Girl Power: స్నేహితురాలి బాల్య వివాహానికి చెక్.. హెడ్ మాస్టర్ ప్రశంసలు

West Bengal
Girl Power: స్నేహితురాలి బాల్య వివాహానికి చెక్.. హెడ్ మాస్టర్ ప్రశంసలు
తోటి విద్యార్ధిని బాల్యవివాహాన్ని అడ్డుకున్న స్నేహితురాళ్లు, పశ్చిమ బెంగాల్ లో అమ్మాయిల ధైర్యానికి వెనక్కి తగ్గిన తల్లిదండ్రులు

West Bengal: చట్టాపట్టాలేసుకుంటూ రోజూ బడికి వెళ్లే ఆ చిన్నారి ఉన్నట్లుండి వెళ్లడం మానేసింది. చక్కగా చదువుకుంటూ మంచి మార్కుల కోసం పోటీవడే అమ్మాయి స్కూలుకు రాక రోజులు గడుస్తుండటంతో తోటి స్నేహితురాళ్లకు అనుమానం వచ్చింది. ఆమెను కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. ఇలా చూస్తూ కూర్చుంటే లాభం లేదు అనుకున్నారు. ఆమె ఇంటికి వెళ్లి చూశారు. వారు భయపడిందే నిజమైంది. నిన్నటి వరకూ తమతో ఆటపాటల్లో పోటీపడిన తమ స్నేహితురాలిని బలవంతంగా పెళ్లిపీటలు ఎక్కించేస్తున్నారు తల్లిదండ్రులు. ఆ తరువాత ఆ అమ్మాయిలు చేసిన పనికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


పశ్చిమ బెంగాల్ మిడ్నాపూర్ కు చెందిన బాధితురాలు తొమిదో తరగతి చదువుతోంది. నిన్నటి వరకూ చక్కగా స్కూల్ కు వెళ్లి చదువుకుంటూ తన బంగారు భవిష్యత్తు గురించి అందమైన కలలు కన్న ఆ చిన్నారికి ఆ కుటుంబ ఆర్ధిక ఇబ్బందులు శాపమయ్యాయి. ఇంకేముంది ఆడపిల్లకు పెళ్లి చేసి త్వరగా వదిలించేసుకోవాలనుకున్న తల్లిదండ్రులు ఆమెకు మెడకు ఉరితాడు బిగించేందుకు సిద్ధమయ్యారు. పెళ్లి నిశ్చయించి, బడి మాన్పించి ఇంట్లో కూర్చోబెట్టారు.


ఒంట్లో నలతగా ఉన్నా బడి మానేందుకు ఏమాత్రం ఇష్టపడని తమ స్నేహితురాలు చెప్పాపెట్టకుండా ఇన్ని రోజులు క్లాసులకు హాజరవ్వకపోవడంతో స్నేహితురాళ్లకు అనుమానం వచ్చింది. జరగకూడనిది జరిగేలోపే ఆమెను కాపాడాలని నిశ్చయించుకున్నారు. అందరూ ఏకమై ఒక్కసారిగా స్నేహితురాలి తల్లిదండ్రులను నిలదీశారు. తమ స్నేహితురాలికి ఇష్టంలేని పెళ్లి చేయవద్దని ప్రాధేయపడ్డారు. అయినా పట్టించుకోని తల్లిదండ్రులు తమ కూతురుని వెనుక ద్వారం ద్వారా పెళ్లి కొడుకు ఇంటికి తరలించేశారు.


అయినా వెనక్కి తగ్గని స్నేహితురాళ్ల బృందం పెళ్లి కొడుకు ఇంటికి పయనమైంది. వారి ఇంటి ముందు ధర్నా చేశారు. పెళ్లి పనులు విరమించుకోకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తామని బెదిరించారు. దీంతో వెనక్కి తగ్గిన తల్లిదండ్రులు మొదటికే మోసం వస్తుందేమోనన్న భయంతో పెళ్లిని విరమించుకున్నారు. అలా తమ స్నేహితురాలని రక్షించుకున్న గర్ల్ గ్యాంగ్ ను స్కూల్ ప్రిన్సిపల్ ప్రత్యేకంగా అభినందించారు. వారి సంకల్ప బలం వల్లే పెళ్లి ఆగిందని ప్రశంసించారు.

Tags

Read MoreRead Less
Next Story