లీటర్ పెట్రోల్ @ 60.. ఎక్కడో చెబితే వెళ్లి..

లీటర్ పెట్రోల్ @ 60.. ఎక్కడో చెబితే వెళ్లి..
Litre Petrol @ Rs.60: ఏంటి అక్కడ ఒక్క చోటే ఎందుకు ఇవ్వాలి.. దేశంలో మీ ప్రభుత్వమే కదా ఉంది..ఇది ఎన్నికల డ్రామా అని ప్రతిపక్షాల తీవ్ర విమర్వులు చేస్తున్నాయి.

ఎన్నికలు వస్తే చాలు.. రాజకీయ నాయకుల నాలుక ఎటు తిరుగుతుందో చెప్పలేం. ఓట్లే ముఖ్యం, గెలుపే ప్రధానం. దాని కోసం ఎలాంటి హామీలైనా ఇస్తారు. కేరళలో బీజేపీ కూడా అలాంటి హామీనే ఇచ్చింది. కేరళలో గనక బీజేపీని గెలిపిస్తే.. లీటర్ పెట్రోల్ కేవలం 60 రూపాయలకే అందిస్తామని చెప్పుకొచ్చింది. కేరళ బీజేపీ లీడర్‌ కుమ్మనన్‌ రాజశేఖరన్‌ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పెరుగుతున్నపెట్రోల్‌, డీజిల్ ధరలతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సామాన్యులు నలిగిపోతుంటే... ఒక్క కేరళలో మాత్రమే పెట్రోల్‌ రేట్లు తగ్గిస్తామని చెప్పడం ఎంత వరకు కరెక్ట్ అని జనం ప్రశ్నిస్తున్నారు.

మొన్నామధ్య బిహార్‌లో కూడా ఇదే తరహా హామీ ఇచ్చారు. బిహార్‌లో గెలిస్తే కరోనా వ్యాక్సిన్‌ ఫ్రీ అన్నారు. దీంతో దేశవ్యాప్తంగా విమర్శలు వినిపించాయి. చేసేది లేక దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్‌ ఉచితం అని ప్రకటించారు. కేరళలో పెట్రోల్ ధరలు తగ్గించగలిగినప్పుడు.. దేశవ్యాప్తంగా ఎందుకు తగ్గించలేరనే ప్రశ్న వేస్తున్నారు. కేరళలో ఉన్న వాళ్లే మనుషులా, బీజేపీకి కేరళ మినహా మిగతా రాష్ట్రాల ప్రజలు కనిపించడం లేదా అని విమర్శిస్తున్నారు.

కేరళలో బీజేపీని గెలిపిస్తే.. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీలో చేర్చుతాం అని చెప్పడం కూడా దుమారం రేపుతోంది. దేశ ప్రజలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాల్సిన నిర్ణయాన్ని.. కేవలం కేరళ ఎన్నికల కోసం ఎలా అమలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ముందు కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించి.. చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కేరళ కాంగ్రెస్ పార్టీ హితవు పలికింది.

Tags

Read MoreRead Less
Next Story