దడ పుట్టిస్తున్న కరోనా..త్వరలోనే లాక్‌డౌన్‌ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం

దడ పుట్టిస్తున్న కరోనా..త్వరలోనే లాక్‌డౌన్‌ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం
కరోనా ఉధృతి రోజురోజుకు పెరుగుతుండడంతో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారా అన్న అనుమానాలు జనాల్లో పెరిగాయి.

కరోనా వైరస్ మరోసారి దడపుట్టిస్తోంది. 3 రోజుల్లోనే లక్షకు పైగా కొత్త కేసులు బయటపడ్డాయి. నిన్నటి వరకు 43వేల 846 కొత్త కేసులు నమోదవగా.. 197 మంది చనిపోయారు. ఇవాళ కొత్తగా దేశవ్యాప్తంగా 420 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత ఏడాది నవంబరు 29 తర్వాత ఒక రోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలో అయితే కరోనా ఉధృతి మరీ ఎక్కువగా ఉంది. నిన్న ఒక్కరోజులోనే 27వేల 126 కేసులు బయటపడ్డాయి.సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

తమిళనాడులో రేపటి నుంచి 9,10,11 తరగతుల విద్యార్థులు కూడా పాఠశాలలకు రావొద్దని ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులకు కేవలం ఆన్‌లైన్ క్లాసులు మాత్రమే కొనసాగుతాయని, హాస్టల్స్ కూడా మూసివేయాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది. ప్రపంచవ్యాప్తంగా నిన్న 4 లక్షల 94వేల 573 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 12 కోట్ల 34 లక్షలు దాటింది. అమెరికాలో అయితే కొత్తగా 53వేల 875 పాజిటివ్ కేసులొచ్చాయి. యూఎస్‌లో కరోనా బారిన పడిన వారి సంఖ్య మూడు కోట్లు దాటింది. అమెరికా, బ్రెజిల్ తరువాత ఇండియాలోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

కరోనాను ఇన్నాళ్లు లైట్ తీసుకున్న జనం కూడా ఇప్పుడు అలర్ట్ అవుతున్నారు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని తేడా లేకుండా దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది. కరోనా వైరస్ ఇప్పుడే తన అసలు పని మొదటుపెట్టిందంటున్నారు శాస్త్రవేత్తలు. ఓవైపు వ్యాక్సిన్లు తయారుచేసినా, జనాల్లో ధైర్యం నింపినా సరే ఎక్కడో భయాలు, అనుమానాలున్నాయి. కరోనా రూపాంతరం చెంది మరింత శక్తివంతమైన స్ట్రెయిన్లుగా తయారవుతుందా అన్న భయాలున్నాయి. బ్రెజిల్, అమెరికా, బ్రిటన్, దక్షిణాఫ్రికా సహా చాలా దేశాల్లో కొత్త స్ట్రెయిన్‌ విజృంభిస్తోంది. కాకపోతే, కరోనా ఎంత శక్తివంతంగా మారినా.. కేసులు పెరుగుతున్నాయే తప్ప మరణాల సంఖ్య పెరగడం లేదు. పైగా మనదేశంలో తయారైన వ్యాక్సిన్లు.. ఎలాంటి కొత్త స్ట్రెయిన్‌నైనా తట్టుకోగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కరోనా ఉధృతి రోజురోజుకు పెరుగుతుండడంతో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారా అన్న అనుమానాలు జనాల్లో పెరిగాయి. త్వరలోనే లాక్‌డౌన్‌ ఉంటుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరుగుతోంది. కాని, ఈ మధ్య నరేంద్ర మోదీ ఓ మాట చాలా స్పష్టంగా చెప్పారు. మరోసారి ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని, కాకపోతే కరోనా రూల్స్ పాటించేలా చేస్తూనే ప్రజలకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని రాష్ట్రాలను కోరారు. అంటే మరోసారి లాక్‌డౌన్ ఉండకపోవచ్చనే దీనర్థం అంటున్నారు విశ్లేషకులు. కరోనాను కంట్రోల్ చేయాంటే మాస్క్‌ ఒక్కటే అస్త్రంగా కనిపిస్తోంది. మాస్క్ పెట్టుకునే వారికి కరోనా అంతగా సోకట్లేదని చెబుతున్నారు.


Tags

Read MoreRead Less
Next Story