Black Fungus: ఈ లక్షణాలు ఉంటే బ్లాక్ ఫంగస్..!

Black Fungus: ఈ లక్షణాలు ఉంటే బ్లాక్ ఫంగస్..!
ప్రాణాంతక కరోనా నుంచి కోలుకున్న వారిని ప్రస్తుతం వేధిస్తున్న మరో సమస్య బ్లాక్ ఫంగస్.. పలు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ బెంబేలెత్తిస్తోంది.

ప్రాణాంతక కరోనా నుంచి కోలుకున్న వారిని ప్రస్తుతం వేధిస్తున్న మరో సమస్య బ్లాక్ ఫంగస్.. పలు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ బెంబేలెత్తిస్తోంది. మహారాష్ట్రలో ఇప్పటికే బ్లాక్ ఫంగస్ తో 90 మంది మరణించారు.. రాజస్థాన్ లో వందకు పైగా కేసులు నమోదు కావడంతో దీనిని అంటు వ్యాధుల జాబితాలో చేర్చారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్ ) బ్లాక్ ఫంగస్ ను ఎదుర్కొనేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది.

ఎలాంటి సందర్భంలో ఫంగస్ సోకుతుంది.. ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపై పలు సూచనలు చేసింది. మధుమేహం అదుపులో లేని వారు .. ఎక్కువగా స్టెరాయిడ్స్ తీసుకునేవారిలో బ్లాక్ ఫంగస్ ప్రమాదకరమని ఎయిమ్స్ తెలిపింది.. రోగనిరోధక మందులు, క్యాన్సర్ చికిత్స తీసుకునేవారు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కరోనా తీవ్రమై..ఆక్సిజన్, వెంటిలేటర్ సపోర్టుతో ఉండి కోలుకున్న వారికి బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ వచ్చే ముప్పు ఉంటుందని ఎయిమ్స్ వెల్లడించింది.

బాధితులు వైద్యుల సలహాతో తరచూ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ లక్షణాలను కూడా ఎయిమ్స్ విడుదల చేసింది. ముక్కు నుంచి నల్లటి స్రావాలు, రక్తం కారడం ముక్కు మూసుకుపోవడం, తలనొప్పి, కంటి నొప్పి, కంటి చుట్టూ వాపు ఎర్రగా అవడం , దృష్టి కోల్పోవడం, కన్ను మూసి తెరవడంలో ఇబ్బందులు బ్లాక్ ఫంగస్ లక్షణాలని తెలిపింది. ముఖం తిమ్మిరిగా అనిపించడం, నోరు తెరవడం నమలడంలో సమస్యలు, దంతాలు వదులుగా అనిపించడం నోటి లోపల ప్రాంతాల్లో వాపు ఉండడం కూడా బ్లాక్ ఫంగస్ లక్షణాలు అని తెలిపింది. ఎవరికి వారు తరచుగా ముఖాన్ని పరీక్షించుకోవాలని సూచించింది.

ఎక్కడైనా ముట్టుకుంటే నొప్పి వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏం చేయాలనే విషయం పై ఎయిమ్స్ పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. వెంటనే చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులను సంప్రదించాలని పేర్కొంది. వైద్యులు సూచించిన ఔషధాలనే వాడాలని సొంత వైద్యం చేసుకోకూడదు అని హెచ్చరించింది.




Tags

Read MoreRead Less
Next Story