రైతుల ఉద్యమం.. బ్రిటన్‌ ఎంపీలకు లేఖ రాస్తామంటున్న రైతులు

రైతుల ఉద్యమం.. బ్రిటన్‌ ఎంపీలకు లేఖ రాస్తామంటున్న రైతులు

కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ.. రైతులు చేపట్టిన ఆందోళన కొనసాగుతునే ఉంది. కేంద్రంతో చర్చలు జరిపే విషయంలో నిర్ణయాన్ని రైతు సంఘాలు ఇవాల్టికి వాయిదా వేశాయి. ఏయే సవరణలు కావాలో నిర్దిష్టంగా పేర్కొని, తదుపరి విడత చర్చలకు తేదీని తెలియపరచాలంటూ కేంద్రం ఇటీవల పంపిన లేఖపై రైతు సంఘాలు చర్చించాయి. దేశవ్యాప్త రైతు నేతలతో బుధవారం మరోసారి సమావేశం నిర్వహించి ప్రభుత్వ ఆహ్వానంపై చర్చించుకోవాలని నిర్ణయించాయి. తదుపరి కార్యాచరణపై 32 సంఘాల నేతలంతా చర్చించుకున్నట్లు సింఘు సరిహద్దు వద్ద రైతు సంఘాల నేత కుల్వంత్‌సింగ్‌ తెలిపారు. బుధవారం జరిగే సమావేశంలో ఒక నిర్ణయానికి వస్తామన్నారు. జనవరి 26న భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావద్దంటూ బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌పై ఒత్తిడి తీసుకురావాలని ఆ దేశ ఎంపీలకు లేఖలు రాస్తామని తెలిపారు. ఈ నెల 25, 26 తేదీల్లో భారత రాయబార కార్యాలయాల వెలుపల పంజాబీలు ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. హర్యానా టోల్‌ప్లాజాల్లో ఈ నెల 26, 27, 28 తేదీల్లో వసూళ్లను అడ్డుకుంటామన్నారు.

మరోవైపు.. సింఘు సరిహద్దు వద్ద రైతులు చేస్తున్న నిరసనలు 27వ రోజుకు చేరుకున్నాయి. రిలే నిరాహార దీక్షలు మూడోరోజుకు చేరుకున్నాయి. రైతుల నిరసనల కారణంగా నోయిడా-గ్రేటర్‌ నోయిడా జాతీయ రహదారిపై గంటలపాటు వందలాది వాహనాలు నిలిచిపోయాయి. హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు అంబాలాలో రైతులు నల్లజెండాలతో నిరసన తెలిపారు. మరోవైపు.. మరోవైపు అంబానీ-అదానీ ఉత్పత్తుల్ని బహిష్కరించాలని రైతులు నిర్ణయించారు. ముంబయిలో ర్యాలీ నిర్వహించి, ఈ మేరకు ప్రతిజ్ఞ చేశారు. వ్యవసాయ చట్టాలపై ప్రభుత్వం మెడలు వంచాలంటే ఇదే సరైన మార్గమని భావిస్తున్నట్లు రైతు సంఘాల నేతలు తెలిపారు. రైతులను ఆదుకోవడానికి ఈ విషయంలో తమతో కలిసి రావాలని పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. రైతు చట్టాలపై కేంద్రం వైఖరి పట్ల తాను సంతృప్తి చెందడం లేదని సామాజిక ఉద్యమకర్త అన్నాహజారే తన స్వగ్రామంలో విలేకరులతో మాట్లాడుతూ స్పష్టంచేశారు.

కొత్త వ్యవసాయ చట్టాలతో నవశకం ప్రారంభమవుతుందన్నారు కేంద్ర మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌. వివాదాస్పద అంశాలపై నిరసనకారులతో చర్చలకు ఇప్పటికీ ప్రభుత్వం సిద్ధమేనన్నారు. రైతు సంఘాలు దీనిపై చర్చించుకుని చర్చల్ని పునరుద్ధరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన చట్టాలకు అనుకూలంగా తనను కలవడానికి దిల్లీ, యూపీ నుంచి వచ్చిన రెండు సంఘాలతోనూ ఆయన భేటీ అయ్యారు.

మరోవైపు కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలంటూ దేశవ్యాప్తంగా రైతుల నుంచి సేకరించిన 2 కోట్ల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని ఈనెల 24న రాష్ట్రపతికి సమర్పించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఆరోజు రాహుల్‌గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్‌ ఎంపీలు, ఇతర నాయకులు రాష్ట్రపతిని కలిసి ఈ వినతిపత్రాన్ని సమర్పించడంతోపాటు, ప్రజాసంక్షేమం దృష్ట్యా ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని కోరనున్నారు.


Tags

Read MoreRead Less
Next Story