తలొంచిన టీం ఇండియా.. ఆసీస్ గ్రాండ్ విక్టరీ!

తలొంచిన టీం ఇండియా.. ఆసీస్ గ్రాండ్ విక్టరీ!
ఆసీస్ ఎనిమిది వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టగా భారత్ తన ఖాతాలో ఓ చెత్త రికార్డును నమోదు చేసింది.

అడిలైట్ వేదికగా ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ ముచ్చటగా మూడు రోజుల్లోనే ముగిసింది. తొలి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ ఎనిమిది వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టగా భారత్ తన ఖాతాలో ఓ చెత్త రికార్డును నమోదు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో భారత జట్టు కేవలం 36 పరుగులకే చేతులెత్తేయడంతో ఆసీస్ విజయం నల్లేరు పైన నడకలాగా సాగింది. 90 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్లు మాథ్యూవేడ్‌(33), జో బర్న్స్‌(51, నాటౌట్ ) నిలకడగా ఆడి తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించాక వేడ్‌ రనౌటయ్యాడు.

ఇక ఆ తర్వాత వచ్చిన లబుషేన్‌(6) ఎక్కువ సేపు క్రీజ్ లో నిలవలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన స్మిత్ (1) తో కలిసి ఇన్నింగ్స్ ని ఫినిష్ చేశాడు జో బర్న్స్‌. ఈ విజయంతో సిరీస్ లో ఆసీస్ 1-0 తో ముందంజలో ఉంది. అయితే ఈ మ్యాచ్ లో భారత్ ఇంత తక్కువ స్కోర్ చేయడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. గతంలో ఇంగ్లాండ్‌పై లార్డ్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత్ 42 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే ఇప్పుడు దానిని అధిగమించింది.

మూడో రోజు సాగింది ఇలా ..

9/1 తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్ ను ఆసీస్ బౌలర్ కమిన్స్‌ పెద్ద దెబ్బ తీశాడు. నైట్‌వాచ్‌మన్‌ జస్ప్రీత్‌ బుమ్రా(2)ను అవుట్ చేయడంతో భారత్ వికెట్ల పతనం మొదలైంది. మరో బౌలర్ హాజిల్‌వుడ్‌ కూడా రెచ్చిపోవడంతో పుజారా(0), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(4), అజింక్య రహానె(0), హనుమ విహారి(8), వృద్ధిమాన్‌ సాహా(4), అశ్విన్‌(0), ఉమేశ్‌ యాదవ్‌(4), షమి(1) వచ్సినోళ్ళు వచ్చినట్టే వెనుదిరిగారు. చివర్లో షమి రిటైర్ట్‌ హర్ట్‌గా వెనుతిరగడంతో భారత్ సెకండ్ ఇన్నింగ్స్ కి తెరపడింది.

Tags

Read MoreRead Less
Next Story