రైతులపై విరుచుకుపడిన పోలీసులు.. బాష్పవాయువు, వాటర్ కెనాన్లు ప్రయోగం

రైతులపై విరుచుకుపడిన పోలీసులు.. బాష్పవాయువు, వాటర్ కెనాన్లు ప్రయోగం
రైతులపై పోలీసులు బాష్పవాయువు, వాటర్ కెనాన్లు ప్రయోగించి వారిని చెదరగొట్టడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

హర్యానాలో రైతులపై పోలీసులు విరుచుకుపడ్డారు. ఆ రాష్ట్ర సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ సభలో రైతులు నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాల్సిందేనని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హర్యానాలోని కర్నాల్ జిల్లా, కైమ్లా గ్రామంలో ఈ సభకు హాజరయ్యేందుకు నల్ల జెండాలతో, పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రైతులు బయలుదేరారు. దీంతో రైతులపై పోలీసులు బాష్పవాయువు, వాటర్ కెనాన్లు ప్రయోగించి వారిని చెదరగొట్టడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

కైమ్లా గ్రామంలో కిసాన్ మహాపంచాయత్ సభను నిర్వహించాలని సీఎం ఖట్టార్ నిర్ణయించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాల వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించేందుకు ఈ సభను ఏర్పాటు చేశారు. ఈ చట్టాలపై నిరసన తెలిపేందుకు రైతులు బయలుదేరారు. అంతకుముందు రైతు సంఘాలు ఈ కిసాన్ మహాపంచాయత్‌ను అడ్డుకుంటామని ప్రకటించడంతో కైమ్లా గ్రామంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని రైతులు, మరీ ముఖ్యంగా పంజాబ్, హర్యానా రైతులు కొన్నిరోజులుగా పట్టుబడుతున్నారు.

45రోజులకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు చేపడుతున్నారు. ఇప్పటివరకు కేంద్రంతో ఎనిమిది సార్లు రైతు సంఘాలు చర్చలు జరపగా.. అన్ని అంసపూర్తిగానే ముగిశాయి. చట్టాల్లో సవరణలు చేస్తామని కేంద్రం చెబుతుంటే.. పూర్తిగా రద్దు చేయాల్సిందేనని రైతులు పట్టుబడుతున్నారు. తొమ్మిదో విడత చర్చలు ఈనెల 15న జరగనున్నాయి.


Tags

Read MoreRead Less
Next Story