దేశవ్యాప్త రహదారుల దిగ్భందానికి పిలుపునిచ్చిన రైతు సంఘాలు

దేశవ్యాప్త రహదారుల దిగ్భందానికి పిలుపునిచ్చిన రైతు సంఘాలు
తమ హక్కుల కోసం పోరాడుతున్నాం తప్ప, తాము ఉగ్రవాదులం, ఖలిస్తానీలం కాదని స్పష్టం చేశారు.

కొత్త వ్యసాయ చట్టాల రద్దుపై ఆందోళన చేస్తున్న రైతులు.. దేశవ్యాప్త రహదారుల దిగ్భందానికి పిలుపిచ్చారు. ఫిబ్రవరి 6న మధ్యాహ్నం 12 గంటల నుంచి 3గంటల వరకు దేశవ్యాప్తంగా రోడ్లను దిగ్భందించనున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించారు. దీంతో పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. రైతు ఉద్యమకారులను నిలువరించేందుకు ఢిల్లీ సరిహద్దులో మేకులు, పెద్ద ఇనుప బారికేడ్లను ఏర్పాటు చేశారు.

రహదారి మధ్యలో కాంక్రీట్​పోతపోసి అందులో పదునైన ఇనుప మేకులను అమర్చారు. పోలీసు చేతివేళ్లకు రక్షణగా ఉండేందుకు ఓ స్టీల్ తొడుగును, మరో చేతికి డాలును పోలిన తొడుగును ధరించారు. రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో.. ఢిల్లీ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది.

తమ ఉద్యమాన్ని బలహీనపర్చే ప్రయత్నాలు ఇంకా జరుగుతున్నాయన్నారు రైతు సంఘం నేతలు. అయినా తమ హక్కుల కోసం పోరాడుతున్నాం తప్ప, తాము ఉగ్రవాదులం, ఖలిస్తానీలం కాదని స్పష్టం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడాన్ని రైతులు తప్పు పడుతున్నారు. ప్రభుత్వం కావాలనే తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని విమర్శిస్తున్నారు. దేశ రాజధాని సరిహద్దుల్లో, నిరసన జరుగుతున్న ప్రదేశాల్లో పెద్ద ఎత్తున బారీకేడ్లు ఏర్పాటు చేయడాన్ని, వేల సంఖ్యలో పోలీసు బలగాల్ని మోహరించడాన్ని ఖండించారు.

Tags

Read MoreRead Less
Next Story