భారీ వర్షం.. కేజిన్నర బంగారం కొట్టుకుపోయింది..

భారీ వర్షం.. కేజిన్నర బంగారం కొట్టుకుపోయింది..
ఆ ఆరాటంలోనే కేజీన్నర బంగారు ఆభరణాల బ్యాగును పోగొట్టుకున్నాడు

సాయింత్రం పూట భాగ్యనగరంలో భారీ వర్షం కురిస్తే ఇంటికి చేరుకునే వారి కష్టాలు ఇంతింత కాదు. ట్రాఫిక్ జాములు, పొంగి పొర్లుతున్న డ్రైనేజీలు.. నగర జీవికి వర్షం పడుతుందటేనే గుండెళ్లో రైళ్లు పరిగెడతాయి. ఎంత వర్షం అయినా ఏదో విధంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి. ఆ ఆరాటంలోనే కేజీన్నర బంగారు ఆభరణాల బ్యాగును పోగొట్టుకున్నాడు బషీర్ బాగ్ గోల్డ్ షాప్‌లో పని చేసే ఉద్యోగి ప్రదీప్. జుబ్లీహిల్స్ రోడ్ నెం. 36లోని మరో గోల్డ్ షాపులో వినియోగదారుడికి చూపించేందుకు ఒకటిన్నర కేజీల బంగారు ఆభరణాలను బ్యాగులో పెట్టుకుని అతడు వెళ్లాడు.

తిరిగి వచ్చే క్రమంలో బ్యాగును కాళ్ల మధ్య పెట్టుకుని బైక్ నడుపుతున్నాడు. ఈ లోపే భారీ వర్షం మొదలైంది. అయినా బంగారం బ్యాగు ఉందని ఎక్కడా ఆగకుండా వెళుతున్నాడు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 వద్దకు వచ్చేసరికి రోడ్డుపై వరద నీరు పొంగి పొర్లుతోంది. అయినా ఆగకుండా బైకును పోనిచ్చాడు. ఈ క్రమంలో నగల బ్యాగు జారి నీటిలో పడిపోయింది. వెంటనే గమనించుకున్న అతడు తిరిగి వెనక్కి వచ్చి చూసుకుంటే బ్యాగ్ కనిపించలేదు. కొద్ది సేపు వెతికినా ఫలితం లేదు. ఈ మేరకు ప్రదీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story