తొమ్మిదినెలల చిన్నారిని తోసి.. తానూ దూకి..

తొమ్మిదినెలల చిన్నారిని తోసి.. తానూ దూకి..
చదువుకుని ఉద్యోగం చేసుకుంటూ తన కాళ్ల మీద తాను నిలబడింది. పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తల్లికూడా అయింది. భర్త, అత్తమామాల వేధింపులు ఆమెను బ్రతకనివ్వలేదు..

చదువుకుని ఉద్యోగం చేసుకుంటూ తన కాళ్ల మీద తాను నిలబడింది. పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తల్లికూడా అయింది. భర్త, అత్తమామాల వేధింపులు ఆమెను బ్రతకనివ్వలేదు.. నేను లేకపోతే తననెవరు చూస్తారనుకుందో ఏమో నవమాసాలు మోసి అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డనీ తనతో పాటు తిరిగి రాని లోకాలకు తీసుకుపోయింది. ఈ హృదయవిదారక ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా పంగులూరుకు చెందిన మనోజ్ఞ(28)కు గుంటూరు లక్ష్మీపురానికి చెందిన నేవీలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసే కళ్యాణ చంద్రతో మూడేళ్ల కిందట వివాహమైంది.

మనోజ్ఞ సాప్ట్ వేర్ ఇంజనీరుగా హైదరాబాదులోని ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. వీరికి తులసి అనే 9 నెలల కుమార్తె ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా మూడు నెలల నుంచి గుంటూరు వెళ్లి అక్కడే అత్తమామలతో కలిసి ఉంటున్నారు. ఇదిలా ఉండగా తరచూ అత్తమామలు, భర్త మనోజ్ఞ పుట్టింటి వారి ఆర్థిక స్థితిగతులపై గొడవపడుతుండేవారు. ఇదే విషయంపై భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. నెల రోజుల క్రితం మనోజ్ఞ తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. తనను తీసుకెళ్లకపోతే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. అనంతరం పుట్టింటి వారు వచ్చి అడిగితే తరువాత పంపిస్తామని చెప్పారు మనోజ్ఞ అత్తమామలు.

మళ్లీ గొడవలు మొదలవడంతో శనివారం ఉదయం కూతురిని తీసుకుని అయిదో అంతస్తు పైకి వెళ్లిన మనోజ్ఞ ముందు బిడ్డని పైనుంచి కిందికి పడేసి, తానూ దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు చూసుకునే సరికి చిన్నారి మరణించింది. మనోజ్ఞను ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధృవీకరించారు. ఈ మేరకు మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసారు. తన పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న మునిమనవరాలు ఇక లేదని తెలిసి ఇంటి పెద్ద తులసమ్మ బోరున విలపిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Tags

Read MoreRead Less
Next Story