హైదరాబాద్ లోని జూపార్కులో 8 ఆసియా సింహాల్లో కరోనా లక్షణాలు ..!

హైదరాబాద్ లోని జూపార్కులో 8 ఆసియా సింహాల్లో కరోనా లక్షణాలు ..!
హైదరాబాద్ లోని జూపార్కులో ఉన్న 8 ఆసియా సింహాల్లో కరోనా లక్షణాలు కనిపించాయి. వాటికి ఆకలి లేకపోవడం, ముక్కు నుంచి రసి కారడం, దగ్గు వంటి కొవిడ్ లక్షణాలను జూ అధికారులు గమనించారు.

హైదరాబాద్ లోని జూపార్కులో ఉన్న 8 ఆసియా సింహాల్లో కరోనా లక్షణాలు కనిపించాయి. వాటికి ఆకలి లేకపోవడం, ముక్కు నుంచి రసి కారడం, దగ్గు వంటి కొవిడ్ లక్షణాలను జూ అధికారులు గమనించారు. అందుకే వాటినుంచి ఏప్రిల్ 29నే నమూనాలు సేకరించి.. ఆర్టీపీసీఆర్ పరీక్షల కోసం సీసీఎంబీకి పంపించారు. ఈరోజు ఆ ఎనిమిది సింహాల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సింహాల సఫారీ ప్రాంతం దాదాపు 40 ఎకరాల్లో ఉంటుంది. ఇందులో పదేళ్ల వయసున్న 12 సింహాలు ఉన్నాయి. వీటిలో నాలుగు మగ సింహాలు, నాలుగు ఆడ సింహాలు ఉన్నాయి. కరోనా కేసులు పెరుగుతున్నందువల్ల ఈనెల రెండో తేదీ నుంచి జూపార్క్ తోపాటు పార్కులను కూడా అధికారులు మూసివేశారు.

ఒకవేళ సింహాలకు కరోనా ఉన్నట్టు నిర్థారణ అయితే.. దేశంలో సింహాలు కరోనా బారిన పడడం ఇదే తొలిసారి అవుతుంది. కిందటేడాది ఏప్రిల్ లో న్యూయార్క్ లో.. ఓ జూలో ఎనిమిది పులులు, సింహాలకు కరోనా పాజిటివ్ వచ్చింది. హాంకాంగ్ లో కుక్కలు, పిల్లుల్లో కూడా వైరస్ లక్షణాలను గమనించారు. తరువాత మళ్లీ ఎక్కడా జంతువులు కొవిడ్ బారిన పడినట్టు సమాచారం లేదు. ఇప్పుడు మన దేశంలో తొలిసారిగా హైదరాబాద్ జూలో.. 8 సింహాల్లో మహమ్మారి లక్షణాలను గమనించారు. ఈ జూలో దాదాపు రెండువేల జంతువులు ఉన్నాయి. సందర్శకుల తాకిడి కూడా దీనికి ఎక్కువగానే ఉంటుంది.

సింహాల్లో కరోనా లక్షణాలు ఉన్నాయని జూ అధికారులు అంగీకరిస్తున్నా.. సీసీఎంబీ నుంచి ఆర్టీపీసీఆర్ రిపోర్టులు రానిదే ఏమీ చెప్పలేని అంటున్నారు. సీసీఎంబీ అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా వైరస్ ఉందా లేదా అని పరిశీలిస్తారు. దీంతోపాటు మనుషుల నుంచి జంతువులకు ఈ వైరస్ సంక్రమించిందా లేదా అని కూడా నిర్థారిస్తారు. మొత్తం 380 ఎకరాల్లో విస్తరించిన ఈ జూపార్కు.. నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉంటుంది.

పైగా ఈ వైరస్ గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో జూకు దగ్గరగా ఉన్న నివాస ప్రాంతాల నుంచి గాలి ద్వారా ఈ మహమ్మారి సింహాలకు సోకిందా లేదా అన్నది రిపోర్టులను బట్టి తేలిపోతుంది. ఇక జూలో పనిచేసే సిబ్బంది ద్వారా కూడా సింహాలకు కరోనా సోకే అవకాశాన్ని కొట్టిపారేయలేం అని అధికారులు అంటున్నారు. ఎందుకంటే జూపార్కు సిబ్బందిలో ఈమధ్యనే 25 మంది కొవిడ్ బారిన పడ్డారు.

శారీరకంగా బలంగా ఉండే సింహాలకు సాధారణ ఆరోగ్య సమస్యలు మామూలే. కాకపోతే ఇప్పుడు కరోనా లక్షణాలు కనిపించడంతో.. ఈ మహమ్మారి జంతువులపైనా ప్రభావం చూపిస్తుందా లేదా అన్నదానిపై సందేహాలు పెరిగాయి. ఒకవేళ వాటికి కూడా కరోనా వచ్చే అవకాశముందని తేలితే.. పెంపుడు జంతువుల విషయంలో కచ్చితంగా అప్రమత్తం కావాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story