త్వరలో అందుబాటులోకి మరో నాలుగు వ్యాక్సిన్లు : మోదీ

త్వరలో అందుబాటులోకి మరో నాలుగు వ్యాక్సిన్లు : మోదీ
కరోనా రక్కసి నుంచి రక్షించుకునేందుకు వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి.

కరోనా రక్కసి నుంచి రక్షించుకునేందుకు వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో డ్రైరన్‌ విజయవంతమైంది.. ఇక వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభం కావడమే అలస్యం.. తొలి దశలో భాగంగా మూడు కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు టీకా ఇవ్వనున్నారు. ఈ ఖర్చంతా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, రాష్ట్రాలపై ఎలాంటి భారం పడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు..

వ్యాక్సిన్‌ పంపిణీ సన్నాహాలపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్‌ సమావేశంలో మోదీ భేటీ అయ్యారు. టీకా పంపిణీ ఏర్పాట్లపై సీఎంలతో చర్చించారు. మూడు కోట్ల టీకాల పంపిణీ తర్వాత మరోసారి సీఎంలతో భేటీ అవుతానన్నారు. తదుపరి కార్యాచరణపై ఆ సమావేశంలో చర్చిద్దామని చెప్పారు.

తొలి దశలో ప్రయివేటు లేదా ప్రభుత్వ రంగాలకు చెందిన 3 కోట్ల మంది కరోనా యోధులకు టీకా ఇస్తామన్నారు. వీరిలో ప్రజా ప్రతినిధులు ఉండబోరని మోదీ స్పష్టం చేశారు. రెండో దశలో 50ఏళ్ల పైబడిన వారికి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 50ఏళ్ల లోపువారికి ప్రాధాన్యమిస్తామన్నారు.

ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కేవలం 2.5కోట్ల మంది మాత్రమే టీకా తీసుకున్నారని మోదీ అన్నారు. జులై నాటికి దేశంలో 30 కోట్ల మందికి టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాల్లో వ్యాక్సినేషన్‌ డ్రై రన్‌ పూర్తయినట్లు వెల్లడించారు. టీకాలపై వదంతులు వ్యాపించకుండా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలన్నారు.

శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాతే వ్యాక్సిన్లపై నిర్ణయం తీసుకున్నట్లు మోదీ తెలిపారు. ఇప్పటికే రెండు స్వదేశీ టీకాలకు అనుమతినివ్వగా.. మరో నాలుగు వ్యాక్సిన్లను కూడా త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు. వ్యాక్సినేషన్‌పై రియల్‌ టైం డేటా అవసరమని చెప్పిన మోదీ.. టీకా తీసుకున్న ప్రతి ఒక్కరికీ డిజిటల్‌ సర్టిఫికేట్‌ను జనరేట్‌ చేయాలన్నారు.

Tags

Read MoreRead Less
Next Story