దేశవ్యాప్తంగా తగ్గినట్టే తగ్గి మరోసారి విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి

దేశవ్యాప్తంగా తగ్గినట్టే తగ్గి మరోసారి విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పక్రియ వేగంగా కొనసాగుతుంటే.. కొన్ని రాష్ట్రాల్లో వైరస్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.

దేశవ్యాప్తంగా తగ్గినట్టే తగ్గి మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కేసుల తీవ్రత అంతకంతకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అక్కడ కొత్తగా 16వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఒకే రోజు ఈ స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూడం ఈ ఏడాదిలో ఇదే తొలిసారి. శనివారం కూడా 15వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.. 88 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం రికవరీ రేటు 92.2 శాతం ఉంది.. ముంబై, నాగ్‌పూర్‌లో కేసుల సంఖ్య పెరుగుతోంది. పూణె, నాశిక్, అలోకా, బుల్దానా, అమరావతీ ప్రాంతాల్లో కరోనా ఉధృతి అధికంగా ఉండటంతో అక్కడి ప్రభుత్వం పాక్షిక లాక్ డౌన్ విధించింది. కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్ యాజమాన్య సంఘాలు కోవిడ్ ప్రొటోకాల్స్ తప్పనిసరిగా పాటించేలా ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు.

ఇక దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పక్రియ వేగంగా కొనసాగుతుంటే.. కొన్ని రాష్ట్రాల్లో వైరస్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. పాజిటివ్‌ కేసులతోపాటు మరణాలు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కేరళ, పంజాబ్‌, కర్ణాటక, గుజరాత్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో నిత్యం కొత్త కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశ్యవాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో 87.73శాతం ఈ ఏడు రాష్ట్రాల్లోనే నుంచి వస్తున్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. గత కొద్దిరోజులుగా నిత్యం 20వేలకుపైగా కేసులు బయటపడుతున్నాయి.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 25వేలా 320 కేసులు నమోదయ్యాయి.. ఈ ఏడాదిలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే.. వైరస్‌ సోకి 161 మంది చనిపోయారు.. యాక్టివ్‌ కేసుల సంఖ్య 1.85 శాతానికి పెరిగింది. మరోవైపు కొవిడ్‌ను ఎదుర్కొనే టీకా పంపిణీ దేశంలోని అన్ని ప్రాంతాల్లో వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన టీకాల సంఖ్య 3 కోట్లకు చేరువైంది.

మరోవైపు వైరస్‌ ముప్పు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.. ఇది తీవ్ర రూపం దాల్చితే, దేశంలో మరో కొత్త వైరస్‌లు కూడా పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండటం ఒక్కటే వైరస్‌ వ్యాప్తిని కట్టడిచేయడానికి మార్గమని చెబుతున్నారు.. ఇక కరోనా వైరస్‌పై జరుగుతున్న పరిశోధనల్లో కీలక విషయాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. గబ్బిలాల్లో ఉండగానే కరోనా వైరస్‌కు మనుషుల్లో వేగంగా వ్యాపించే సామర్థ్యం సమకూరి ఉంటుందని చర్చించుకుంటున్నారు. సాధారణంగా వైరస్‌లు ఒక కొత్త జీవికి సంక్రమించిన తర్వాత ఆ వాతావరణానికి అలవాటు పడే క్రమంలో అనేక జన్యుమార్పులకు లోనవుతాయి.. ఈ ప్రక్రియలో అధిక శాతం విఫలమై చివరకు అంతర్ధానమైపోతాయి.. కానీ, కరోనా వైరస్‌ విషయంలో ఇందుకు విరుద్ధంగా జరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా వైరస్‌కు వేగంగా వ్యాపించే సామర్థ్యం గబ్బిలాల్లో ఉండగానే అలవడి ఉండొచ్చని వారంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story