బాబు కోటీశ్వరుడు.. పాలు అమ్మేందుకు హెలికాప్టర్ కొన్నాడు

బాబు కోటీశ్వరుడు.. పాలు అమ్మేందుకు హెలికాప్టర్ కొన్నాడు
పక్కూరికి వెళ్లి పాలు అమ్మాలంటే సైకిలో, బండో కావాలి.. మరి వేరే రాష్ట్రానికి వెళ్లి పాలు అమ్మాలంటే హెలికాప్టర్ కావాలి..

ఒకప్పుడు పక్క ఊరికి వెళ్లి పాలు అమ్మాలంటే సైకిల్.. ఆ తరువాత టూ వీలర్.. ప్రజెంట్ హెలికాప్టర్ అయితే బెటర్.. మరి నేను చాలా బిజీ.. అసలు టైమ్ లేదంటున్నారు జనార్థన్ భోయిర్. ఆ ఎంతండి నా సంపాదనలో సగం మాత్రమే ఖర్చు పెట్టి హెలికాప్టర్ కొన్నాను.. జస్ట్ రూ.30 కోట్లు.. ఏడాదిలో మళ్లీ తిరిగి సంపాదించేస్తానన్న గాట్టి నమ్మకం నాకు ఉంది.. నా సత్తా ఏంటో నాకు బాగా తెలుసు.. కష్టపడి పని చేస్తే కాసులు అవే వస్తాయన్న సూత్రం మా నాన్న నాకు చెప్పాడు.. అదే సూత్రాన్ని ఇప్పటికీ పాటిస్తున్నాను.. ఏ వ్యాపారం చేసినా అందులో నెంబర్ వన్‌గా నిలుస్తున్నాను. అందుకే హెలికాప్టర్ కొన్నాను అంటూ కాలరెగరేస్తున్నారు జనార్థన్.

మహారాష్ట్రలోని భివాండి నగరానికి చెందిన రైతు, పారిశ్రామికవేత్త అయిన జనార్ధన్ భోయిర్ తన వ్యాపార పర్యటనల కోసం దేశవ్యాప్తంగా పర్యటించేందుకు వీలుగా ఒక హెలికాప్టర్ కొనుగోలు చేశారు. బిల్డర్ అయిన భోయిర్ ఇటీవలే పాడి వ్యాపారంలోకి అడుగుపెట్టారు. తన వ్యాపార లావాదేవీల నిమిత్తం ప్రతి రోజూ వివిధ ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తుంటారు. తన ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేందుకు ఓ బ్రహ్మాండమైన ఐడియా చేశారు. రూ 30 కోట్లు పెట్టి హెలికాప్టర్‌ను కొనుగోలు చేశారు.

కొత్తగా పాడి వ్యాపారంలోకి ప్రవేశించిన కారణంగా వ్యాపారం పుంజుకోవాలంటే వివిధ ప్రాంతాలకు విస్తరింపజేయాలి. అందుకోసం తాను తరచుగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు వెళ్ళవలసి వస్తుందని, అందువల్ల హెలికాప్టర్ కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా హెలికాప్టర్ కోసం ఆర్డర్ పెట్టుకున్నారు. అది మార్చి 15న అతడి ఇంటికి వస్తుంది.

భోయిర్ తనకున్న 2.5 ఎకరాల భూమిలో కొంత భూమిని హెలికాప్టర్ గ్యారేజ్‌తో పాటు పైలట్‌కు, టెక్నీషియన్‌కు ఓ గదిని కూడా నిర్మించారు. పెద్ద పెద్ద కంపెనీలకు భివాండిలో అధిక సంఖ్యలో గిడ్డంగులు ఉన్నాయి. గిడ్డంగి యజమానులు అద్దెల రూపంలో డబ్బును బాగానే ఆర్జిస్తుంటారు. మెర్సిడెస్, ఫార్చ్యూనర్, బిఎమ్‌డబ్ల్యూ, రేంజర్ రోవర్ వంటి హై రేంజ్ కార్లను వాడే గిడ్డంగుల యజమానులకు ఇక్కడ కొదవలేదు. జనార్ధన్ భోయిర్‌కి కూడా ఇలాంటి గిడ్డంగులు చాలానే ఉన్నాయి. వాటి నుంచి అతడికి అద్దెల రూపంలో పెద్ద మొత్తంలోనే డబ్బు వస్తుంది. ఇప్పుడు కొత్తగా పాల వ్యాపారం కూడా తోడయ్యింది. మరి క్షణం తీరిక లేని ఆయన పాలు అమ్మేందుకు పక్క రాష్ట్రానికి వెళ్లాలంటే హెలికాప్టర్ కంపల్సరీ అనుకున్నారు. అందుకే కొనేశారు.

Tags

Read MoreRead Less
Next Story