రైతులతో మరోసారి కేంద్రం చర్చలు.. 40 సంఘాలను ఆహ్వానించిన కేంద్రం

రైతులతో మరోసారి కేంద్రం చర్చలు.. 40 సంఘాలను ఆహ్వానించిన కేంద్రం

ప్రతీకాత్మక చిత్రం 

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీలో ఆందోళనలు నిర్వహిస్తున్న రైతు సంఘాలతో ఇవాళ మధ్యాహ్నం కేంద్రం మరోసారి చర్చలు జరపనుంది. 40 రైతు సంఘాలను కేంద్రం చర్చలకు పిలిచింది. ఇప్పటికే నాలుగు అంశాల ఎజెండాతో కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్‌కు రైతు సంఘాలు లేఖ పంపాయి. మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి అనుసరించాల్సిన పద్ధతులపై చర్చించాలనేది చర్చల్లో మొదటి అంశం కాగా.. అన్ని రకాల పంటలకు జాతీయ రైతు కమిషన్ సూచించిన లాభదాయకమైన MSPకి చట్ట బద్దత కల్పించడం రెండోది. ఢిల్లీ పరిసర ప్రాంతాలలో వాయు నాణ్యత నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కమిషన్ ఆర్డినెన్స్‌కు సవరణలు చేయాలని.. ఆర్డినెన్స్ శిక్షా నిబంధనల నుండి రైతులను మినహాయించాలని మూడో అజెండాగా చేర్చారు. ఇక..రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు విద్యుత్ సవరణ బిల్లు 2020 ముసాయిదాలో అవసరమైన మార్పులు చేయడంపై చర్చించాలనేది నాలుగో అజెండా.

కేంద్రంతో మనసు పెట్టి చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామని రైతు సంఘాలు పేర్కొన్నాయి. గత సమావేశాల వాస్తవాలను దాచిపెట్టి ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపించాయి. గత చర్చల సందర్భంగా కూడా వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతు డిమాండ్లను ప్రభుత్వం వక్రీకరించి వ్యవసాయ చట్టాలలో సవరణ చేయాలని మేము కోరుతున్నట్లుగా చెప్తుందని మండిపడుతున్నారు. నిజంగా రైతు సమస్యలు పరిష్కారించాలంటే రైతులు లెవనెత్తుతున్న డిమాండ్ల గురించి అపార్ధం చేసుకోవద్దని రైతు సంఘాలు సూచించాయి. రైతులకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారాన్ని ఆపాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. మరో వైపు చర్చల రోజు కూడా రైతులు నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. ఢిల్లీ సరిహద్దులో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించనున్నారు.

ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా బీహార్‌ అన్నదాతలు కదం తొక్కారు. రాష్ట్ర రాజధాని పాట్నాలోని రాజ్‌భవన్‌కు ర్యాలీగా వెళ్లారు. నూతన సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. రహదారులపై పోలీసులు బారీకేడ్లు పెట్టగా వాటిని తోసుకుంటూ వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది. అఖిల భారతీయ కిసాన్‌ సంఘర్ష్‌ సమన్వయ్‌ సమితి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. వామపక్ష పార్టీలకు చెందిన పలు రైతు సంఘాలు ఇందులో పాల్గొన్నాయి.

రైతులతో చర్చలు జరపనున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కీలక సమావేశం నిర్వహించారు. వ్యవసాయ, వాణిజ్య శాఖ మంత్రులతో సమావేశమయ్యారు. వ్యవసాయ చట్టంపై కేంద్రం ప్రతిపాదనలు, రైతుల డిమాండ్లపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఐదు సార్లు కేంద్రం రైతులతో చర్చలు జరిపింది. చట్టాలు రద్దు చేయాల్సిందేనని రైతులు పట్టుబట్టగా.. సవరణలు చేస్తామని కేంద్రం చెబుతోంది. చట్టాల రద్దు తప్ప మరే ఇతర ప్రతిపాదనలకు రైతులు ఒప్పుకోకపోవడంతో చర్చలన్నీ ఎలాంటి పురోగతి లేకుండా ముగిశాయి. ఈసారైనా ప్రతిష్టంభన తొలగుతుందో లేదో వేచి చూడాలి.


Tags

Read MoreRead Less
Next Story