బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత ప్రచారానికి తెర

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత ప్రచారానికి తెర

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత ప్రచారానికి తెరపడింది. బుధవారం 71 అసెంబ్లీ స్థానాలకు తొలి విడత ఎన్నికలకు వాడీ వేడిగా ప్రచారం సాగింది. అధికార, విపక్ష పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో బిహార్‌ రాజకీయాలను హీటెక్కించాయి. ప్రధాని నరేంద్ర మోదీ మూడు ప్రచార ర్యాలీల్లో పాల్గొని ప్రసంగించారు. ఓట్ల వర్షం కురిపించడమే లక్ష్యంగా తొలి విడత ప్రచారం సాగింది. ఎన్డీయే కూటమికి ఓటు వేసి నితీశ్ కుమార్‌కు మరోసారి అధికారం అప్పగించాలని ప్రధాని ఓటర్లను అభ్యర్థించారు. అలాగే, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కూడా తమ కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు.

బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్లుగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, ఆర్టికల్‌ 370 రద్దు, ముమ్మారు తలక్‌ సహా పలు అంశాలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యలను ఓటర్లకు వివరించారు. తద్వారా ఓటర్లను ఎన్డీయే కూటమి వైపు ఆకర్షితుల్ని చేసేందుకు ప్రయత్నించారు. మరోవైపు, తనకు మళ్లీ అవకాశం ఇవ్వాలని నితీశ్ కుమార్‌ కోరారు. వర్చువల్‌ ర్యాలీల్లోనే కాకుండా అనేక బహిరంగ సభల్లోనూ ఆయన పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి రెండు సభల్లో వేదికను పంచుకున్నారు.

ఆర్జేడీ నేత, విపక్ష కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్‌ కూడా ముమ్మర ప్రచారం సాగించారు. ర్యాలీలతో పాటు సామాజిక మాధ్యమాల్లో వీడియో సందేశాలు పంపడం, మీడియా సమావేశాలతో జనంలోకి దూసుకెళ్లారు. మరోవైపు, ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగి అందరినీ ఆశ్చర్యపరిచిన ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్‌ పాశ్వాన్‌ తనదైన శైలిలో ప్రచారం కొనసాగించారు. తొలి విడతలో 71 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. మొత్తం 1066 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 114 మంది మహిళలే. నక్సల్‌ ప్రభావిత జిల్లాలైన గయా, రోహ్తాస్‌, ఔరంగాబాద్‌తో పాటు మొత్తం ఆరు జిల్లాల పరిధిలో తొలి దశ పోలింగ్‌ జరగనుంది. ఈ ఎన్నికలు నితీశ్‌ కుమార్‌ కేబినెట్‌లో ఆరుగురు మంత్రుల భవితవ్యాన్ని తేల్చనున్నాయి. తొలి విడత ఎన్నికలు జరుగుతున్న 71 స్థానాల్లో ప్రధాన పార్టీలైన ఆర్జేడీ నుంచి 42 మందిని బరిలో నిలవగా.. జేడీయూ నుంచి 41, భాజపా 29, కాంగ్రెస్‌ 21, ఎల్జేపీ నుంచి 41మంది చొప్పున అభ్యర్థులను పోటీలో నిలిపాయి.

Tags

Read MoreRead Less
Next Story