డాక్టర్‌ని మోసం చేసిన అల్లా ఉద్దీన్ అద్భుత దీపం..

డాక్టర్‌ని మోసం చేసిన అల్లా ఉద్దీన్ అద్భుత దీపం..
అతీత శక్తులు ఉన్నాయని, ఆయన దగ్గర అల్లా ఉద్దీన్ అద్భుత దీపం ఉందని చెప్పారు

మాయలు, మంత్రాలు, కష్టపడకుండానే డబ్బులు వస్తాయంటే చదువుకోనేళ్లే కాదు.. బాగా చదువుకున్నోళ్లు.. డాక్టర్ బాబులు సైతం బోల్తాపడతారన్న విషయం అర్థమవుతోంది. అల్లా ఉద్దీన్ అద్భుత దీపం గురించి కధల్లో చదువుకున్నాము. సినిమాల్లో చూసి ఉంటాము.. అయితే అది నిజంగానే ఉందంటూ నమ్మించి మోసం చేశారు. 31 లక్షల రూపాయలకు డాక్టర్‌ని ముంచి మాయమయ్యారు మోసగాళ్లు. ఉత్తర ప్రదేశ్ మీరట్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇక్రముద్దీన్, అనీన్ అనే ఇద్దరు వ్యక్తులు డాక్టర్ ఎల్‌ఏ ఖాన్‌‌కు పరిచయమయ్యారు.

తల్లికి అనారోగ్యంగా ఉందని, ఇంటికి వచ్చి వైద్యం చేయమని కోరారు. వారితో ఉన్న పరిచయం కారణంగా డాక్టర్ వారి ఇంటికి వెళ్లి చికిత్స చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే నిందితులిద్దరూ ఓ బాబా గురించి డాక్లరుకు చెప్పారు. ఆయనకు ఎన్నో అతీత శక్తులు ఉన్నాయని, ఆయన దగ్గర అల్లా ఉద్దీన్ అద్భుత దీపం ఉందని చెప్పారు. దాన్ని ఉపయోగించి కోరుకున్న సంపదను పొందొచ్చని డాక్టర్‌ని బురిడీ కొట్టించారు. ముగ్గురూ కలి డాక్టర్ ఖాన్‌కి అల్లా ఉద్దీన్ అద్భుత దీపాన్ని కోటిన్నర రూపాయలకు అంటగట్టాలని ప్లాన్ చేశారు.

కానీ డాక్టర్ సాబ్ తన దగ్గర 31 లక్షలు మాత్రమే ఉన్నాయనడంతో 'చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం' అని భావించి సరే.. ఎంతో కొంత ఇవ్వమంటూ డాక్టర్ దగ్గర నుంచి 31 లక్షలు తీసుకుని మూటా ముల్లె సర్ధుకుని అక్కడి నుంచి జంపయ్యారు.. మళ్లీ డాక్టర్ కంటికి కనబడలేదు.. ఇంటికి వెళ్లి అల్లా ఉద్దీన్ అద్భుత దీపాన్ని ప్రయోగిద్దామనుకున్న డాక్టర్‌కి అందులో నుంచి నోట్లు కాదు కదా కనీసం చిల్లర కూడా రాలేదు.. తాను మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ మీరట్ సీనియర్ అధికారి అమిత్ రాయ్.. తంత్ర విద్యల పేరుతో నగరంలో ఈ తరహా వ్యక్తులు తిరుగాడుతున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు డాక్టర్‌ని మోసం చేసిన ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మూడో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story