GAS Cylinder : గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది

GAS Cylinder : గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది
డొమెస్టిక్‌ సిలిండర్‌పై 50 రూపాయలు, కమర్షియల్ సిలిండర్‌పై 350 రూపాయలు పెరిగింది

నిత్యావసరాల ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు మరో షాక్ తగిలింది. వంట గ్యాస్‌ సిలిండర్ ధరను భారీగా పెంచాయి చమురు కంపెనీలు. డొమెస్టిక్‌ సిలిండర్‌పై 50 రూపాయలు, కమర్షియల్ సిలిండర్‌పై 350 రూపాయలు పెరిగింది. పెరిగిన కంపెనీలు బుధవారం నుంచే అమల్లోకి రాగా..పెంపు నిర్ణయంపై విపక్షాలు మండిపడ్డాయి. ధరల పెంపు కేంద్ర ప్రభుత్వానికి అలవాటుగా మారిందంటూ విమర్శలు గుప్పించాయి.

సామాన్యులకు ఆయిల్‌ కంపెనీలు భారీ షాక్ ఇచ్చాయి. డొమెస్టిక్‌ సిలిండర్‌పై 50 రూపాయలు, కమర్షియల్‌ సిలిండర్‌ ధర ఏకంగా 350 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ ధరలు మార్చి ఒకటి నుంచే అమల్లోకి రానున్నాయి.దాదాపు 8 నెలల గ్యాప్‌ తర్వాత మళ్లీ డొమెస్టిక్ సిలిండర్‌ ధర పెంచారు. చివరగా 2022 జులైలో డొమెస్టిక్ సిలిండర్ ధర పెరిగింది. తాజాగా పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో డొమెస్టిక్‌ గ్యాస్‌ ధర 1155 రూపాయలకు చేరింది. ఏపీలో వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర 1161 రూపాయలకు పెరిగింది.ఇక కమర్షియల్ సిలిండర్ ధర ఏకంగా రెండు వేల మార్కును దాటింది. ప్రస్తుతం ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర 2 వేల 119 రూపాయలుగా ఉంది.


ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలుతో పాటు పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, ఈఎంఐలతో పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుగుతోంది. తాజాగా పెరిగిన గ్యాస్‌ ధరలతో సామాన్య ప్రజలపై మరింత భారం పడనుంది. సిలిండర్‌ ధర పెరిగినా కూడా సబ్సిడీ రాకపోవడం మరో ప్రతికూల అంశం. గతంలో సిలిండర్ ధర పెరిగితే సబ్సిడీ కూడా పెరిగేది. ఐతే ఇప్పుడు సబ్సిడీ ఎత్తి వేశారు. దీంతో గ్యాస్‌ సిలిండర్‌ బుక్ చేస్తే చేతి చమురు వదిలించుకునే పరిస్థితి నెలకొంది.


సిలిండర్‌ ధర పెంపుపై మండిపడ్డారు కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గే. ఈ దోపిడి ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందని ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు. ఇప్పటికే ద్రవ్యోల్బణం కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలపై ఈ నిర్ణయం మరింత భారం మోపుతుందన్నారు. ఇదే అంశంపై రాహుల్ గాంధీ సైతం ట్వీట్ చేశారు. కాంగ్రెస్‌ హయాంలో సిలిండర్‌ ధర, సబ్సీడీ, మోదీ ప్రభుత్వ హయాంలో సిలిండర్‌ ధర, సబ్సీడీలను పోల్చుతూ రాహుల్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్‌ హయాంలో 2014లో సిలిండర్‌ పై ప్రభుత్వం 810 రూపాయలు సబ్సిడీ ఇస్తే..ధర 410 రూపాయలుగా ఉండేదని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం సిలిండర్ ధర 11 వందలు దాటగా...మోదీ ప్రభుత్వం సబ్సిడీ పూర్తిగా ఎత్తివేసిందని వివరించారు రాహుల్.


మరోవైపు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ టార్గెట్‌గా కాంగ్రెస్ తన ట్విట్టర్‌ పేజీలో సెటైర్లు వేసింది.గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ధరలు పెంచినప్పుడు స్మృతి ఇరానీ నిరసన తెలిపిన ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. సిలిండర్ ధర 400 రూపాయలు ఉన్నప్పుడు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపిన స్మృతి ఇరానీ..ఇప్పుడు సిలిండర్ ధర 11 వందలు దాటినా ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించింది.


ఇక మంత్రి కేటీఆర్ సైతం సిలిండర్ ధరల పెంపుపై తనదైన శైలిలో స్పందించారు. ఎన్నికలు అయిపోగానే సిలిండర్ ధర పెంచడం మోదీ సర్కార్‌కు అలవాటుగా మారిందన్నారు. 2011లో ప్రస్తుతం కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేసిన ట్వీట్‌ను రీ ట్విట్‌ చేశారు. సిలిండర్‌ పై 50 రూపాయలు పెంచిన ప్రభుత్వం..తనను సామాన్య పౌరుడి సర్కార్‌గా చెప్పుకుంటోదంటూ 2011లో ట్వీట్ చేశారు స్మృతి ఇరానీ. ఇదే ట్వీట్‌ను వాట్‌ ఏ షేమ్‌ అంటూ రీ ట్వీట్ చేశారు కేటీఆర్.


మరోవైపు సిలిండర్ ధర పెంపును నిరసిస్తూ విజయవాడలో సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సామాన్యులపై భారం మోపడం ప్రభుత్వాలకు అలవాటుగా మారిందని నేతలు మండిపడ్డారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story