Chennai: అంబులెన్స్ నుంచి దూకి.. పోలీసులకు చిక్కి.. విదేశీయుడి నానా యాగీ...

Chennai: అంబులెన్స్ నుంచి దూకి.. పోలీసులకు చిక్కి.. విదేశీయుడి నానా యాగీ...
చెన్నపట్నంలో విదేశీయుడి హంగామా... అవయవాలు ఎత్తుకుపోయేవారికి చిక్కానంటూ హడావిడి....

చుట్టపుచూపుగా వచ్చిన అమెరికా దేశస్థుడు అనవసర భయాలతో నానా యాగీ చేసి చివరకు పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన చెన్నైలోని పెరియామెట్ లో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే... ఫ్లోరిడా కు చెందిన గ్యానీ మార్సెలో (26) అనే వ్యక్తి స్నేహితుడి వివాహ వేడుకకు హాజరయ్యేందుకు చెన్నై వచ్చాడు. పెరియామెట్ లోని ఓ 5నక్షత్రాల హోటల్ లో ఉంటున్నాడు. అయితే ముందు రోజు రాత్రి మత్తులో ఊగిపోతూ హోటల్ కు చేరుకున్న మార్సెలోను సిబ్బందే గదికి చేర్చాల్సి వచ్చింది. అయితే కాసేపటికే రిసెప్షన్ కు పరిగెత్తుకుంటూ వచ్చిన అతడి తలకు నెత్తురు కారుతోందని సిబ్బంది గుర్తించారు. గదిలో కాలుజారి పడిపోవడంతో తలకు గాయమైందని వారికి చెప్పాడు. ఈమేరకు హోటల్ సిబ్బంది ఆంబ్యులెన్స్ ను రప్పించి, మార్సెలోను హుటాహుటిన రాజీవ్ గాంధీ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు.


అయితే అప్పటివరకూ బాగానే ఉన్న మార్సెలో ఆంబ్యులెన్స్ రిప్పన్ బిల్డింగ్ దగ్గరకు చేరుకునేసరికి... వెనుక కిటికీ డోరు పగలగొట్టుకుని అందులోంచి దూకి పారిపోయాడు. అలా వెళ్లిపోయిన వాడు అల్లిపురం కోర్డ్ కాంప్లెక్స్ లోని బైక్ పార్కింగ్ ఏరియాలో తలదాచుకోగా... ఈమేరకు సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే.. తనను శరీర అవయవాలతో వ్యాపారం చేసే మాఫియా ఎత్తుకుపోతోందన్న భయంతోనే పారిపోయేందుకు ప్రయత్నించానని మార్సెలో పోలీసులకు తెలిపాడు. ఈ వింత సమాధానానికి అవాక్కయిన పోలీసులు అతడికి చిన్న వార్నింగ్ ఇచ్చి విడిచిపెట్టబోతున్నట్లు తెలిపారు.


Tags

Read MoreRead Less
Next Story