ఢిల్లీ రైతులకు మద్దతుగా రాహుల్, ప్రియాంక గాంధీ ర్యాలీ

ఢిల్లీ రైతులకు మద్దతుగా రాహుల్, ప్రియాంక గాంధీ ర్యాలీ
రైతులకు మద్దతుగా ఢిల్లీలో రాహుల్, ప్రియాంక గాంధీ ర్యాలీ చేపట్టారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతిచ్చారు.

రైతులకు మద్దతుగా ఢిల్లీలో రాహుల్, ప్రియాంక గాంధీ ర్యాలీ చేపట్టారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతుల సంఘాలతో కేంద్రం తొమ్మిదో దఫా చర్చలు జరుపుతున్న సమయంలోనే కాంగ్రెస్ ఈ ర్యాలీ చేపట్టింది. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు రాహుల్‌, ప్రియాంక గాంధీ

సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తోన్న రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరుగుతోన్న తొమ్మిదో విడత చర్చలకు రైతు సంఘాల తరపున 41 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యంగా నూతన వ్యవసాయ చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకి చట్టబద్దత కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అంతేకాకుండా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ముందుకు కూడా వెళ్లేది లేదని స్పష్టంచేస్తున్నాయి. ప్రభుత్వానికి, రైతులకు మధ్య చర్చల్లో కేంద్రమే విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నాయి.

ఓ వైపు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు పట్టుబడుతుండగా ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గేది లేదని స్పష్టంచేస్తోంది. అయితే, రైతులకు అభ్యంతరం ఉన్న చట్టంలో మార్పులకు మాత్రం సిద్ధమని కేంద్రం చెబుతోంది. కేంద్రం దిగిరాకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో ఈ రోజు చర్చల ఫలితాలపై ఆసక్తి నెలకొంది.

రిపబ్లిక్ డే రోజున తలపెట్టిన ట్రాక్టర్ పరేడ్‌ను సుప్రీంకోర్టు ఆదేశిస్తే ఉపసంహరించుకుంటామని భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ ప్రతినిధి రాకేష్ తెలిపారు. అవసరమైతే మరో రోజు పరేడ్‌ నిర్వహిస్తామని చెప్పారు. అనుకున్న ప్లాన్‌ ప్రకారం సజావుగా సాగితే గనక.. రిపబ్లిక్ డే రోజున ఎర్రకోట నుంచి ఇండియా గేట్ వరకూ ఊరేగింపు నిర్వహించి, అమర్ జవాన్ జ్యోతి వద్ద త్రివర్ణ పతాకం ఎగురవేస్తామని తెలిపారు.

నూతన వ్యవసాయ చట్టాల అమలును సుప్రీంకోర్టు నిలిపేసిన తర్వాత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మొదటిసారి స్పందించారు. సుప్రీంకోర్టు రూలింగ్‌ను కేంద్ర ప్రభుత్వం స్వాగతిస్తోందని చెప్పారు. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ పిలిచినపుడు కేంద్ర ప్రభుత్వం తన ఆలోచనలను వివరిస్తుందని చెప్పారు. మరోవైపు సుప్రీంకోర్టు ప్రతిపాదించిన కమిటీతో మాట్లాడటం కంటే ప్రభుత్వంతో చర్చలు జరపడమే మెరుగని భారతీయ కిసాన్ యూనియన్ అభిప్రాయపడింది.

Tags

Read MoreRead Less
Next Story