Khalistan : మానవ బాంబులను తయారు చేస్తున్న అమృత్ పాల్ సింగ్

Khalistan : మానవ బాంబులను తయారు చేస్తున్న అమృత్ పాల్ సింగ్

ఖలిస్థానీ లీడర్ అమృత్‌పాల్ సింగ్ డ్రగ్స్ డి-అడిక్షన్ సెంటర్‌లను, గురుద్వారాలను ఆయుధాల నిల్వకు ఉపయోగిస్తున్నాడని ఇంటలిజెన్స్ అధికారులు తెలిపారు. దేశంలో అరాచకాన్ని సృష్టించేందుకు ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు యువకులను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ, ఖలిస్తాన్ సానుభూతిపరుల ఆదేశానుసారం గత ఏడాది దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన అమృత్‌పాల్ యువకులను 'ఖడ్కూస్' లేదా మానవ బాంబులుగా మార్చే పనిలో నిమగ్నమయ్యాడని చెప్పారు.

పంజాబ్ పోలీసులు అమృత్ పాల్ సింగ్ ముఠాపై అణిచివేత ప్రారంభించారు. అతని నేతృత్వంలోని 'వారిస్ పంజాబ్ దే'కి చెందిన 78 మంది సభ్యులను అరెస్టు చేసినప్పటి నుంచి రాడికల్ బోధకుడు పరారీలో ఉన్నాడు. పంజాబ్‌లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్న నిపుణులు, అధికారుల అభిప్రాయం ప్రకారం, భారతదేశంతో అన్ని యుద్ధాల్లోనూ ఓడిపోయి, ఆర్థికంగా అధ్వాన్నంగా ఉన్న పాకిస్తాన్, భారతదేశం లోపల అమృతపాల్ సింగ్ వంటి తొత్తులను ఉపయోగించుకుని పాక్ ప్రజల దృష్టిని మళ్లించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తోందని అన్నారు.

అమృతపాల్ సింగ్ నుంచి అనేక ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతని కారు నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిపై "AKF" గుర్తు ఉందని అధికారులు తెలిపారు. అమృత్‌సర్‌లోని 'వారిస్ పంజాబ్ దే', గురుద్వారా నిర్వహిస్తున్న అనేక డి-అడిక్షన్ సెంటర్‌లలో అక్రమంగా ఆయుధాలు నిల్వ చేయబడుతున్నాయని అధికారులు తెలిపారు.

డి-అడిక్షన్ సెంటర్లలో చేరిన యువకులను 'గన్ కల్చర్' వైపు మళ్లిస్తున్నారని చెప్పారు. మానవబాంబులా పనిచేసి పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి బియాంత్‌సింగ్‌ను హతమార్చిన ఉగ్రవాది దిలావర్‌ సింగ్‌ మార్గాన్ని ఎంచుకోవాలని యువకులకు బ్రెయిన్‌వాష్‌ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story