదు కాగా... మూడు నెలల తర్వాత మళ్లీ 30వేలకు పైగా కేసులు బయటపడ్డాయి.

కేరళలో ఓనం ఉత్సవాల తర్వాత కరోనా టెస్టు పాజిటివిటీ రేటు 20 శాతానికి పైగా పెరుగుతుందని వైద్యనిపుణులు గతంలోనే హెచ్చరించారు. జులై 27 నుంచి బక్రీద్ వేడుకల సందర్భంగా ఆంక్షల సడలింపుతో రోజుకు 20వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళలోని ఎర్నాకులం జిల్లాలో అత్యధికంగా 4వేల 48కరోనా కేసులు నిర్ధరణ అయ్యాయి.

కరోనా వైరస్ థర్డ్ వేవ్ ముంచుకొస్తుందనే నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో దేశంలో వ్యాక్సినేషన్ వేగవంతమయింది. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం... జులైతో పోల్చితే, ఆగస్టులో వ్యాక్సినేషన్ జోరుగా సాగింది. రోజూ అత్యధికంగా 52లక్షల 16వేల మందికి టీకాలు వేశారు. జులైలో ఈ సంఖ్య 45 లక్షలు కూడా దాటలేదు. ఇక జూన్‌లో రోజూ 40 లక్షల మందికి టీకాలు వేశారు. మేలో ఈ సంఖ్య 20 లక్షలుగా ఉంది.

దేశంలో ఇప్పటివరకు 60 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ దేశంలో తొలుత 10 కోట్ల మందికి టీకాలు ఇవ్వడానికి 85 రోజులు పట్టిందని, ఆ తరువాత 20 కోట్ల మందికి టీకాలు ఇవ్వడానికి 45 రోజులు పట్టిందని, ఈ సంఖ్య 30 కోట్లకు చేరడానికి 29 రోజులు పట్టిందన్నారు. దేశంలో 30 కోట్లను దాటి 40 కోట్ల మందికి టీకాలు ఇవ్వడానికి 24 రోజులు పట్టిందన్నారు. ఇలా ఆగస్టు 6 నాటికి 50 కోట్ల మందికి టీకాలు ఇవ్వడానికి 20 రోజులు పట్టగా, 60 కోట్ల మందికి టీకాలు ఇవ్వడం పూర్తిచేయడానికి 19 రోజులు పట్టిందని తెలిపారు.

Next Story

RELATED STORIES