పుదుచ్చేరిలో పనిచేసిన బీజేపీ స్ట్రాటజీ.. కుప్పకూలిన కాంగ్రెస్ కూటమి

పుదుచ్చేరిలో పనిచేసిన బీజేపీ స్ట్రాటజీ.. కుప్పకూలిన కాంగ్రెస్ కూటమి
రెబల్‌ MLAలతో చర్చలేమీ జరపకుండానే డైరెక్టుగా బలనిరూపణకు వెళ్లారు నారాయణస్వామి.

పుదుచ్చేరిలో బీజేపీ స్ట్రాటజీ పనిచేసింది. కాంగ్రెస్ కూటమి కుప్పకూలింది. అసెంబ్లీలో బలం నిరూపించుకోలేని పరిస్థితుల్లో.. నారాయణస్వామి సీఎంగా రాజీనామా చేశారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసైకి రాజీనామా లేఖ అందించారు. ఇవాళ విశ్వాసపరీక్ష సందర్భంగా ప్రత్యేకంగా శాసనసభ సమావేశమైంది. CM నారాయణస్వామి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. BJPపైన, కేంద్రంపైన నిప్పులు చెరిగారు. తమ ప్రభుత్వాన్ని కూల దోసేందుకు కుట్రలు జరిగాయంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తర్వాత.. తీర్మానంపై ఓటింగ్ జరక్కముందే ముఖ్యమంత్రి సహా ఆయన వర్గం MLAలు సభ నుంచి వెళ్లిపోయారు. దీంతో.. తీర్మానం వీగిపోయినట్టు స్పీకర్ ప్రకటించారు.

పుదుచ్చేరిలో మరో 2 నెలల్లో ఎన్నికలు జరుగుతాయి అనగా చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలతో అక్కడ కాంగ్రెస్‌ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అధికార పక్షంలో ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా రాజీనామా చేయడంతో నారాయణస్వామి సర్కారు మైనారిటీలో పడడం, చివరికి బలం నిరూపించుకోలేక నారాయణస్వామి తప్పుకోవడం వేగంగా జరిగిపోయాయి. MLAల రాజీనామాలు చేయగానే లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌ కిరణ్‌బేడి స్థానంలో ఆ బాధ్యతలు తీసుకున్న తమిళిసై.. వెంటనే బలపరీక్షకు సిద్ధమవ్వాలని ఆదేశించడంతో.. పుదుచ్చేరి అసెంబ్లీ ఇవాళ సమావేశమైంది. ఐతే.. రెబల్‌ MLAలతో చర్చలేమీ జరపకుండానే డైరెక్టుగా బలనిరూపణకు వెళ్లారు నారాయణస్వామి. సభలో తాను చెప్పాలనుకున్నది చెప్పి తర్వాత నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా సమర్పించారు.

కాంగ్రెస్, డీఎంకే ఎమ్మెల్యేల రాజీనామా తరువాత.. పుదుచ్చేరి అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 26కి పడిపోయింది. దీంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగడానికి 14 మంది ఎమ్మెల్యేల బలం అవసరమైంది. కాని ఉన్నది 11 మంది మాత్రమే. అటు, ప్రతిపక్ష కూటమికి 14 మంది ఉన్నారు. దీంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేల మెజారిటీ స్పష్టంగా కనిపించడంతో నారాయణస్వామి సర్కార్‌ కుప్పకూలింది.

నారాయణస్వామి రాజీనామా చేయడంతో బంతి లెఫ్టినెంట్ గవర్నర్‌ కోర్టులో పడింది. పుదుచ్చేరిలో ప్రభుత్వం ఏర్పాటు ఇప్పుడు రాజ్‌భవన్ చేతిలో ఉంది. ఒకవేళ ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ కూటమి బలం నిరూపించుకుంటానని ముందుకొస్తే.. వారికే ఛాన్స్ ఇవ్వనున్నారు తమిళిసై. లేదంటే, అసెంబ్లీని రద్దు చేసి కొన్నాళ్ల పాటు సుప్తచేతనావస్థలో ఉంచనున్నారు. పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలకు రెండు నెలలే ఉండడంతో.. రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలూ ఉన్నాయి.

ఫ్లోర్‌ టెస్టు జరుగుతున్నప్పుడు నారాయణస్వామి మాట్లాడారు. సోనియా గాంధీ, డీఎంకే నేత స్టాలిన్ కారణంగా సీఎం అయ్యానని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం సాధించిన విజయాలు గురించి సీఎం సభలో ప్రస్తావించారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రం కుట్రలు చేసిందని ఆరోపించారు. ముఖ్యంగా మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, కేంద్ర ప్రభుత్వం, విపక్షాలు కలిసి ప్రభుత్వాన్ని కూల్చడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయని అన్నారు. తాము ప్రతిపాదనలు పంపినా ఎటువంటి నిధులు ఇవ్వకుండా పుదుచ్చేరి ప్రజలకు కేంద్రం ద్రోహం చేసిందని ఆరోపించారు నారాయణస్వామి. అలాగే పుదుచ్చేరికి UT హోదా బదులు రాష్ట్ర హోదా ఇచ్చే విషయంలోనూ BJP మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు.


Tags

Read MoreRead Less
Next Story