తల్లిదండ్రుల ఫోటోకు చెప్పుల దండ.. ఆస్థికోసం కొడుకులు చేసిన నిర్వాకం

తల్లిదండ్రుల ఫోటోకు చెప్పుల దండ.. ఆస్థికోసం కొడుకులు చేసిన నిర్వాకం
కనిపెంచిన తల్లిదండ్రులన్న కనికరం లేకుండా కన్నబిడ్డలు అమ్మానాన్నల ఫోటోకు చెప్పుల దండ వేశారు.

చదువుకుని పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు.. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అయినా అమ్మానాన్న సంపాదించిన ఆస్తి తమకే చెందాలంటూ గొడవ.. కనిపెంచిన తల్లిదండ్రులన్న కనికరం లేకుండా కన్నబిడ్డలు అమ్మానాన్నల ఫోటోకు చెప్పుల దండ వేశారు. ఈ అమానుషం సూర్యాపేటలో చోటు చేసుకుంది. ఆస్తి పట్ల వ్యామోహం మనిషిని ఎంతటి హీనస్థితికైనా దిగజారుస్తుంది. అమ్మానాన్నకి ఒక్కపూట అన్నం పెట్టాలన్నా లెక్కలేసుకునే కొడుకులు.. వాళ్లు రెక్కలు ముక్కలు చేసుకుని కొడుకుల్ని పెద్ద చేసి ప్రయోజకుల్ని చేసి సంపాదించిన ఆస్తి సమాన వాటాలుగా వేద్దామనుకున్నారు.

కానీ ఆస్తి అంతా వారికిచ్చేస్తే తమను చూస్తారోలేదో అన్న అనుమానం. దాంతో ఆ ప్రయత్నాన్ని వాయిదా వేసుకున్నారు. అందుకే తండ్రిని బలవంతంగా కారులో తీసుకెళ్లి ఆస్తులను తమ పేరిట రాయించుకున్నారు. పట్టణానికి చెందిన రిటైర్డ్ తహసీల్దార్ నూనె సంజీవరావు, సరోజ దంపతులకు రవీందర్, దయాకర్‌తో పాటు మరో కుమారుడు కరుణాకర్, కుమార్తె కూడా ఉన్నారు. దయాకర్, రవీందర్‌లు ప్రభుత్వ ఉద్యోగులు. కరుణాకర్ ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు.

సంజీవరావుకు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో సాగు భూములు, హైదరాబాదులో ఓ ఫ్లాటు ఉంది. కుమార్తెకు వివాహం జరిపించిన సంజీవరావు దంపతులు, సూర్యాపేటలోనే చిన్న కుమారుడైన కరుణాకర్ వద్ద ఉంటున్నారు. వారసత్వంగా రావాల్సిన భూమిని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలంటూ రవీందర్, దయాకర్ గత కొన్ని రోజులుగా తండ్రిపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో సంజీవరావు భార్య సరోజ మంగళవారం తమ ఇద్దరు కొడుకులు రవీందర్, దయాకర్‌పై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వాళ్లిద్దరూ తాము దిగిన ఫోటోకు చెప్పుల దండ వేసి అవమానించారని, పెద్ద కుమారుడు రవీందర్, అతడి కుమారులు ప్రశాంత్, భాస్కర్ కలిసి.. తన భర్తను బలవంతంగా వాహనంలో తీసుకువెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రవీందర్ ఇంటికి వెళ్లి విచారించగా తమ తండ్రి నుంచి బలవంతంగా ఆస్తి రిజిస్ట్రేషన్ చేయించుకున్న విషయం అంగీకరించారు. రవీందర్, దయాకర్, ప్రశాంత్, భాస్కర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండుకు తరలించినట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story