దేశవ్యాప్తంగా కొనసాగుతున్న టీకా ఉత్సవ్..!

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న టీకా ఉత్సవ్..!
రాజస్థాన్‌లో రెండురోజులకే సరిపడా నిల్వలు ఉన్నాయంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సరిపడా టీకాలు లేక ముంబయిలోని పలు కేంద్రాల్లో పంపిణీకి అంతరాయం ఏర్పడింది.

దేశవ్యాప్తంగా ఇవాళ టీకా మహోత్సవ్‌ ప్రారంభంకానుంది. నాలుగు రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా టీకాలు అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా అర్హులలో సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకా అందించనున్నారు. దేశవ్యాప్తంగా టీకా మహోత్సవ్ నిర్వహిస్తుండగా.. పలు రాష్ట్రాల్లోని వ్యాక్సినేషన్ కేంద్రాల్లో టీకాలు నిండుకున్నాయి. మహారాష్ట్రలోని ముంబయిలో పలు కేంద్రాల్లో టీకాలు లేవని బోర్డులు పెట్టారు.

రాజస్థాన్‌లో రెండురోజులకే సరిపడా నిల్వలు ఉన్నాయంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సరిపడా టీకాలు లేక ముంబయిలోని పలు కేంద్రాల్లో పంపిణీకి అంతరాయం ఏర్పడింది. అతిపెద్ద బీకేసీ సహా 120 వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో 75 కేంద్రాలను టీకాల కొరత కారణంగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు. అటు టీకాల కొరతపై ఇప్పటికే ప్రధాని మోదీకి రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ లేఖ రాశారు. వచ్చే రెండ్రోజులకు సరిపడా వ్యాక్సిన్లు మాత్రమే ఉన్నాయని.. మరిన్ని డోసులు పంపేలా చర్యలు తీసుకోవాలని అశోక్ గెహ్లాట్.. మోదీని కోరారు.

అటు ఒడిషా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోను అదే పరిస్థితి. రెండ్రోజులకు సరిపడా టీకాలు మాత్రమే ఉండటంతో మరిన్ని డోసులు పంపాలని అక్కడి ప్రభుత్వాలు కేంద్రానికి లేఖ రాశారు. ఒడిశాలోనూ 700 వ్యాక్సిన్ కేంద్రాలను మూసివేశారు. ప్రస్తుతం 3.2 లక్షల కొవిషీల్డ్​ టీకా డోసులు, లక్ష కొవాగ్జిన్​టీకా డోసులు మాత్రమే ఉన్నాయని ఒడిశా ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు 35.83 లక్షల టీకా​డోసులను కేంద్రం పంపిందని.. మరిన్ని వ్యాక్సిన్లను సరఫరా చేయాలని ఛత్తీస్‌గఢ్​సీఎం భూపేష్​బాఘేల్ తెలిపారు.

ఇక తెలంగాణలోనూ మూడు రోజులకు మాత్రమే వ్యాక్సిన్ డోసులు మిగిలి ఉన్నాయి. ఈ మేరకు కేంద్రానికి సీఎస్ సోమేష్ కుమార లేఖ రాశారు. ప్రస్తుతం 5 లక్షల 66వేల డోసుల వ్యాక్సిన్ మాత్రమే అందుబాటులో ఉంది. రోజుకు లక్ష 15వేల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో రోజుకు 2 లక్షల డోసులు పంపిణీ అవసరం కానుంది లేఖలో సీఎస్ పేర్కొన్నారు. వచ్చే 15 రోజులకు సరిపడా కనీసం 30 లక్షల డోసులు వెంటనే పంపిణీ చేయాలని లేఖలో కేంద్రాన్ని కోరారు.

మరోవైపు వ్యాక్సినేషన్‌లో భారత్‌ రికార్డు సృష్టించినా.. ఇప్పటి వరకు టీకా అందింది కేవలం పదిశాతం జనాభలోపే. ప్రపంచవ్యాప్తంగా చూస్తే టీకా పంపిణిలో అమెరికా, చైనాను భార‌త్ అధిగ‌మించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. కేవ‌లం 85 రోజుల్లోనే దేశంలో ప‌ది కోట్ల మందికి పైగా కొవిడ్ టీకాలు ఇచ్చామని చెబుతోంది. అమెరికాలో పది కోట్ల మందికి టీకాలు ఇవ్వడానికి 89 రోజులు పడితే.. చైనాకు 102 రోజులు పట్టింది. అటు దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్న ఈ సమయంలో పొరుగుదేశాలకు వ్యాక్సిన్‌ పంపించడం మానుకుని.. దేశ ప్రజలకు అందుబాటులో ఉంచాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.. చాలా రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల కొరత ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలంటున్నాయి.

ఇక ఏపీలోనూ టీకాల కొరత ఏర్పడింది. టీకా మహోత్సవ్ కార్యక్రమానికి తగినన్ని వ్యాక్సిన్లు అందుబాటులో లేవని ఏపీ ప్రభుత్వం చెప్తోంది. 25 లక్షల డోసులు కావాలని రెండు రోజుల క్రితం కేంద్రానికి ప్రభుత్వం లేఖ రాసింది. అత్యవసరంగా 25 లక్షల డోసులు పంపాలని లేదంటే టీకా మహోత్సవ్ కు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుందని లేఖలో పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో రెండున్న లక్షల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలిపింది.ఇక రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న టీకా డోసుల సంఖ్య లక్షా 35 వేలు మాత్రమే.

ఇవి పూర్తిగా ఒక్క రోజుకు కూడా చాలని పరిస్థితి. సాధారణ రోజుల్లోనే రెండు లక్షల మంది లబ్ధిదారులకు ఆరోగ్య శాఖ వ్యాక్సిన్‌ అందిస్తుంది. ఇక టీకా ఉత్సవ్‌ అంటే కనీసం 10 లక్షల మందికైనా టీకా వేయాలి. ఏ జిల్లాల్లో కూడా పూర్తిస్థాయిలో డోసులు అందుబాటులో లేవు. ఆరోగ్య శాఖ ముందస్తు ప్రణాళికలు సరిగ్గా వేసుకోకపోవడం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అవసరాలకు తగినట్టుగా వ్యాక్సిన్‌ సరఫరా చేయకపోవడంతో ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story