Top

తమిళనాడు టూరులో అమిత్‌ షా టార్గెట్ అదేనా?

తమిళనాడు టూరులో అమిత్‌ షా టార్గెట్ అదేనా?
X

తమిళనాడులో హిందీ రాజకీయాలు నడవవు. బీజేపీ మాత్రం పక్కాగా హిందీ రాజకీయాలే నమ్ముకుంది. కేవలం హిందీనే కాదు సంస్కృత పదాలు ఉన్నా సరే ఘొల్లుమంటారు తమిళులు. ఆ మధ్య టీచర్స్‌ డేను గురు ఉత్సవ్‌గా మార్చాలనే ప్రతిపాదన వచ్చే సరికి.. అలా ఎలా చేస్తారని మండిపడ్డారు. ఉత్తరాది నుంచి తమిళనాడులో పనిచేస్తున్న అధికారులు కూడా హిందీ రాకపోతే హీనంగా చూడడం వంటి సంఘటనలు జరిగాయి. అందుకే, బీజేపీ అంటేనే ఒకరకమైన మంటతో ఉంటారు తమిళులు. ఆల్రడీ అమిత్ షాకు షాక్ తగిలింది కూడా. అభివాదం చేసుకుంటూ వస్తున్న అమిత్ షాపై.. గో బ్యాక్ అమిత్ షా అని రాసి ఉన్న ప్లకార్డ్ విసిరారు. అలాంటి తమిళనాడులో చక్రం తిప్పాలనుకుంటోంది బీజేపీ.

తమిళనాడులో బీజేపీ జెండాను ఎగరవేయాలంటే రజనీకాంత్ లాంటి స్టారే కావాలి. అందుకే, ఈ సూపర్ స్టార్ ఏం చేస్తారా అని ఇన్నాళ్లూ చాలా ఓపిగ్గా వేచిచూశారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు కూడా వచ్చేస్తున్నాయి. అయినా.. మీనమేషాలు లెక్కిస్తున్నారు రజినీ కాంత్. ఈ నాన్చుడుకు పుల్‌స్టాప్ పెట్టించి.. పార్టీ పెడతారా, మాతో కలిసి నడుస్తారా అని అడిగేయాలనుకుంటున్నారు అమిత్ షా. రజినీ పార్టీ పెట్టాలి, ఆ పార్టీ బీజేపీకి మద్దతుగా నిలవాలి. లేదంటే బీజేపీకి ఓటు వేయండని రజినీకాంత్‌తో చెప్పించాలి. తమిళనాడు టూరులో షా టార్గెట్ ఇదే. ఈ రెండూ జరక్కపోతే అమిత్ షా దగ్గర ప్లాన్-బి ఉంది.

తమిళనాడులో అన్నాడీఎంకే అతిపెద్ద పార్టీ. జయలలిత చనిపోయిన తరువాత దాదాపుగా అనాథ అయింది. బీజేపీ నేనున్నానంటూ అక్కున చేర్చుకుని పెద్దన్నగా వ్యవహరిస్తోంది. కాస్త సందు దొరికింది కదా పాగా వేసేద్దాం అనుకుంటోంది. పేరుకు పెద్ద పార్టీనే అయినా.. ఇప్పుడున్న అన్నాడీఎంకేను నడిపించడానికి ఓ సమర్ధవంతమైన నాయకుడు కావాలి. కాషాయ జెండాను భుజాన మోసే స్టార్లు కావాలి. అందుకే, క్రౌడ్ పుల్లర్స్‌ను లాగేసే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నామధ్య ఖుష్బూను తీసుకొచ్చారు. డీఎంకే పార్టీ మాజీ ఎంపీ రామలింగం బీజేపీలోకి వచ్చేశారు. ఇంతటితో ఆగడం లేదు. డీఎంకేను డ్యామేజ్ చేసేలా పెద్ద చేపనే పట్టబోతున్నారు. ఆయనే అళగిరి. మాజీ సీఎం కరుణానిధి పెద్దకొడుకు ఈయన. కొన్నాళ్లు డీఎంకే బాధ్యతలు కూడా చూశారు. అయితే, కరుణానిధి అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించారు. కరుణానిధి చనిపోయిన తరువాత డీఎంకేలోకి వెళ్లేందుకు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ.. ప్రస్తుత డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ మాత్రం పార్టీలోకి రానివ్వలేదు. కనీసం రజినీకాంత్ పార్టీ పెడితేనై అందులోనైనా చేరిపోదాం అనుకున్నారు. ఆ సస్పెన్స్ వీడకపోవడంతో.. కలైంజర్ డీఎంకే పేరుతో సొంతంగా పార్టీ పెట్టే యోచనలో ఉన్నారు అళగిరి.

అళగిరికి, అమిత్ షా పర్యటనకు లింక్ ఉంది. డీఎంకేను దెబ్బకొట్టాలని బీజేపీకి ఎంత ఆశ ఉందో.. అంతే కోరిక అళగిరికి కూడా ఉంది. అందుకే, పార్టీ పెట్టి బీజేపీకి మద్దతివ్వాలనేది ప్లాన్. ఒకవేళ అమిత్ షా చాణక్యం పనిచేస్తే గనక.. డైరెక్టుగా బీజేపీలోనే చేరొచ్చు. ఒక్క దెబ్బతో డీఎంకేలో ఓట్ల చీలిక, డీఎంకే అసంతృప్త నేతలకు గాలం వేయొచ్చనేది అమిత్ షా ప్లాన్.

అన్నాడీఎంకేకు బీజేపీ మద్దతు ఉన్నదన్నది బహిరంగ రహస్యమే. ఎందుకో తాము బీజేపీపై ఆధారపడడం లేదనే సంకేతాలు ఇస్తోంది అన్నాడీఎంకే. ఎందుకంటే, బీజేపీ ఆధ్వర్యంలో మెగా కూటమి ఏర్పాటవుతుందని, ఆ కూటమిలో అధికార పార్టీ అన్నాడీఎంకే కూడా ఉంటుందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు ప్రకటించారు. దీన్ని అన్నాడీఎంకే ఖండించింది. లేదు లేదు అన్నాడీఎంకేనే మహా కూటమి ఏర్పాటు చేస్తుంది, అందులో బీజేపీ మిత్రపక్షంగా ఉంటుందని అనౌన్స్ చేశారు. పైగా రాష్ట్ర బీజేపీ నాయకత్వం చేపడుతున్న వెట్రివేల్ యాత్రకు అధికారపార్టీనే బ్రేకులు వేసింది. కరోనా కారణంగా వేల్ యాత్ర చేయొద్దని గట్టిగానే చెప్పింది. మొత్తానికి రెండుపార్టీల మధ్య కాస్త రభస నడుస్తోంది. కాని, అమిత్ షాకు ఇవన్నీ లెక్కకు రావు. బీజేపీ పొత్తులో ఎవరుంటారు, ఎవరు మద్దతిస్తారనేదే ముఖ్యం. అందుకే, తమిళనాడులో అడుగుపెట్టారు షా. ఓవరాల్‌గా వచ్చే ఏడాది జరిగే తమిళనాడు ఎన్నికల్లో కాషాయజెండా రెపరెపలాడించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు అమిత్ షా.

Next Story

RELATED STORIES