Indian Railway: ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా జనరల్‌ టికెట్లు ఈజీగా బుక్‌ చేయొచ్చు..!

Indian Railway: ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా జనరల్‌ టికెట్లు ఈజీగా బుక్‌ చేయొచ్చు..!
Indian Railway: మనదేశంలో రైళ్ళ వద్ద రద్దీ ఉంటూనే ఉంటుంది.. ఇక పండగలకి అయితే ఆ రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు..

Indian Railway: మనదేశంలో రైళ్ళ వద్ద రద్దీ ఉంటూనే ఉంటుంది.. ఇక పండగలకి అయితే ఆ రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు..ఇక అందులోనూ జనరల్‌ బోగీలు కిటకిటలాడుతూనే కనిపిస్తాయి. ఇందులో టికెట్ సంపాదించడం అంటే ఆషామాషీ విషయం కాదు. ట్రైన్ టైంకి ముందే స్టేషన్‌కి చేరుకోవడం.. గంటల తరబడి క్యూలో నిలబడటం వంటి తిప్పలు తప్పవు. అయితే ఈ తిప్పలు తొలగించేందుకే భారతీయ రైల్వే యూటీఎస్(అన్‌ రిజర్వ్‌డ్‌ టికెటింగ్‌ సిస్టమ్‌) అనే మొబైల్‌ యాప్‌ను తీసుకొచ్చింది. ఈ అప్లికేషన్‌ సాయంతో ఫోన్‌లోనే అన్ని రైల్వే టికెట్లు బుక్‌ చేయొచ్చు.

ఎలా చేయాలంటే..

ఆండ్రాయిడ్‌ వినియోగదారులైతే గూగుల్‌ ప్లేస్టోర్‌, ఐఫోన్‌ వినియోగదారులు యాప్‌ స్టోర్‌, విండోస్‌ ఫోన్‌లు వాడేవారు విండోస్‌ యాప్‌ స్టోర్‌ నుంచి యూటీఎస్(UTS) అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత ఫోన్‌ నంబర్‌, పేరు, పాస్‌వర్డ్‌ మొదలుగు వివరాలతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ పూర్తి అయ్యాక లాగిన్ అవ్వాలి.. ఆ తర్వాత టికెట్‌ బుకింగ్‌ కోసం 'నార్మల్‌ బుకింగ్‌' ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. ఆన్‌లైన్‌ టికెట్‌ కావాలనుకుంటే బుక్‌ అండ్‌ ట్రావెల్‌ (పేపర్‌లెస్‌), ప్రింటెడ్‌ టికెట్‌ కావాలనుకుంటే బుక్‌ అండ్‌ ప్రింట్(పేపర్‌) ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత మనం ఎక్కాల్సిన, దిగాల్సిన స్టేషన్‌ల వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది.

బుక్ చేశాక టికెట్‌ చూడాలనుకుంటే 'షో టికెట్‌' ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. వెంటనే మీరు బుక్‌ చేసుకున్న టికెట్‌ వివరాలు అందులో కనిపిస్తాయి. 'వ్యూ టికెట్‌'పై క్లిక్‌ చేస్తే.. టికెట్‌ కనిపిస్తుంది.'క్విక్‌ బుకింగ్‌' ఆప్షన్‌ ద్వారా ఇదివరకు బుక్‌ చేసుకున్న టికెట్‌ల వివరాలు కనిపిస్తాయి. 'ప్లాట్‌ఫాం బుకింగ్‌' ద్వారా ప్లాట్‌ఫాం టికెట్‌ తీసుకోవచ్చు. 'సీజనల్‌ టికెట్స్‌'తో కొత్తగా నెలవారీ టికెట్‌ తీసుకోవచ్చు. రెన్యూవల్‌ కూడా చేసుకోవచ్చు. 'క్యూఆర్‌ బుకింగ్‌' ఆప్షన్‌ ద్వారా.. స్టేషన్‌లోని టికెట్‌ కౌంటర్ల వద్ద క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా టికెట్‌ పొందవచ్చు.

ఇవి తప్పనిసరి :

టికెట్‌ కోసం చెల్లింపులకు ఆర్‌-వ్యాలెట్‌ ఆప్షన్‌ను ఎంచుకునే వారు ముందుగా.. దాన్ని రీఛార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. రూ.100 ఆపై మాత్రమే రీఛార్జ్‌ సాధ్యపడుతుంది. ఆన్‌లైన్‌లో లేదా, స్టేషన్‌లోని యూటీఎస్‌ కౌంటర్‌ వద్ద రీఛార్జ్‌ చేసుకోవచ్చు. ఫోన్‌లో టికెట్‌ బుకింగ్‌ కోసం ఇంటర్నెట్‌ సదుపాయం తప్పనిసరి. జీపీఎస్‌ను యాక్టివేట్‌ చేసుకోవాలి. ప్రయాణించే రోజు మాత్రమే టికెట్‌ బుక్‌ చేసుకోగలం. టికెట్‌ తీసుకున్న గంటలోపు రైలెక్కాలి. ఎంపిక చేసిన స్టేషన్‌లలో మాత్రమే ప్లాట్‌ఫాం టికెట్‌ తీసుకోగలం. పేపర్‌లెస్‌ టికెట్‌ రద్దు చేయడం కుదరదు. స్టేషన్‌ వెలుపల 5 కి.మీల పరిధిలో మాత్రమే టికెట్‌ తీసుకోవచ్చు. స్టేషన్‌ లోపల, రైల్లో ఉన్నప్పుడు కుదరదు.

పేపర్‌ టికెట్‌ బుక్‌ చేసుకున్నవారు స్టేషన్‌కు వెళ్లి అక్కడి ఏటీవీఎం/ కో-టీవీఎం, ఓసీఆర్‌ యంత్రాలు, ఓటీఎస్‌ బుకింగ్‌ కౌంటర్‌ నుంచి టికెట్‌ ప్రింట్‌ తీసుకోవచ్చు. ఇందుకోసం ఫోన్‌ నంబర్‌, బుకింగ్‌ ఐడీ నంబర్‌ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. టికెట్‌ రద్దూ చేసుకోవచ్చు. ఈ విధానంలో టికెట్‌ బుక్‌ చేసుకున్నవారు కచ్చితంగా చేతిలో టికెట్‌ కలిగి ఉండాలి. లేనిపక్షంలో జరిమానా పడుతుంది. టికెట్‌ పొందడంలో సమస్యలు, ఇతర ఇబ్బందులపై ఫిర్యాదు చేసేందుకు ఈ యాప్‌లోనే రైల్వే కస్టమర్‌ కేర్‌ నంబర్లు, ఫిర్యాదుల స్వీకరణ అప్షన్‌ కూడా ఉన్నాయి

Tags

Read MoreRead Less
Next Story