నేడు మోదీ అఖిలపక్ష సమావేశం.. కరోనా టీకాపై కీలక ప్రకటన చేసే ఛాన్స్‌..

నేడు మోదీ అఖిలపక్ష సమావేశం.. కరోనా టీకాపై కీలక ప్రకటన చేసే ఛాన్స్‌..

ప్రపంచ దేశాలన్ని కరోనా వ్యాక్సిన్‌ రూపొందించడంలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ కరోనా వ్యాక్సిన్‌ను తయారుచేసింది. దీని సక్సెస్ రేటు నూటికి 95 శాతం. అన్ని పరీక్షల్లో విజయవంతం కావడంతో బ్రిటన్ ప్రభుత్వం ఈ వ్యాక్సిన్‌కు ఓకే చెప్పేసింది. వచ్చే వారం నుంచే బ్రిటన్ ప్రజలకు టీకా అందుబాటులోకి రానుంది. 4 కోట్ల డోసులను యూకే ప్రభుత్వం ఆర్డర్ చేసింది. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, వృద్ధులకు ముందుగా ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

రష్యా కూడా వ్యాక్సిన్ విషయంలో దూకుడుగా ఉంది. తమ దేశంలో తయారైన స్పుత్నిక్-వి వ్యాక్సినేషన్‌కు రష్యా అనుమతి ఇచ్చింది. రష్యాలో కూడా వచ్చే వారం నుంచే టీకాలు వేయడం ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రస్తుతానికి 20 లక్షల డోసులను తయారుచేయించింది. ఇప్పటికే లక్ష మందికిపైగా స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌ను ఇచ్చారు. ఒకట్రెండు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా మరికొన్ని వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

వ్యాక్సిన్‌ విషయంలో భారత్ కూడా దూకుడుగానే వెళ్తోంది. పైగా మరే దేశంలో లేనంత ఉత్పత్తి సామర్ధ్యం భారత్ సొంతం. అందుకే, వ్యాక్సిన్ తయారుచేయడం ఆలస్యమవుతుంది. టీకా పంపిణీని వేగవంతం చేయనుంది భారత్. దీనిపై రాష్ట్రాలు సైతం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. భారత్ బయోటెక్ తయారుచేస్తున్న కొవాగ్జిన్ మూడోదశ ప్రయోగాల్లో ఉంది. వీటి ఫలితాలు అతి త్వరలోనే బయటకు రాబోతున్నాయి. పైగా భారత అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తి సామర్ధ్యం కూడా ఉందని ఆ సంస్థ తెలిపింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్.. చాలా తక్కువ ధరకు రాబోతోంది.

ఇదిలా ఉంటే భారత్‌ జనాభా 130 కోట్లు ఉండగా.. 260 కోట్ల డోసులు అవసరం అవుతాయి. కరోనా టీకాను రెండుసార్లు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఏడాదికి రెండున్నర కోట్ల మంది పుడుతున్నారు. వీళ్లకి కూడా టీకా సప్లై చేయాల్సి ఉంటుంది. కరోనా వ్యాక్సిన్లు తయారుచేయడం ఒక ఎత్తైతే... వాటిని రవాణా చేయడం మరో ఎత్తు. ఈ వ్యాక్సిన్‌ను మైనస్ డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద స్టోర్ చేయాల్సి ఉంటుంది. కాని, ఇండియాలో 27వేల కోల్డ్ స్టోరేజీలు మాత్రమే ఉన్నాయి. అయితే, భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్‌ను ఇంట్లోని ఫ్రిజ్‌లలో కూడా స్టోర్ చేసుకోవచ్చట. అందుకే, ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్ల కంటే కొవాగ్జిన్‌పైనే భారత్ ఆశలు పెట్టుకుంది.

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి కేంద్రం ప్రత్యేక చర్యలు చేపడుతుంది. వ్యాక్సిన్‌ అందుబాటులో రానుండటంతో ఇకపై జలుబు, జ్వరంలాగే కరోనా కూడా చాలా సాధారణ జబ్బుగా మారుతుందని వైద్య నిపుణులు అంటున్నారు.


Tags

Read MoreRead Less
Next Story