మరోసారి అసంపూర్తిగా ముగిసిన కేంద్రం, రైతు సంఘాల చర్చలు

మరోసారి అసంపూర్తిగా ముగిసిన కేంద్రం, రైతు సంఘాల చర్చలు
వ్యవసాయ చట్టాల్లో సవరణలు చేస్తామని కేంద్రం ప్రతిపాదనలు చేయగా.. చట్టాలు రద్దు చేయాల్సిందేనని రైతులు డిమాండ్ చేశారు.

కేంద్రం, రైతు సంఘాల మధ్య చర్చలు మరోసారి అసంపూర్తిగా ముగిశాయి. సోమవారం జరిగిన ఏడో విడత చర్చల్లోనూ కేంద్రం, రైతు సంఘాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఈనెల 8న మరోసారి భేటీ కావాలని నిర్ణయించాయి. వ్యవసాయ చట్టాల్లో సవరణలు చేస్తామని రైతు సంఘాలకు కేంద్రం ప్రతిపాదనలు చేయగా.. చట్టాలు రద్దు చేయాల్సిందేనని రైతులు డిమాండ్ చేశారు.

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు 39రోజులుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో రైతు సంఘాల నాయకులతో కేంద్రం మరోసారి సోమవారం సమావేశమైంది. 40 మంది రైతు సంఘాల నాయకులతో కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్, సోం ప్రకాష్‌ రెండు గంటలపాటు చర్చలు జరిపారు. అయితే ఈసారి కూడా చర్చలు కొలిక్కి రాలేదు. చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదని.. అయితే చట్టాల్లో సవరణలు చేస్తామని కేంద్ర మంత్రులు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలను రైతులు తిరస్కరించారు.

ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకుందని.. రైతు సంఘాల నుంచి ఒక్క చర్య కూడా లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అభిప్రాయపడ్డగా.. రద్దు మినహా మరే ప్రత్యామ్నాయం వద్దని రైతులు తేల్చిచెబుతున్నారు. చట్టాల రద్దుతో పాటు కనీస మద్దతు ధరపై చట్టబధ్ద హామీ ఇచ్చే వరకు వెనక్కి వెళ్లబోమని స్పష్టంచేస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story