బీహార్‌లో అధికారం ఎవరిదో తేల్చిన ఎగ్జిట్ పోల్స్

బీహార్‌లో అధికారం ఎవరిదో తేల్చిన ఎగ్జిట్ పోల్స్

మూడు దశలలో జరిగిన బిహార్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా తమ సర్వే వివరాలను వెల్లడిస్తున్నాయి. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం ఆర్జేడీకి 85 నుంచి 95 సీట్లు వస్తాయని అంచనా వేసింది. బీజేపీకి 65 నుంచి 75 సీట్లు, జేడీయూకి 25 నుంచి 35 సీట్లు,కాంగ్రెస్‌కు 15 నుంచి 20 సీట్లు, లెఫ్ట్ పార్టీలకు మూడు నుంచి ఐదు సీట్లు, ఎల్‌జేపీకి మూడు నుంచి ఐదు సీట్లు, స్వతంత్ర అభ్యర్ధులకు ఐదు నుంచి 13 సీట్లు వస్తాయని పీపుల్స్ సర్వే అంచనా వేసింది.

మహాఘట్‌బంధన్‌కే స్వల్ప ఆధిక్యత వచ్చే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ సర్వే తెలిపింది. ప్రభుత్వ వ్యతిరేకత పెరిగితే మాత్రం ఆర్జేడీ కూటమికి ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని పీపుల్స్ పల్స్ సర్వే తెలిపింది. మరోవైపు బిహార్ సీఎంగా తేజస్వి యాదవ్ వైపు 36 శాతం, నితీశ్ కుమార్ వైపు 34 శాతం మంది ఓటర్లు మొగ్గు చూపారు.

బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 122 సీట్ల మ్యాజిక్ ఫిగర్ అందుకున్న కూటమి అధికారాన్ని చేపట్టనుంది. ఈ ఎన్నికల్లో నితీశ్ కుమార్‌ను సీఎం అభ్యర్థిగా నిలిపింది ఎన్డీఏ కూటమి. జేడీయూ, హిందుస్తాన్ అవామ్ మోర్చా, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీతో కలిసి బీజేపీ ఓ కూటమిని ఏర్పాటు చేసింది. అటు లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ కూడా కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్‌తో కలిసి మహాఘట్‌బంధన్ ఏర్పాటు చేసింది. లోక్‌ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ ఈ ఎన్నికల్లో నామమాత్ర ప్రభావమే చూపనున్నారని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

ఎన్డీఏ కూటమికి ప్రజా ఆగ్రహం తప్పదని ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్ చెబుతోంది. మూడో దశ పోలింగ్‌లో ఆ విషయం స్పష్టంగా బయటపడిందని చెప్పుకొచ్చింది. ఇవాళ జరిగిన సీమాంచల్, కోసి బెల్ట్‌లో గ్రాండ్ అలయన్స్‌కే ఎడ్జ్ ఉంటుందని మహాఘట్‌బంధన్ ప్రకటించుకుంది. అయితే సర్వేలు మరోలా అంచనా వేశాయి. మొదటి రెండు దశల్లో జరిగిన పోలింగ్‌లో ఎన్డీఏకే ఎక్కువ సీట్లు వస్తాయని చెబుతున్నాయి. ఇక ఎంఐఎం కూడా 16 సీట్లలో పోటీ చేసింది. ఈసారి ఎంఐఎం ఒకటి లేదా రెండు సీట్లు గెలవొచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

అయితే గత కొన్ని రోజులుగా నితీష్ కుమార్ కంటే ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ గురించే ఎక్కువ చర్చ జరిగింది. మొట్టమొదటిసారి గూగుల్ సెర్చ్‌లో నితీష్‌ని మించి తేజస్వి గురించి వెతికారు. అయినప్పటికీ ఆర్జేడీ కంటే బీజేపీకే ఎక్కువ సీట్లు రావొచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. షైనింగ్ ఇండియా సర్వే మాత్రం హంగ్ ఏర్పడవచ్చని చెబుతోంది.

పోలింగ్ ముగియడంతో ఒక్కో సంస్థ ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేస్తున్నాయి. ఎన్డీటీవీ, ఇండియా టుడే-సిసెరో ఎన్డీఏకే మెజారిటీ రావొచ్చని తేల్చి చెప్పింది. 2015లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. ఎన్డీఏ కూటమి గెలుస్తుందని మెజారిటీ సర్వేలు చెప్పాయి. కాని, మహాఘట్‌బంధన్ గెలిచింది. ఆనాడు మహాఘట్‌బంధన్‌లో జేడీయూ కూడా ఉంది. ఈసారి నితీష్ సారథ్యంలోని జేడీయూ ఎన్డీఏతో జత కట్టింది. దీంతో నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారంటూ సర్వేలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూతో కూడిన కూటమి గెలిచినప్పటికీ ఓటు పర్సంటేజీ మాత్రం బీజేపీకే ఎక్కువగా వచ్చాయి. ఈసారి ఎన్డీఏ కూటమి గెలుస్తుందనడానికి ఇది కూడా ఓ కారణమని సర్వేలు చెబుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story