ఆహా! ఏమి హాయిలే హలా.. ఇది ఇండియన్ రైలా..

ఆహా! ఏమి హాయిలే హలా.. ఇది ఇండియన్ రైలా..
సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉంటాయన్న అపవాదు మోస్తోంది రైల్వే శాఖ. వీటన్నింటికీ చెక్ పెడుతూ రైలు బోగీలను కొత్తగా డిజైన్

రైల్లో ప్రయాణం.. బెర్త్ దొరికితే బాగానే ఉంటుంది కానీ కూర్చుని ప్రయాణం చేయడమంటే కాస్త కష్టమే.. ఆధునిక సౌకర్యాలు జోడిస్తూ అత్యాధునికంగా సీటు మార్చేస్తే.. అచ్చంగా విమాన సీట్లను తలపిస్తే.. రైలు ప్రయాణం ఏమి హాయిలే అనుకోము. సాధారణ, మధ్యతరగతి వాహనం రైలు.. రోజుకి లక్షల మంది రైల్లో ప్రయాణం చేస్తుంటారు. దూర ప్రాంతాలంటే రైలెక్కాల్సిందే.

ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే వ్యవస్థల్లో ఇండియన్ రైల్వే వ్యవస్థ కూడా ఒకటి. దీనిలో 13 లక్షల మందికి పైగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంత మందికి ఉద్యోగావకాశాలు కల్పించే అతి పెద్ద సంస్థ ఇదే కావడం గమనార్హం. దేశంలో సుమారు లక్షా పదిహేను వేల మైళ్ల పొడవున రైలు మార్గాలున్నాయి. అలాగే 13వేలకు పైగా రైళ్లున్నాయి. కానీ ప్రయాణీకులు సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉంటాయన్న అపవాదు మోస్తోంది రైల్వే శాఖ.

వీటన్నింటికీ చెక్ పెడుతూ రైలు బోగీలను కొత్తగా డిజైన్ చేస్తోంది ఇండియన్ రైల్వేస్. ఈ బోగీలు, అందులో ఉన్న సదుపాయాలు చూస్తే ఇది రైలా లేక విమానమా అని ఆశ్చర్యపోక తప్పదు. నూతనంగా తయారు చేస్తున్న బోగీల గురించి వివరిస్తూ.. రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఓ వీడియో పోస్ట్ చేశారు. 'ప్రయాణాన్ని జ్ఞాపకాల్లో కొలవాలి కానీ, మైళ్లలో కాదు అనే సూక్తిని ప్రస్తావించారు.

ఇండియన్ రైల్వేస్ తయారు చేస్తున్న కొత్త విస్తాడోమ్ బోగీలను మీరూ చూడండి.. వీటిలో ప్రయాణిస్తే మీరు కచ్చితంగా మర్చిపోలేని అనుభవాన్ని పొందుతారు అని పేర్కొన్నారు. ఈ విస్తాడోమ్ బోగీల్లో సీట్ల మధ్య గ్యాప్‌తో పాటు సీట్లు కూడా చాలా సౌకర్యవంతంగా ఉన్నాయి.. ప్రతి బోగీలో సీసీ కెమెరాలు అమర్చారు. వీడియో చూస్తే.. ఒక్క క్షణం మనం చూస్తున్నది రైలా లేక విమానమా అని ఆశ్చర్యం కలగకమానదు.

Tags

Read MoreRead Less
Next Story