రోజంతా మాస్క్ పెట్టుకునే ఉంటున్నారా? అయితే మీరు..

రోజంతా మాస్క్ పెట్టుకునే ఉంటున్నారా? అయితే మీరు..
ఇలా రోజంతా మాస్క్ ధరిస్తే కరోనా రాదేమో కాని మరో అనారోగ్యమేదో మిమ్మల్ని చుట్టుముడుతుందని..

ఈ కరోనా ఏమో గాని మాస్క్ పెట్టుకుంటే ఓ బాధ.. పెట్టుకోపోతే ఓ బాధలా ఉంది. మాస్క్ పెట్టుకోవట్లేదేంటని మనసు హెచ్చరిస్తున్నా పెట్టుకుంటే ఊపిరి ఆడట్లేదని పక్కన పడేయాల్సి వస్తోంది. ఇక బుద్దిగా అస్సలు మాస్క్ తీయకుండా రోజంతా సిన్సియర్‌గా పెట్టుకునే వారూ ఉన్నారు. ఇలా రోజంతా మాస్క్ ధరిస్తే కరోనా రాదేమో కాని మరో అనారోగ్యమేదో మిమ్మల్ని చుట్టుముడుతుందని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎక్కువ సేపు మాస్క్ పెట్టుకుంటే కార్భన్‌డయాక్సైడ్ స్థాయిలు పెరిగి, ఊపిరితిత్తుల సమస్యలకు దారితీస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను ఖండిస్తూ ప్రజల్లో ఉన్న అపోహల్ని తొలగించింది అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ మియామీ.

మాస్కులు ధరించడం వల్ల ఆరోగ్యవంతులైన వ్యక్తుల్లో ఆక్సిజన్, కార్బన్‌డయాక్సైడ్ స్థాయిల్లో మార్పులు జరిగి అనారోగ్యం పాలవుతారన్న వార్తల్లో నిజం లేదని తెలిపింది. అయితే అందరిలోనూ అలా జరగదని పేర్కొంది. కానీ ఊపిరితిత్తుల వ్యాధులు (క్రానిక్ అబ్‌స్ట్రాక్టివ్ పల్మనరీ డిసీజ్) ఉన్నవారిలో ఈ సమస్య ఎదురుకావొచ్చని అధ్యయనం పేర్కొంది. ఈ వ్యాధి ఉన్నవారు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారు మాస్క్ ధరిస్తే ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతారని అధ్యయన కర్తల్లో ఒకరైన మైఖేల్ కాంపోస్ తెలిపారు.

గాలి పీల్చుకునేందుకు సౌకర్యవంతంగా ఉండే మాస్కులు ధరిస్తే ఎలాంటి సమస్య ఉండదని చెబుతున్నారు. మాస్క్‌ని టైట్‌గా కట్టుకోవడంతో పాటు వేగంగా నడవడం వల్ల శ్వాస ఆడక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని తెలిపారు. నలుగురు వ్యక్తుల మధ్యలో ఉన్నప్పుడు మాస్క్ కచ్చితంగా ధరించాలని చెప్పారు. దూరంగా ఉన్నప్పుడు ధరించకపోయినా ఫరవాలేదని అన్నారు. అదే సమయంలో కరోనాకు అడ్డుకట్ట వేయాలంటే మాస్క్‌కి మించిన ప్రత్యామ్నాయం లేదని తెలిపారు. సర్జికల్ మాస్క్‌లు ధరించలేని వారు రెండు పొరలతో కూడిన క్లాత్ మాస్క్ ధరించాలని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఇదివరకెపుడో సూచించింది.

Tags

Read MoreRead Less
Next Story